20 రోజుల్లో నోటిఫికేషన్లు!

20 రోజుల్లో నోటిఫికేషన్లు!


కసరత్తు చేస్తున్న టీఎస్‌పీఎస్‌సీ

 పది రోజుల్లో ఇండెంట్లు వచ్చే అవకాశం

 ఆపై గ్రూపులు, కేటగిరీలవారీగా పోస్టుల విభజన

 15-20 రోజుల్లో నోటిఫికేషన్ల జారీ ప్రారంభం

 ఇంజనీర్ పోస్టులకు తొలి నోటిఫికేషన్

 ఆ తరువాత విడతలవారీగా మిగతా నోటిఫికేషన్లు

 

 సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై నియామక సంస్థలు దృష్టి సారించాయి. ముఖ్యంగా 4,326 పోస్టుల భర్తీకి సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) కసరత్తు చేస్తోంది. పరీక్షల విధానంపై ప్రభుత్వ ఉత్తర్వుల్లోని నిబంధనల ఆధారంగా అనుమతి ఇచ్చిన పోస్టులను గ్రూపులు, కేటగిరీలవారీగా విభజించాలని యోచిస్తోంది. టీఎస్‌పీఎస్‌సీతోపాటు ఇతర నియామక సంస్థల ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు ఆయా శాఖలు ఇండెంట్లు, రోస్టర్, రిజర్వేషన్ల వివరాలను ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో వారం, పది రోజుల్లో ఆయా శాఖల నుంచి ఇండెంట్లు వస్తాయని టీఎస్‌పీఎస్‌సీ భావి స్తోంది. మొత్తానికి మరో వారం పది రోజుల్లో శాఖల నుంచి ఉద్యోగాల భర్తీకి ఇండెంట్లు వచ్చిన వెంటనే పోస్టులవారీ క్రోడీకరణతోపాటు గ్రూపుల విభజన చేపట్టి నోటిఫికేషన్ల జారీని 15 నుంచి 20 రోజుల్లో ప్రారంభించేలా టీఎస్‌పీఎస్‌సీ కసరత్తు చేస్తోంది. మొత్తంగా రెండు, మూడు నెలల్లోగా తమ పరిధిలో అన్ని నోటిఫికేషన్లను జారీ చేయాలని యోచిస్తోంది.

 

 12 శాఖల్లో 34 కేటగిరీల ఉద్యోగాలు

 

 ప్రస్తుతం 12 శాఖల్లోని 14 విభాగాల్లో ఖాళీగా ఉన్న 34 కేటగిరీల పోస్టులను సర్వీసు కమిషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇందులో గ్రూపు-1, గ్రూపు-2 కేటగిరీల్లో భారీ సంఖ్యలో పోస్టులు లేకపోయినా డిగ్రీ అర్హతతో భర్తీ చేసే ఇతర పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి. గ్రూపు-3 కేటగిరీలో ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంది. గ్రూపులు, కేటగిరీలవారీగా పరీక్షల విధానంపై స్పష్టత వచ్చాక ఏయే కేటగిరీలో ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి వస్తుందన్న లెక్కలు తేలనున్నాయి. ఈ అంశాలపై కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మంగళవారం అధికారులతో చర్చించారు.

 

 ఇంటర్వ్యూలు లేకుండానే గ్రూపు-3?

 

 ప్రభుత్వం జారీ చేసిన పోటీ పరీక్షల విధానం ఉత్తర్వుల్లో స్పష్టత రావాల్సి ఉంది. దీనికి సంబంధించి సాధారణ పరిపాలనశాఖ సోమవారం జారీ చేసిన జీవో 330లో వివరాలను పొందుపరచలేదు. అయితే వివిధ పోస్టుల భర్తీలో అమలు చేయాల్సిన విధానాలు, ఏయే పోస్టులను ఏయే కేటగిరీలో చేర్చారన్న వివరాలను అందులో పొందుపరచినట్లు తెలిసింది. ముఖ్యంగా ఇంటర్వ్యూలు లేకుండానే గ్రూపు-3 పరీక్షను నిర్వహించాలని అందులో పేర్కొన్నట్లు సమాచారం.

 

 వరుస నోటిఫికేషన్లు ఇలా..

 

 శాఖలవారీగా ఇండెంట్లు రాగానే టీఎస్‌పీఎస్‌సీ వరుసగా నోటిఫికేషన్లను జారీ చేయనుంది. సిలబస్ మార్పులు పెద్దగా లేనందున ముందుగా ఇంజనీర్ పోస్టులకు  నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత వారానికి ఒకటి చొప్పున గ్రూపు-2, గ్రూపు-3, ఇతర కేటగిరీలు, గ్రూపు-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రానున్నాయి. గ్రూపు-1 మెయిన్స్‌లో తెలంగాణపై ఆరో పేపరును ప్రత్యేకంగా ప్రవేశ పెడుతుండగా, గ్రూపు-2 వంటి ఇతర కేటగిరీల సిలబస్‌లో మార్పులు ఉండనున్నాయి. కాబట్టి ఈ నోటిఫికేషన్లను చివరలో జారీ చేసే అవకాశం ఉంది.

 

 వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి: టీఎస్‌పీఎస్‌సీ

 

 4,326 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేపథ్యంలో అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని టీఎస్‌పీఎస్‌సీ ఓ ప్రకటనలో కోరింది. తద్వారా నియామకాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను వేగంగా చేపట్టవచ్చని తెలిపింది. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకునే అభ్యర్థులకు నోటిఫికేషన్లు జారీ అయ్యాక సమాచార ం వెళ్తుందని, ఆ రెఫరెన్స్ నంబర్, ఇతర వివరాలతో పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఇప్పటివరకు దాదాపు 1.70 లక్షల మంది అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వివరించింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top