రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల మృతి - Sakshi


మొయినాబాద్‌: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మృతి చెందారు. వారాంతపు సెలవులను సదరాగా గడిపేందుకు శనివారం హైదరాబాద్‌ నుంచి వికారాబాద్‌ జిల్లా అనంతగిరికి వెళ్తుండగా మొయినాబాద్‌ మండలం అప్పారెడ్డిగూడ గేటు దాటగానే ఈ దుర్ఘటన జరిగింది. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలూకా చాగలమర్రి మండ లం చిన్నవంగలికి చెందిన కంసాని రామ్మో హన్‌రెడ్డి, చిత్తూరు జిల్లా రంగసముద్రం మండలం కాశవారిపల్లికి చెందిన గుండం సుబ్రహ్మణ్యం, గచ్చిబౌలిలో ఉంటున్న శ్రీనివాస్, మధు, మనోజ్, వంశీ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలో ఉన్న టీసీఎస్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు.



వీరంతా స్నేహితులు. వారాంతపు సెలవులను సరదా గా గడిపేందుకు శనివారం తెల్లవారుజామున అనంతగిరికి మూడు బైకులపై బయలు దేరారు. హైదరాబాద్‌–బీజాపూర్‌ రహదారి పై మొయినాబాద్‌ మండలం అప్పారెడ్డిగూడ గేటు దాటగానే ఎదురుగా వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం రామ్మోహన్‌రెడ్డి (24), సుబ్రహ్మణ్యం(24)ల బైకును ఢీకొట్టింది. దీంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.  



పొగమంచు కారణంగానే...

శనివారం ఉదయం భారీగా పొగమంచు కమ్ముకుంది. ఈ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం రోడ్డుకు కుడివైపునకు దూసుకుపోయి బైక్‌ను ఢీకొట్టినట్లు సంఘటనాస్థలంలో ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అక్కడ బ్రేక్‌ వేసినట్టుగా కూడా లేదు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు అక్కడక్కడ ఉన్న సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. రామ్మోహన్‌రెడ్డికి ఇటీవలే ఇటలీలో ఉద్యోగం వచ్చింది. త్వరలో అక్కడికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగానే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top