గులాబీ తోటలో ఓట్ల తుఫాను

గులాబీ తోటలో ఓట్ల తుఫాను


4,59,092 మెజారిటీతో వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ గెలుపు

పార్టీ అభ్యర్థి దయాకర్ ఘన విజయం

ఏకపక్షంగా తీర్పు ఇచ్చిన ఓటర్లు.. డిపాజిట్ కోల్పోయిన ప్రతిపక్షాలు

రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీజేపీ-టీడీపీ కూటమి

59.42% ఓట్లు గులాబీ పార్టీకే...

తెలంగాణలో ఇదే అత్యధిక మెజారిటీ.. దేశంలో 7వ అత్యధికం

రిగ్గింగ్ జరిగిందంటూ బీజేపీ అభ్యర్థి ఫిర్యాదు


సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ఓరుగల్లు’ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ విజయ దుందుభి మోగించింది. మునుపటికన్నా భారీ మెజారిటీతో వరంగల్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఉప ఎన్నికలో ఓటర్లు ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌కు విజయాన్ని కట్టబెట్టారు. ఆ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ 4,59,092 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. తెలంగాణలో అత్యధిక మెజారిటీతో ఎన్నికైన లోక్‌సభ సభ్యుడిగా పసునూరి రికార్డు నమోదు చేశారు. కాంగ్రెస్, బీజేపీ సహా వివిధ పార్టీల నుంచి, స్వతంత్రులుగా బరిలో నిలిచిన 22 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ప్రభుత్వ వ్యతిరేకత ఆధారంగా గెలుపు సాధిస్తామన్న కాంగ్రెస్ ఆశలు అడియాసలే అయ్యాయి. రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునే ప్రయత్నం చేసిన బీజేపీని వరంగల్ ఓటర్లు కరుణించలేదు. టీడీపీతో పొత్తుతో బరిలో ఉండి కూడా బీజేపీ డిపాజిట్ దక్కించుకోలేపోయింది.

 

 అన్ని సెగ్మెంట్లలోనూ..

 వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ టీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ వచ్చింది. మొత్తంగా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 15,09,671 మంది ఓటర్లు ఉండగా... ఉప ఎన్నికలో 10,35,656 మంది ఓటు వేశారు. ఇందులో టీఆర్‌ఎస్‌కు 6,15,403, కాంగ్రెస్‌కు 1,56,311, బీజేపీకి 1,30,178, వైఎస్సార్‌సీపీకి 23,352, వామపక్షాల కూటమి అభ్యర్థికి 14,788 ఓట్లు వచ్చాయి. శ్రమజీవి పార్టీ తరఫున పోటీ చేసిన జాజుల భాస్కర్‌కు 28,541 ఓట్లు పోలయ్యాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం)లో అభ్యర్థుల వరుసలో ఏడవ సంఖ్యలో ఉన్న భాస్కర్‌కు కెమెరా గుర్తు వచ్చింది. టీఆర్‌ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలి ఉండడంతో భాస్కర్‌కు ఎక్కువ ఓట్లు పోలైనట్లు అభిప్రాయపడుతున్నారు.

 

 తొలి రౌండ్ నుంచీ ఆధిక్యం..

 వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్ యార్డులో మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవగా... తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ దాకా కూడా టీఆర్‌ఎస్ ఆధిక్యంలో కొనసాగింది. ఇక్కడ 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున కడియం శ్రీహరి 3,92,137 ఓట్లతో మెజారిటీతో గెలిచారు. అప్పట్లో ఇదే రికార్డు మెజారిటీగా నమోదుకాగా... ప్రస్తుత ఉప ఎన్నికలో పసునూరి దయాకర్ దాన్ని తిరగరాశారు. మొత్తంగా ఉప ఎన్నికలో పోలైన ఓట్లలో టీఆర్‌ఎస్‌కు 59.42 శాతం, కాంగ్రెస్‌కు 15.09 శాతం, బీజేపీకి 12.56 శాతం, వైఎస్సార్‌సీపీకి 2.25 శాతం, వామపక్షాల కూటమి అభ్యర్థికి 1.42 శాతం వచ్చాయి.

 

 కాగా.. ఈవీఎంలలో సాంకేతిక లోపాలున్నట్లు బీజేపీ అభ్యర్థి పగిడిపాటి దేవయ్య.. ఎన్నికల అధికారి వాకాటి కరుణకు ఫిర్యాదు చేశారు. దానివల్ల అధికార పార్టీకి ఏకపక్షంగా ఓట్లు వచ్చాయన్నారు. పరకాల నియోజకవర్గంలో వరికోల్ గ్రామంలోని 3, 4, 5 పోలింగ్ కేంద్రాల్లో 89 శాతం పోలింగ్ నమోదైందని... అందులో బీజేపీకి 3, కాంగ్రెస్‌కు ఒక ఓటు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. రిగ్గింగ్ జరిగిందని, తిరిగి పోలింగ్ నిర్వహించాలని కోరారు. కాంగ్రెస్ ఎన్నికల ఏజెంట్ ఇ.వి.శ్రీనివాస్ ఈ ఫిర్యాదుపై సంతకం చేశారు. దానిని ఎన్నికల సంఘానికి పంపించారు.

 

 ఇది ఓ సామాన్య కార్యకర్త విజయంగా భావిస్తున్నా. కార్యకర్తగా ఉన్న నాకు పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చి గెలిపించిన టీఆర్‌ఎస్‌కు, పార్టీ అధినేత కేసీఆర్‌కు రుణపడి ఉంటా. పేదలకు కేసీఆర్ అండగా ఉంటారనడానికి ఇదే నిదర్శనం. అత్యధిక మెజార్టీతో గెలిపించి దేశంలోనే గుర్తింపు తెచ్చిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. వరంగల్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తా.    - పసునూరి దయాకర్

 

 వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీలకు వచ్చిన ఓట్లు..


Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top