ప్రమాదాల మలుపు

ప్రమాదాల మలుపు - Sakshi


► ప్రమాదాలకు కారణమవుతున్న మూల మలుపులు

► పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారులు




లక్ష్మణచాంద : మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారుల వెంట ఉన్న మూలమలుపులు మృత్యు మలుపులుగా మారుతున్నాయి. ఈ మలుపులు ప్రమాదకరంగా ఉండటంతో ఎప్పడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని మండల వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా మండలంలోని పీచర, లక్ష్మణచాంద, మల్లాపూర్, మునిపెల్లి, రాచాపూర్, పొట్టపెల్లి, న్యూవెల్మల్, పీచర గ్రామాలకు వెళ్లే రహదారులు చాలా మూల మలుపులు ఉన్నాయి. దీంతో ఆ రహదారుల వెంట ప్రయాణం చేసేటప్పుడు ముందు నుంచి ఏ వాహనం వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ మార్గాల్లో పలు ప్రమాదాలు సంభవించాయి.  మూల మలుపుల వద్ద హెచ్చరిక సూచికలు ఉండాలని నిబంధనలు ఉన్నా చాలా మలుపుల వద్ద సూచికలు లేవు. ఈ విషయాన్ని సంబంధిత గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకునేవారే కరువయ్యారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే అనేక సార్లు ప్రమాదాలు జరిగాయి.  



రోడ్డు కనిపించదు..

మూల మలుపుల వద్ద పిచ్చి మొక్కలు పెరిగి రోడ్డు మొత్తం కనిపించకుండా ఉంది. దీంతో రోడ్డుపై ప్రయాణించే ప్రయాణించే వాహనదారులు తరచు ఎదురుగా వచ్చే వాహనాలను ఢీ కొంటున్నారు. వేగంగా వస్తే ప్రమాదం ఖాయం. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదాల బారిన పడుతున్నారు.



ప్రమాదాలు జరిగినా..    

మండలంలోని వివిధ రోడ్డు ప్రమాదాలు జరిగిన తీరును గమనిస్తే వాహనదారులు వెళ్లే సమయంలో ముందు నుంచి వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల బొప్పారం గ్రామం వద్ద ఇద్దరు వాహనాదారులు ఢీ కొనగా వారిలో ఒకరు అక్కడిక్కడే మరణించారు.  మండలంలోని వడ్యాల్‌ గ్రామం సమీపంలో గల మూలములపు వద్ద ఇటీవల రెండు ఆటోలు ఢీ కొనగా అందులో ప్రయాణిస్తున్న లక్ష్మణచాంద మహిళ తన ఒక  చేతును పూర్తిగా కోల్పోయింది. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మండలవాసులు కోరుతున్నారు.



సూచికలు ఏర్పాటు చేయాలి

మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే రహదారుల మూల మలుపుల వద్ద తప్పనిసరిగా ప్రమాద హెచ్చరికలను సూచించే బోర్డులనుదేర్పాటు చేయాలి. ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగాయి ఇకమీద నివారణకు చర్యలు తీసుకోవాలి. – రమేశ్‌



పిచ్చి మొక్కలు తొలగించాలి

మండలంలోని ప్రధాన రహదారుల మూల మలుపుల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలి. దీంతో వాహనదారులకు ముందు నుంచి వచ్చే వాహనాలు కనిపించకపోవడం వల్లే ఎక్కవ ప్రమాదాలు జరుగుతున్నాయి. – జహీరోద్దిన్



బోర్డులను ఏర్పాటు చేస్తాం

మండలంలోని ప్రధాన రహదారులపై ఉన్న మూల మలుపుల వద్ద ప్రమాద సూచిక బోర్డులను తొందరలోనే ఏర్పాటు చేస్తాం. అంతే గాకండా రహదారుల వెంట గల పిచ్చి మొక్కలను తొలగిస్తాం. ఇకపై ప్రమాదాల నివారణకు పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటాం.

– ఎజ్‌దాని, ఏఈ, ఆర్‌అండ్‌బీ

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top