అంగరంగవైభవంగా...

జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజు - Sakshi

–భక్తుల సౌకర్యాలకు అగ్రాసనం

–కైంకర్యాలు మినహా మిగిలిన సమయమంతా

 స్వామి దర్శనానికి కేటాయింపు

–బ్రహ్మోత్సవ వేళ ఇబ్బంది

  కలగకుండా పకడ్బందీ ఏర్పాటు

సాక్షితో టీడీపీ జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజు

 

సాక్షి,తిరుమల:

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ తిరుమల జేఈవో  కేఎస్‌ శ్రీనివాసరాజు చెప్పారు. గత ఏడు బ్రహ్మోత్సవాలు సజావుగా, విజయవంతంగా నిర్వహించటంలో కీలక పాత్ర పోషించిన ఆయన  శుక్రవారం సాక్షితో మాట్లాడారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. ఇంకా ఏమన్నారంటే.. 

భక్తులకు సంతృప్తికరంగా వాహన సేవల దర్శనం l

 బ్రహ్మోత్సవాలకు అశేష సంఖ్యలో భక్తజనం తరలివస్తారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశాం. ఉదయం, రాత్రి స్వామి వాహన సేవల్ని భక్తులందరూ దర్శించేలా ఏర్పాట్లు చేశాం. గరుడ వాహన సేవరోజున ఉత్సవమూర్తి ఊరేగింపు చాలా నిదానంగా నిర్వహిస్తాం.  దానివల్ల భక్తులందరూ సంతృప్తిగా దర్శించుకుంటారు. ఈ సారి శాశ్వత ప్రాతిపదికన మరుగుదొడ్లు నిర్మించాం. తాగునీరు వసతి కల్పించాం. సంచార వైద్యశాలలు, ప్రత్యేకంగా అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచామని శ్రీనివాసరాజు వివరించారు.

  

భక్తుల సౌకర్యార్ధం తీసుకున్న నిర్ణయాలివి:

– కైంకర్యాలు మినహా మిగిలిన సమయమంతా స్వామి దర్శనం 

– సిఫారసు చెల్లవు. అన్ని రకాల వీఐపీ దర్శనాలు రద్దు.. వికలాంగులు, వృద్ధులు, చంటి బిడ్డ తల్లిదండ్రుల క్యూలైను , ఇతర సిఫారసు దర్శనాలు రద్దు.

–ప్రోటోకాల్‌ నిబంధనలు మాత్రమే అమలు 

– ఇబ్బంది లేకుండా అన్నప్రసాద వితరణ 

–  వాహన సేవల దర్శనం కోసం ఆలయ వీధుల్లో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, మజ్జిగ పంపిణీ.

–అన్నప్రసాద కేంద్రంలో కూడా ఉదయం 8 గంటలకు అల్పాహారం మొదలు రాత్రి 12 గంటల వరకు వితరణ 

– రోజూ 7 లక్షల లడ్డూలు నిల్వ ఉండేలా ఏర్పాట్లు

– అవసరాన్ని బట్టి అదనపు లడ్డూల కేటాయింపు.

– అన్ని రకాల ఆర్జిత సేవలతోపాటు అడ్వాన్స్‌ బుకింగ్‌లోని గదులు రద్దు.

 –దాతలకు మాత్రమే గదులు కేటాయింపు. 

–జీఎన్‌సీ టోల్‌గేట్‌ కుడివైపున నుండి ఆర్టీసీ బస్సులు, ఎడమవైపు ప్రైవేట్‌ వాహనాలకు అనుమతి

 –ప్రత్యేక పార్కింగ్‌ కేంద్రాల సంఖ్య పెంపు. 

–గరుడ వాహన సేవకు ముందురోజు నుండే తిరుమలలో వన్‌వే ట్రాఫిక్‌ నిబంధన అమలు.

నిమిషానికో ఆర్టీసీ బస్సు నడిచేలా చర్యలు తీసుకున్నట్లు జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. నిరంతరంభక్తులకు అందుబాటులో సెంట్రల్‌ కమాండెంట్‌ కంట్రోల్‌ రూమ్‌ తీసుకొచ్చామని..అత్యవసర పరిస్థిల్లో అన్ని విభాగాలు తక్షణమే స్పందించే ఏర్పాట్లు చేశామని సాక్షికి వివరించారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top