వ్యక్తిగత కక్షలతోనే మురళి హత్య

వ్యక్తిగత కక్షలతోనే మురళి హత్య - Sakshi


ఏ–1 వాంగ్మూలం మేరకే ఏ–4, ఏ–5, ఏ–6లపై కేసులు

మాకు ఎవరి నుంచి ఒత్తిళ్లు లేవు సీపీ సుధీర్‌బాబు




టీఆర్‌ఎస్‌ నాయకుడు, కార్పొరేటర్‌ అనిశెట్టి మురళీమనోహర్‌ హత్య వ్యక్తిగత కక్షలతోనే జరిగింది. ఈ హత్య కేసులో విచారణ చేపట్టిన అధికారులపై ఎవరి ఒత్తిళ్లు లేవు. కేసు విచారణ పూర్తిగా ప్రొఫెషనల్‌గా సాగుతోంది. నేరస్తులు కాని వారిని ఈ కేసులో పెట్టాలనే

ఉద్దేశం పోలీసు శాఖకు లేదు.
   – జి.సుధీర్‌బాబు, పోలీస్‌ కమిషనర్‌




వరంగల్‌:

హన్మకొండ కుమార్‌పల్లిలో ఈనెల 13వ తేదీన జరిగిన టీఆర్‌ఎస్‌ నాయకుడు, కార్పొరేటర్‌ అనిశెట్టి మురళీమనోహర్‌ హత్య వ్యక్తిగత కక్షలతోనే జరిగిందని సీపీ సుధీర్‌బాబు తెలిపారు. బుధవారం పోలీస్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేటర్‌ మురళి హత్యపై మీడియాలో వస్తున్న కథనాలపై స్పష్టత ఇచ్చేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లుతెలిపారు. మురళి హత్య కేసుపై విచారణ చేపట్టిన అధికారులపై ఎవరి ఒత్తిళ్లు లేవన్నారు. ఈ హత్యపై ఇచ్చిన ఫిర్యాదులో కేవలం ముగ్గురు పేర్లు మాత్రమే సూచించారని తెలిపారు.



హత్య అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుల్లో మొదటి నిందితుడు ఎ–1 ఇచ్చిన వాంగ్మూలంతోనే ఈ హత్యకు మరికొద్ది మంది సహకరించారని, వారే తనకు ఆయుధాలు అందజేసినట్లు చెప్పినట్లు వివరించారు. ఎ–1 నిందితుడు విచారణలో తెలిపిన వివరాల ఆధారంగానే రిమాండ్‌ సీడీలో ఎ–4, ఏ–5, ఏ–6 పేర్లను చేర్చినట్లు తెలిపారు. ఎ–1 ముద్దాయి విచారణ విషయాల అధారంగానే రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్ల నమోదు చేసి కోర్టుకు అందజేసిన రిమాండ్‌ రిపోర్టులో రాసినట్లు తెలిపారు. ఎ–4, ఎ–5, ఎ–6 నిందితులను ఇప్పటి వరకు ఆరెస్టు చేయలేదన్నారు. మురళి హత్య కేసులో తన ఇంట్లో రికార్డు అయిన సీసీ ఫుటేజీ, నిందితుల వాంగ్మూలంతో రిమాండ్‌ రిపోర్టు తయారు చేసి కోర్టుకు సమర్పించామని సీపీ తెలిపారు.  సమావేశంలో సెంట్రల్‌జోన్‌ డీసీపీ వేణుగోపాల్‌రావు, హన్మకొండ ఏసీపీ మురళీధర్‌ పాల్గొన్నారు.  



సీసీ ఫుటేజీల సీడీ, వాంగ్మూలం కోర్టుకు సమర్పణ

కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం సాయంత్రం  పోలీసులు అనిశెట్టి మురళి ఇంటి వద్ద ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించారు. మురళీ హత్యకు గంట ముందు, తర్వాత జరిగిన విషయాలను పరిశీలించారు. ఇందులో గంటకు ముందు సంఘటన స్థలం వద్దకు వెళ్లిన వారి వివరాలు ఉన్నట్లు తెలిసింది. హత్య జరిగే సమయంలోపై నుంచి దిగుతున్న వ్యక్తులు.. మెట్లు ఎక్కుతున్న వారిని చూసి పలకరించినట్లు సైతం ఇందులో రికార్డైనట్లు సమాచారం. హత్య చేసేందుకు వెళ్లిన వారితో పాటు హత్యకు ఉపయోగించిన కత్తులు ఉన్న బ్యాగు విజువల్స్‌ రికార్డైనట్లు తెలిసింది. మురళీ హత్య చేసిన అనంతరం కత్తిని తిప్పుతూ కింది దిగిన దృశ్యాలు చూసి పోలీసులు ఆశ్చర్యానికి గురైనట్లు సమాచారం. ఈ సీసీ పుటేజీల సీడీతో పాటు పోలీస్‌స్టేషన్‌లో నిందితులు ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు న్యాయస్థానానికి సమర్పించినట్లు తెలిసింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top