ఎస్సీ, బీసీలను విస్మరిస్తున్న సర్కార్‌

ఎస్సీ, బీసీలను విస్మరిస్తున్న సర్కార్‌ - Sakshi


► రజక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు రమణ



మెదక్‌జోన్‌: రాష్ట్రంలో ఒకే వర్గానికి చెందిన ప్రజలు సీఎం కేసీఆర్‌కు కనబడుతున్నారని, జనాభాలో అధికశాతం ఉన్న, ఎస్సీ, బీసీలను పూర్తిగా విస్మరిస్తున్నారని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేంత వరకు పోరాటం కొనసాగించాలని రజక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు పోతరాజు రమణ పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఎంఆర్పీఎస్‌ రెండు రోజులుగా జిల్లా కేంద్రంలోని స్థానిక రాందాస్‌ చౌరస్తాలో చేపట్టిన ఆందోళనకు రజక సంఘం నాయకులు  సోమవారం సంఘీభావం పలికారు.



ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని జనాభాలో 12 శాతం ఉన్న ముస్లింలకు  12 శాతం రిజర్వేషన్లు కల్పించిన సీఎం కేసీఆర్‌కు జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలు, ఎస్సీలు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న ఈ ప్రభుత్వంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రమాదం పొంచి ఉందన్నారు.  మనమంతా ఏకమై రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. లేకుంటే భవిషత్యత్తులో మన పిల్లలకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఇంత జరుగుతున్నా బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు నోరుమెదపక పోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీసీ కులానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాజీనామా చేసిన వారిని భారీ మెజార్టీతో పార్టీలకతీతంగా గెలిపించుకుంటామని ఆయన చెప్పారు.



ముస్లింలకు పెద్దఎత్తున రిజర్వేషన్లు కల్పించడంతో బీసీ ఈలో ఉన్న మిగతా బీసీ కులాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. అనంతరం ఎమ్మార్పీఎస్‌ జాతీయ నాయకుడు మాసాయిపేట యాదగిరి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ చాట్ల తవుడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టే విధంగా ఇష్టాను రీతిగా రిజర్వేషన్లు కల్పిస్తూ మన మధ్యలో గొడవలు పెడుతున్నారన్నారు. బీసీలకు 52 శా>తం, ఎస్సీలకు 18శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అంతకుముందు రాందాస్‌ చౌరస్తాలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు సిద్దిరాయులు, చంద్రం, రామాయంపేట వెంకటి, ఎమ్మార్పీఎస్‌ నాయకులు బాల్‌రాజు, మురళి, దశరథం, బీసీ సంఘ నాయకులు మల్కాజి సత్యనారాయణ, వడ్డె మహేష్, రఘు, గంగారాం తదితరులు ఉన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top