పత్తిని మింగుతున్న అప్పులోళ్లు!

పత్తిని మింగుతున్న అప్పులోళ్లు! - Sakshi


♦ అప్పు కింద రైతు కళ్ల ముందే పంట తీసి అమ్ముకుంటున్న వైనం

♦ రూ.4,100 మద్దతు ధరకు కేవలం రూ. 2,700 చెల్లింపు

♦ హమాలీ, కూలీ ఖర్చులు పోనూ మిగతా సొమ్ము రుణం కింద జమ

♦ పంట పోగా ఇంకా అప్పు పడుతున్న అన్నదాతలు

♦ తెల్లవారుతుండగానే రైతుల ఇళ్ల ముందు వాలిపోతున్న వడ్డీ వ్యాపారులు

♦ వేధింపులు తట్టుకోలేక రాత్రివేళ ఊరి బయట పడుకుంటున్న రైతులు

 

 ‘వడ్డీ నియంత్రణ చట్టాన్ని అమల్లోకి తెస్తాం.. అన్నదాతలను వడ్డీ వ్యాపారుల నుంచి కాపాడుతాం..’  

 - అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన

 ‘పంట మీద ఇస్తమని అప్పుదెచ్చిన.. షావుకార్లు పక్క మీదనే దొరికిచ్చుకుంటళ్లు.. ఒక్కని కంటే జెప్పొచ్చు.. పురుగు మందులోడు.. ఎరువు బస్తాలోడు.. ఇత్తనం ఇచ్చిన సేటు.. ఇంత మంది ఇంటి మీద పడుతున్నరు. ఎకరానికి రెండు కింటాల్ కూడా ఎల్లేటట్టు లేదు. ఈ పత్తి ఎవరికిద్దు.. అప్పెట్టా తీరుద్దు..?’  

 - గజ్వేల్ మండలం సంగుపల్లెకు చెందిన రైతు బీరప్ప ఆవేదన!

 

 అంతో ఇంతో చేతికందే పత్తి పంటను కూడా వడ్డీ వ్యాపారులు గద్దల్లా తన్నుకుపోతున్నారు! తెల్లవారుతుండగానే రైతులను తీసుకువెళ్లి వారి ముందే పంటను తీసుకుంటున్నారు. ఏ రోజు తీసిన పంటను ఆ రోజే కాంటా పెడుతున్నారు. వచ్చిన డబ్బును ఇచ్చిన అప్పు కింద జమ చేసుకుంటున్నారు. షావుకార్లు ఎప్పుడొచ్చి తీసుకుపోతారేమోనన్న భయంతో రైతులు రాత్రి వేళ ఇళ్లు విడిచి, ఊరు బయటే నిద్రపోతున్నారు. దుర్మార్గమైన ఈ వ్యవహారం మెదక్ జిల్లాలో సాగుతోంది.



 జిల్లా రైతులపై రూ.1,900 కోట్ల రుణం..

 జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో దాదాపు 4.20 లక్షల మంది రైతులు 3.10 లక్షల హెక్టార్లలో పంట సాగు చేశారు. ఇందులో దాదాపు 1.95 లక్షల హెక్టార్లలో పత్తి సాగైనట్టు వ్యవసాయ శాఖ నివేదికలు చెప్తున్నాయి. పత్తి పెట్టుబడుల కోసం రైతులు సుమారు రూ.1,100 కోట్లు ప్రైవేటు అప్పులు చేసినట్టు అంచనా. వీటికి వడ్డీ కలుపుకుంటే దాదాపు రూ.1,900 కోట్లు ఈ సీజన్‌లో రైతులు వడ్డీ వ్యాపారులకు చెల్లిం చాల్సి ఉంది. మే నెల రెండు, మూడో వారంలో రైతులకు అప్పులు అవసరం. కానీ బ్యాంకులు ఆగస్టు, సెప్టెంబర్‌లో పంట రుణాలిస్తున్నాయి. దీంతో రైతులు షావుకార్లు, గ్రామంలోని భూస్వాములు, ఇతర ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వారు రైతు అవసరాన్ని బట్టి రూ.5 నుంచి రూ.10 వడ్డీతో అప్పులిస్తున్నారు. అవి కూడా నగదుగా కాకుండా ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల రూపంలో ఇచ్చి లెక్క రాసుకుంటున్నారు. వీటి ధరలు ఎమ్మార్పీ కంటే 25 నుంచి 30 శాతం అధికం చేసి రాసుకుంటారు. పత్తి పంట అమ్మగానే అసలు, వడ్డీ కలిపి తీసుకుంటారు.



 అన్నదాతను బొమ్మను చేసి

 ఈ ఏడాది  వర్షాలు అసలే లేకపోవడంతో పత్తి దిగుబడి పూర్తిగా పడిపోయింది. ఎకరానికి 2 నుంచి 3 క్వింటాళ్ల కంటే ఎక్కువొచ్చే పరిస్థితి లేదు. దీంతో అప్పులు వసూలు చేసుకునేందుకు వడ్డీ వ్యాపారులు ఎగబడుతున్నారు. మొదటి కాపు పత్తి చేతికి వస్తుండటంతో షావుకార్లు.. కోడికూయక ముందే రైతుల ఇంటికి వెళ్తున్నారు. కూలీలను సైతం వారే మాట్లాడుకొని రైతును బొమ్మలాగా పంటచేలో నిలబెట్టి పత్తి ఏరిస్తున్నారు. ఏ రోజు తీసిన పత్తిని ఆ రోజే అమ్ముతున్నారు.



ప్రభుత్వం పత్తికి రూ 4,100 ధర ప్రకటించగా.. వడ్డీ వ్యాపారులు పచ్చి పత్తి తూకం ఎక్కువ వస్తుందన్న కారణంతో క్వింటాల్‌కు కేవలం రూ 2,700 నుంచి రూ 3,000 మాత్రమే లెక్కలు గడుతున్నారు. వచ్చిన మొత్తంలోంచి హమాలీ, కూలీల ఖర్చులు కూడా తీసేసి మిగిలిన డబ్బును తమ అప్పు కింద జమ చేసుకుంటున్నారు. ఇవన్నీ పోనూ రైతులు... వ్యాపారికి ఇంకా రుణ పడే ఉంటున్నారు. ఎలాగో అలా ఒక్కరి అప్పు తీర్చగానే.. ఎరువులు, పురుగుల మందు వ్యా పారులు ఇంటి ముందు కూర్చుకుంటున్నారు. వీళ్ల బాధలకు వేగలేక రైతులు రాత్రి వేళ ఇళ్లను వదిలి, ఊరి బయట ఎక్కడో నిద్ర చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టు వడ్డీ నియంత్రణ చట్టం అమలు చేస్తే కాస్త ఆత్మగౌరవంతో బతికే రోజులు వస్తాయని రైతులు ఎదురు చూస్తున్నారు.    

     -సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top