రెండున్నరేళ్లలో ఏం చేశారు?

రెండున్నరేళ్లలో ఏం చేశారు? - Sakshi


- బహిరంగచర్చకు సిద్ధమా?

- బాబుకు ఉండవల్లి డిమాండ్

- కేసీఆర్, బాబు ఒక్కమాటపై ఉన్నంతకాలం ‘ఓటుకు కోట్లు’ కేసు సాగు..తూనే ఉంటుంది

 

 సాక్షి, విశాఖపట్నం:
రెండున్నరేళ్ల పాలనలో ఏం చేశారు.. విభజన చట్టంలోని హామీలు ఎన్ని అమలు చేశారన్న దానిపై బహిరంగచర్చకు రావాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. తనకే పార్టీతోనూ సంబంధం లేదని, తన వాదనలు తప్పయితే బహిరంగంగా క్షమాపణ చెప్పి తప్పుకుంటానన్నారు. పట్టిసీమ, పోలవరం, అమరావతిపై చర్చకు రమ్మని అడిగాను.. ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదన్నారు. విశాఖ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ‘మీట్ ది ప్రెస్’లో ఉండవల్లి మాట్లాడారు. ఏపీలో రాష్ర్టప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.



ప్రభుత్వ వైఫల్యాలపై కోర్టులో కేసు వేసిన సీనియర్ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్‌ను ఉన్మాదితో పోల్చడం అన్యాయమన్నారు. పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నామని నాడు చెప్పిన వెంకయ్యనాయుడు ఇప్పుడు హోదాకు మించి ప్యాకేజీ ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఉండవల్లి ప్రశ్నించారు.  హోదా సంజీవని కాదని  బాబు చెప్పినప్పుడే టీడీపీ, బీజేపీలు కలిసే నాటకమాడాయని అర్థమైందన్నారు. కోర్టుకెళ్దామంటే.. ‘కోర్టులో బాబుకు వ్యతిరేకంగా ఏమీ రాద ండి. అక్కడంతా బాబుకు అనుకూలంగానే వస్తాయని’ తెలంగాణ  ఏజీ చేసిన వ్యాఖ్యలు వెనక్కి లాగుతున్నాయన్నారు.  



 వైఎస్ ఆలోచనే వేరు

 ‘‘పోలవరం విషయంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనే వేరు. దాన్నికడితే 960 మెగావాట్ల విద్యుత్ వస్తుంది. తుని, కొండపల్లి తదితర ప్రాంతాల్లో 100 టీఎంసీలు పంప్ చేసి నిల్వచేసేందుకు రిజర్వాయర్లను కూడా వైఎస్ గుర్తించారు. అందుకే ఎలాంటి అనుమతుల్లేకుండా కాలువలు తవ్వేశారు. పొరుగు రాష్ట్రాలనుంచి సమస్యలున్నాయని గుర్తించి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కేంద్రాన్ని ఒప్పించారు. అలాంటి ప్రాజెక్టును పూర్తిచేసే ఆలోచన బాబుకు లేదు. అందువల్లే పట్టిసీమ కట్టారు.. పురుషోత్తపట్నం కడుతున్నారు. 2018లో పోలవరం పూర్తయితే ఇక పురుషోత్తపట్నం ఎందుకు?’’ అని ఉండవల్లి ప్రశ్నించారు. కాగా, ‘ఓటుకు కోట్లు’ కేసులో కేసీఆర్, చంద్రబాబు ఒక్కమాటపై ఉన్నంతకాలం ఎన్నాళ్లయినా సాగు..తూనే ఉంటుందని అన్నారు. అయితే రేవంత్‌రెడ్డి తప్పించుకునే అవకాశంలేదని, లేటెస్ట్ టెక్నాలజీతో డూప్లికేట్ రేవంత్‌ను తయారుచేసి పంపిస్తేతప్ప బయటపడే వీల్లేదన్నారు. 2018 బడ్జెట్ తర్వాత టీడీపీ దాదాపు ఖాళీ అయిపోతుందన్నారు.



 జగన్‌పై విమర్శల్లో పసలేదు

 ‘‘జగన్‌పై నమోదైన చార్జిషీట్ల విలువ రూ.1,365 కోట్లే.. అదీ అంతా చట్టబద్ధమే. కానీ టీడీపీవాళ్లు మాటిమాటికీ లక్ష కోట్లు తిన్నావంటూ ఆయన్ను విమర్శించడంలో పసలేదు’’ అని ఉండవల్లి అన్నారు. ‘‘ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినవారిలో ఎవరైనా వైఎస్ ప్రభుత్వ హయాంలో లబ్ధిపొందారా అన్న లెక్కలుకూడా తీసి.. ఇక్కడ లబ్ధిపొందారు కాబట్టి అక్కడ పెట్టుబడి పెట్టారని చార్జిషీటులో చెప్పుకొచ్చారు. అయితే జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడానికి, వైఎస్ హయాంలో లబ్ధిపొందడానికి సంబంధం లేదు. పైగా వాళ్లు పెట్టిన సొమ్ములన్నీ వైట్‌మనీయే. అయినా వీటిని కోర్టులు తేలుస్తాయి’’ అని ఆయన అన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top