మైనర్లుగా అదృశ్యం..మేజర్లుగా ప్రత్యక్ష్యం

మైనర్లుగా అదృశ్యం..మేజర్లుగా ప్రత్యక్ష్యం


పిల్లల ఆచూకీ కోసం సీఐడీని ఆశ్రయించిన తల్లి

ఇంట్లో మార్పు వచ్చేంత వరకూ వెళ్ళేది లేదన్న కూతుళ్ళు

పదేళ్లుగా అనాథాశ్రమంలో ఆశ్రయం




మారేడుపల్లి:  అదృశ్యమైన తన కూతుళ్ళ ఆచూకీ కనుక్కోవాలంటూ ఓ తల్లి  ప్రిన్సిపాల్‌ సెక్రటరీ, సీఐడి, నార్త్‌ జోన్‌ డిసిపి ని ఆశ్రయించడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారు ఓ స్వచ్చంద సంస్థ లో ఆశ్రయం పొందుతున్నట్లు గుర్తించి, తల్లికి అప్పజెప్పే ప్రయత్నం చేశారు. అయితే తల్లి ప్రవర్తనలో మార్పు వస్తే తప్ప, తాము వేళ్ళేది లేదంటూ సదరు కుమార్తెలు భీష్మించుకున్నారు. మారేడుపల్లి సీఐ ఉమమాహేశ్వర్‌ రావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. అల్వాల్‌  లోతుకుంటకు చెందిన లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు. చిన్నతనంలోనే భర్త మరణించడంతో ఇళ్లలో పాచి పని చేసుకుంటూ జీవనం సాగించేది. మధ్యానికి బానిసైన లక్ష్మి తన కుమార్తెలు సురేఖ ,జ్యోతి ల ను చిత్రహింసలకు గురిచేస్తుండటంతో 2008లో వారు ఇంటినుంచి పారిపోయి మారేడుపల్లిలో ఉంటున్న పెద్ద నాన్న రాములును ఆశ్రయించారు. దీంతో అక్కడికి వెళ్లిన లక్ష్మి తన బిడ్డలను అప్పగించాలని గొడవపడటంతో బిడ్డలను తల్లికి అప్పగించారు. అయితే తల్లితో వెళ్ళడం ఇష్టంలేని వారు అందుకు నిరాకరించడంతో పికెట్‌ బస్తీ వాసులు వారిని చేరదీసి స్థానిక నాయకురాలు దమయంతి సహకారంతో మహెంద్రహిల్స్‌ లోని ‘జాయ్‌ ఫర్‌ చిల్డ్రన్‌’ స్వచ్చంద సంస్థకు అప్పగించారు. నిర్వాహకురాలు డాక్టర్‌ జ్యోతి వారి కి విద్యాబుద్దులు నేర్పించింది. ప్రస్తుతం సురేఖ  ( 21 ) యం. యల్‌. టి చదువుతుండగా, జ్యోతి (20) డిగ్రీ చదువుతోంది.



పిల్లల ఆచూకి కోసం సీఐడి కి ఫిర్యాదు చేసిన తల్లి

గత ఏడాది నవంబర్‌లో తన పిల్లల ఆచూకీ  తెలియడం లేదని, వారి పెద్ద నాన్న రాములు తన బిడ్డలతో అనైతికమైన పనులు చేయిస్తున్నాడని లక్ష్మి ప్రిన్సిపల్‌ సెక్రటరీకి, సీఐడీ విభాగానికి , పోలీస్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన  మారేడుపల్లి పోలీసులు పెద్దనాన్న రాములు, అతని భార్య గంగమ్మ ను విచారించగా, 2008 లో తన దగ్గర కు వచ్చిన పిల్లలను అప్పుడే తల్లి కి అప్పజెప్పినట్లు తెలిపారు. దయమణి ద్వారా పిల్లలు ఉంటున్న స్వచ్చంద సంస్థ ఆశ్రమాన్ని గుర్తించిన పోలీసులు, పిల్లలను వారి తల్లి కి అప్పగించేందుకు ప్రయత్నించారు. అయితే వారు తమ తల్లి వద్దకు వెళ్ళెది లేదని , చిన్నతనం నుంచి ఆశ్రమంలోనే పెరిగామని, అక్కడే ఉంటామని తెల్చి చెప్పారు. పోలీసులు వారిని కోర్టులో హాజరు పరిచారు. మేజర్లయినందున వారి సొంత నిర్ణయం తీసుకోవచ్చన్న కోర్టు, పిల్లల ఇష్ట ప్రకారం వారు కోరుకున్న చోటుకి చేర్చాలని ఆదేశించింది. దీంతో వారిని స్టేట్‌ హోం కు తరలించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top