‘వరంగల్’పై టీఆర్‌ఎస్ కసరత్తు

‘వరంగల్’పై టీఆర్‌ఎస్ కసరత్తు - Sakshi


♦  టి.రాజయ్య భార్య వివరాలు సేకరించిన ఇంటెలిజెన్స్

♦ టికెట్ రేసులో పలువురు ఆశావహులు

♦ వారంలోగా షెడ్యూల్ వస్తుందని అంచనా

 

 సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికపై అధికార టీఆర్‌ఎస్ కసరత్తు మొదలుపెట్టింది. కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి వారంలోపే ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందన్న అంచనాతో అందుకు తగినట్లే ఏర్పాట్లు చేసుకుంటోంది. తమకు టికెట్ ఇవ్వాలని ఇప్పటికే పలువురు నేతలు అధినేత కేసీఆర్‌ను కోరారు. వరంగల్ జిల్లాకు చెందిన నాయకులకు తోడు జేఏసీలో పనిచేసి తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో పాల్గొన్న వారూ ఆశావహుల్లో ఉన్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేసిన డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తనకు అవకాశం వస్తుందన్న ఆశతో ఉన్నారు. మొదటి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తనకు టికెట్ ఇవ్వాలని అగ్రనేతలను కోరారు. తానూ పోటీకి సిద్ధంగా ఉన్నానని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న పిడమర్తి రవి తన మనసులోని కోరికను బయట పెట్టారు.



 ఉప ఎన్నికపై దృష్టి పెట్టిన టీఆర్‌ఎస్ నాయకత్వం ఇప్పటికే వివిధ సమీకరణలను ముందు పెట్టుకుని విశ్లేషించినట్లు చెబుతున్నారు. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య కుటుంబ సభ్యుల్లో ఒకరికి అవకాశం ఇస్తారనే ప్రచారమూ జరుగుతోంది. రాజయ్య భార్య ఫాతిమా మేరీకి సంబంధించిన వివరాలను నిఘా వర్గాల ద్వారా సేకరించినట్లు సమాచారం. ఆమె ప్రస్తుతం సీనియర్ లైబ్రేరియన్‌గా వరంగల్ జిల్లాలోనే పనిచేస్తున్నారు. ఆమెకు ఇంకా ఎంత సర్వీసు ఉంది? జీతమెంత? తదితర సర్వీసు పరమైన వివరాలు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరించాయని తెలిసింది.



డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంపై ఎస్సీ వర్గాల్లో కొంత వ్యతిరేక ప్రచారం జరిగింది. ఈ అపప్రదను తొలగించుకోవడానికి వరంగల్ ఎంపీ స్థానం నుంచి ఆయన కుటుంబ సభ్యులనే నిలబెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన మేరకే ఈ వివరాలు సేకరించినట్లు చెబుతున్నారు. అయితే, ఆయన తనయుడు కూడా రేసులో ఉన్నాడని అంటున్నారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లో కూడా రాజయ్య వరంగల్ ఉప ఎన్నికపై స్పందించినా, తమ కుటుంబం రేసులో ఉందని స్పష్టంగా చెప్పలేదు.



రాష్ట్రంలో అత్యంత సానుభూతి తనపైనే ఉందని మాత్రం వ్యాఖ్యానించారు. ఎస్సీ రిజర్వుడు స్థానమైన వరంగల్‌లో మాదిగ వర్గ నేతలకే అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉంది. ‘గెలుపోటముల విషయాన్ని పక్కన పెడితే, మాదిగలకు టికెట్ ఇవ్వకుంటే పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది’ అని పార్టీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top