‘గన్నవరం’లో ఊపందుకున్న ఏర్పాట్లు


♦ 22న మోదీ, పలువురు సీఎంలు  ముఖ్యుల రాకకు ఏర్పాట్లు

♦ బేగంపేట, తిరుపతి, రాజమండ్రి, విశాఖల్లోనూ విమానాల పార్కింగ్

 

 సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి జరగనున్న శంకుస్థాపన నేపథ్యంలో సమీపంలోని గన్నవరం విమానాశ్రయానికి ప్రముఖుల తాకిడి పెరగనుంది. దీంతో ఇక్కడ ఏర్పాట్లు ఊపందుకున్నాయి.అక్టోబర్ 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఐదుగురు సీఎంలు, విదేశీ ప్రముఖులు వస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. శంకుస్థాపనకు వచ్చే 1,500 మంది వీవీఐపీ, వీఐపీల్లో చాలామంది గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగనున్నారు. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టులో నాలుగు పెద్ద విమానాలు, రెండు చిన్న విమానాలు, ఒక హెలికాప్టర్‌ను పార్కింగ్ చేసేందుకు అవకాశం ఉంది. సాధారణంగా రోజుకు 27 సర్వీసులు వచ్చి వెళ్తుంటాయి.



రాజధాని శంకుస్థాపన రోజున దాదాపు 100 విమానాలు, హెలికాప్టర్లు రానున్నాయని అంచనా. విమానాలు గన్నవరం ఎయిర్‌పోర్టులో వీవీఐపీ, వీఐపీలను దించి, హైదరాబాద్‌లోని బేగంపేట, తిరుపతి, రాజమండ్రి, విశాఖపట్నం విమానాశ్రయాల్లో పార్కింగ్ చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. గన్నవరంలో దిగిన ప్రముఖులను హెలికాప్టర్ల ద్వారా శంకుస్థాపన ప్రాంతానికి తరలిస్తారు. ఇందుకోసం  మూడు హెలిప్యాడ్‌లు, ఎయిర్‌పోర్టుకు ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ వెటర్నరీ యూనివర్సిటీ ప్రాంగణంలో మరికొన్ని హెలిప్యాడ్‌లను సిద్ధం చేస్తున్నారు.



 ప్రజా భాగస్వామ్యంతోనే శంకుస్థాపన

 తాడికొండ: రాష్ట్రంలోని 4.3 కోట్ల మంది ప్రజల భాగస్వామ్యంతోనే రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పురపాలక మంత్రి పి.నారాయణ చెప్పారు. శంకుస్థాపన ఏర్పాట్ల బాధ్యతను గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లకు అప్పగించినట్లు చెప్పారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని ఉద్ధండ్రాయినిపాలెంలో శంకుస్థాపన ప్రాంగణాన్ని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌తో కలిసి బుధవారం సందర్శించారు.15వ తేదీ నుంచి మనమట్టి-మననీరు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.



 ఆ రైతులకు సీఎం వ్యక్తిగత ఉత్తరం..

 రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన 23 వేల మంది రైతులను ఆహ్వానించేందుకు సీఎం చంద్రబాబు వ్యక్తిగతంగా ఉత్తరాలు పంపనున్నారని పరకాల ప్రభాకర్ తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top