ఏంటి సార్‌ ఇది..?

ఏంటి సార్‌ ఇది..?


రేగోడ్‌(మెదక్‌): ఏంటీ సార్‌ ఇది.. నా ముందు ధర్నా చేయమనడం ఏమిటీ? నాకేమైనా మంజూరు చేసే అధికారం ఉందా.. నన్ను ఇబ్బందులు పెట్టడం సరికాదంటూ మండల పరిషత్తు సూపరింటిండెంట్‌ లక్ష్మీ ఎంపీడీఓ బస్వన్నప్పను ప్రశ్నించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మండల కేంద్రమైన రేగోడ్‌లో సోమవారం టీఆర్‌ఎస్‌ పార్టీ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో మర్పల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త కుమార్‌ గ్రామంలో అర్హులున్నా పెన్షన్లు మంజూరు చేయడం లేదని తెలిపిన సంగతీ విధితమే. అయితే ఎంపీడీఓ పెన్షన్లు మంజూరు చేయకపోగా సూపరింటిండెంట్‌ ముందు తమను ధర్నా చేయమన్నాడని పార్టీ సీనియర్‌ నాయకుల వద్ద తన గోడును వెల్లబోసుకున్న విషయం తెలిసిందే.


ఈ క్రమంలో ‘ఓట్లు ఎలా అడుగుతారో చూస్తాం, అంటూ మంగళవారం సాక్షిలో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన సూపరింటిండెంట్‌ ఎంపీడీఓకు కథనాన్ని చూపించి ఏంటీ సార్‌ ఇదీ.. నా ముందు ధర్నా చేయమనడం ఏమిటీ?.. నాకేమైనా మంజూరు చేసే అధికారం ఉందా..? నన్ను ఇబ్బంది పెట్టడం సరికాదంటూ ఎంపీడీఓతో తన ఆవేదన చెప్పుకున్నట్లు సమాచారం. ఏం చేయాలో తెలియక అలా చేయాల్సివచ్చిందన్నట్లు తెలిసింది. సమస్యను పరిష్కరించాల్సిన అధికారి తోటి అధికారి ముందు అధికార పార్టీ నాయకులనే ధర్నా చేయమనడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఇలాంటి అధికారి వల్లే పార్టీ పరువు పోతుందని పలువురు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నా పాలకవర్గం మాత్రం ప్రేక్షక పాత్ర వహించడం గమనార్హం. ఇటు అధికార వర్గాలు.. అటు అధికార పార్టీ నాయకుల్లో ‘సాక్షి’ కథనం దూమారం లేపింది. సమావేశంలో ఇలా జరిగిందేమిటీ అని కొందరు అనుకుంటుంటే.. మరి జరగదా అంటూ మరికొందరు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు బహింరంగంగానే అనుకుంటున్నట్లు సమాచారం. సబ్సిడీ ట్రాక్టర్లు, మిషన్‌ కాకతీయ పనులు, సీసీ రోడ్లు ఇలా అన్నీ లబ్ధి పొందిన వారే సమావేశానికి రాకపోతే తామేందుకు రావడం అని పలువురు కార్యకర్తలు చర్చించుకుంటున్నట్లు తెలిసింది. పార్టీలో గ్రూపు తగాదాలు రచ్చకెక్కాయి. ఇటీవల రేగోడ్‌కు వచ్చిన ఎమ్యెల్యే బాబూమోహన్‌ గ్రూపులు కడితే ఎంతటి వారున్నా పార్టీ నుంచి సాగనంపుతానని హెచ్చరికలు చేసినా పరిస్థితిలో మార్పురాలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top