గిరిజన గురుకులాల్లో ‘గెస్ట్’గోల

గిరిజన గురుకులాల్లో ‘గెస్ట్’గోల


సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలికల గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఎట్టి పరిస్థితుల్లో పురుషులు ఫ్యాకల్టీగా ఉండవద్దని, ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని గురుకుల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదమవుతున్నాయి. బాలికల గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి దళారులు ఓవైపు వేలాది రూపాయలు వసూలు చేస్తుండగా, మరోవైపు గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా ఏళ్ల తరబడి పనిచేస్తున్న గిరిజన నిరుద్యోగులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.



అసలేం జరుగుతోంది?

రాష్ట్రంలోని పది జిల్లాల్లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 33 గురుకుల పాఠశాలలు, 29 కళాశాలలు నడుస్తున్నాయి. పీజీతోపాటు, ట్రైనింగ్ పూర్తి చేసిన నిరుద్యోగులు అనేకమంది ఖాళీగా ఉన్నపోస్టుల్లో పనిచేస్తున్నారు. వీరికి వేతనం రూపంలో రూ.5 వేల వరకు వస్తోంది. ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 657 మంది పనిచేస్తుండగా, అందులో 353 మంది పురుషులు, 304 మంది మహిళలు ఉన్నారు. అయితే, గురుకులాల కార్యదర్శిగా డాక్టర్. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ జారీచేసిన జీవోలో స్పష్టత లేకపోవడం వివాదానికి దారితీస్తోంది. బాలికల గురుకులాల్లో మహిళా ఫ్యాకల్టీని నియమించాల్సి వస్తే అక్కడ పనిచేసే పురుష ఫ్యాకల్టీని మరో గురుకులానికి బదిలీ చేయాలని నిబంధన ఉత్తర్వుల్లో చెప్పి ఉంటే పరస్పర బదిలీలు జరిగేవి. కానీ, అలాంటి స్పష్టత లేకపోవడంతో ఇప్పుడు పురుష ఫ్యాకల్టీ రోడ్డున పడాల్సిన దుస్థితి ఎదురవుతోంది.



వాస్తవానికి గెస్ట్ ఫ్యాకల్టీని ఎప్పుడైనా తీసేసే అధికారం సంస్థకు ఉంది. అయితే, ఏళ్ల తరబడి తాము గురుకులాల్లో పనిచేస్తుండడంతో ఎప్పటికయినా ఉద్యోగ భద్రత కలగకపోతుందా అనే ఆశతో గిరిజన నిరుద్యోగ యువత ఉంది. మహిళా ఫ్యాకల్టీని బాలికల గురుకులాల్లో నియమించడానికి తాము వ్యతిరేకం కాదని పురుష ఫ్యాకల్టీ అంటున్నారు. కానీ, ఒక బాలికల గురుకులంలో పురుష ఫ్యాకల్టీ స్థానంలో మహిళను తీసుకుంటే ఆమె పనిచేస్తున్న స్థానానికి తమను పంపాలని వారు కోరుతున్నారు. దీనికి తోడు, ఈ విధంగా కొత్త వారిని తీసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో దళారులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. గురుకులాల్లో అధ్యాపక పోస్టులు ఇప్పిస్తామని చెప్పి రూ.50 వేల వరకు తీసుకుని పోస్టింగ్‌లు ఇప్పిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top