కూతుర్ని కాలేజీలో దించేందుకెళ్తూ..

కూతుర్ని కాలేజీలో దించేందుకెళ్తూ..


రోడ్డు ప్రమాదంలో బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు బోడా కిషన్ దుర్మరణం

బాలికకు తీవ్ర గాయాలు


సెలవులకు ఇంటికొచ్చిన బిడ్డను..తిరిగి ఖమ్మంలోని ప్రైవేట్ కాలేజీలో దించివచ్చేందుకు బయల్దేరిన ఆ నాన్న రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. బైక్‌పై వెనకాలే కూర్చున్న కూతురి పరిస్థితి విషమంగా మారి..ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దుర్ఘటనతో వారి ఇంట విషాదం నెలకొంది. పెద్ద దిక్కును కోల్పోయి భార్య, మరో కూతురు, కొడుకు గుండెలవిసేలా రోదిస్తున్నారు.


కొణిజర్ల: ఆగి ఉన్న వాహనాన్ని ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు బోడా కిషన్ (42) దుర్మరణం చెందారు. ఈయన స్వస్థలం సారపాక. తన రెండో కూతురు అనూష ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సెలవుల అనంతరం తిరిగి కాలేజీలో చేర్పించేందుకు తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా..కొణిజర్ల మండలం తనికెళ్ల బ్రౌన్‌‌స కళాశాల సమీపంలో మంగళవారం తెల్లవారుజామున  4 గంటల సమయంలో ఆగి ఉన్న డీసీఎంను గమనించలేక వెనుకనుంచి ఢీకొట్టారు.


ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కిషన్ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. కూతురు అనూష ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భార్య బుజ్జి, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఈయన సంతానం. పెద్దమ్మాయిది బీఫార్మసీ అయిపోయింది. చిన్నమ్మాయిని కూడా ఎంతో శ్రద్ధతో చదివిస్తున్నారు. ఇంటి పెద్ద ఇలా హఠాన్మరణం చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్య బుజ్జి ఫిర్యాదు మేరకు ఎస్‌హెచ్‌ఓ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


సారపాకలో విషాదం.. నివాళులర్పించిన నాయకులు..

బూర్గంపాడు: బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు బోడా కిషన్ దుర్మరణంతో సారపాకలో విషాదం నెలకొంది. వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు  కిషన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నాయకుడిగా సీపీఎం జిల్లా నాయకుడిగా ఇరవై ఏళ్లపాటు ఆయన పనిచేశారు. ఐదేళ్లక్రితం సీపీఎం నుంచి బయటకు వచ్చి ప్రజాసంక్షేమసమితి  పేరిట సంస్థను స్థాపించారు. ఆ తర్వాత బీజేపీలో చేరి కొద్దికాలంలోనే జిల్లాస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.


రెండురోజుల్లో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక కాబోతున్నారని, ఈ సమయంలో ఇలా జరిగిందని పలువురు నాయకులు స్మరించుకున్నారు. కిషన్ మృతదేహాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు బెరైడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్రనాయకులు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, బూసిరెడ్డి శంకర్‌రెడ్డి, ఏనుగుల వెంకటరెడ్డి, భవనం రాఘవరెడ్డి, భూక్యా సీతారామ్‌నాయక్, సారపాక సర్పంచ్ చందునాయక్, ఉపసర్పంచ్ పేరాల శ్రీనివాస్, సీపీఎం నాయకులు బండారు వెంకటేశ్వర్లు తదితరులు సందర్శించి నివాళులర్పించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top