బలోపేతం దిశగా..


► టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు లక్ష్యం 81వేలు

► రెండేళ్లలో సార్వత్రిక, వచ్చే ఏడాదిలో పంచాయతీ ఎన్నికలు

► పార్టీని పటిష్టం చేసేందుకు ఎమ్మెల్యేల దృష్టి

► 21లోగా పూర్తి స్థాయి కమిటీల నియామకం


ఆదిలాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ఈ మూడేళ్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపైనే ఫోకస్‌ పెట్టింది. ప్రస్తుతం పార్టీ పటిష్టతపై అధిష్టానం దృష్టి సారించింది. పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత నిర్మాణం చేపట్టడంతో పాటు గ్రామ, మండల, నియోజకవర్గ కమిటీలు వేసి పార్టీ శ్రేణుల్లో  ఉత్సాహాన్ని నింపే కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది.


జిల్లాలో రాష్ట్ర అటవీ, బీసీ శాఖ మంత్రి జోగు రామన్న, ఎంపీ గోడం నగేశ్, బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదు చేయిస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు ఇచ్చిన లక్ష్యాన్ని దాదాపు పూర్తి చేశారు. ఇక సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్లు మాత్రమే గడువు ఉండడం, వచ్చే ఏడాది పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుంచే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే పనిలో పడ్డారు.


జిల్లాలో 81వేల సభ్యత్వ లక్ష్యం..

టీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేయడమే ప్రస్తుత కర్తవ్యంగా నేతలు ముందుకు సాగుతున్నారు. ఇందుకు తగ్గట్లుగానే లక్ష్యాలను పెట్టుకున్నారు. జిల్లాలో ఆదిలాబాద్, బోథ్‌ నియోజకవర్గాలకు కలిపి 81వేల సభ్యత్వాన్ని చేయాలని లక్ష్యంగా పెట్టిన అధిష్టానం బాధ్యతలను మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించిం ది. ఇటీవలే సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేల పనితీరుపై చే యించిన సర్వేలో జిల్లాకు చెందిన మంత్రి రామన్నకు 39.90శాతం, బోథ్‌ ఎమ్మెల్యే బాపురావుకు 36.10 శాతంతో తక్కువ ప్రజాదారణ పొందారు.


ఈ నేపథ్యంలో గతం కంటే ఎక్కువ సభ్యత్వం నమోదు చేసి మళ్లీ కేసీఆర్‌ దృష్టిలో పడేందుకు వీరు యత్నిస్తున్నారు. ఇప్పటికే ఇచ్చిన లక్ష్యం దాదాపు పూర్తి కాగా.. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ సభ్యత్వం చేయిస్తున్నారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో 35వేల లక్ష్యం కాగా.. ఇందులో సాధారణ సభ్యత్వం 28వేలు, క్రియాశీలక సభ్యత్వం 7వేలుగా నిర్ణయించారు. ఇక బోథ్‌ నియోజకవర్గంలో 30వేల సభ్యత్వం లక్ష్యం కాగా.. ఇందులో సాధారణ సభ్యత్వం 25,500, క్రియాశీలక సభ్యత్వం 4,500 నిర్ణయించారు. నార్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో 13వేలు సాధారణం, 3వేలు క్రియాశీలక సభ్యత్వం చేయించి లక్ష్యం చేరుకున్నారు.


కమిటీల ఏర్పాటు..

రెండేళ్ల క్రితం పార్టీ సభ్యత్వం చేయించినా ఆ తర్వాత నూతన కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించలేదు. పాత కమిటీలనే కొనసాగిస్తూ వస్తుండడంతో కార్యకర్తలో నైరాశ్యం నెలకొంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రభుత్వ కార్యక్రమాలకే సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యత ఇస్తూ.. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తలపై దృష్టి సారించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలని భావిస్తున్నారు.


ఇప్పటికే గ్రామస్థాయిలో కమిటీలు వేస్తుండగా, 15, 16 తేదీల్లోపు మండల కమిటీలు, 21తేదీలోపు నియోజకవర్గ కమిటీలు పూర్తి చేయనున్నారు. పార్టీ పటిష్టత నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2లక్షల ప్రమాద బీమా కల్పించడం కార్యకర్తలకు ధీమాగా మారింది. సభ్యత్వ నమోదులో ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తలకు అండగా ఉండేందుకు బీమా కల్పిస్తున్నామంటున్నారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top