ఖజానా కొర్రీలు

ఖజానా కొర్రీలు


అడిషనల్‌ హెచ్‌ఆర్‌ఏ ఇవ్వకుండా ఇబ్బందులు

ప్రభుత్వం స్పష్టత ఇచ్చినా పట్టించుకోని ట్రెజరీ అధికారులు

రెండేళ్లుగా పెండింగ్‌లోనే..




హన్మకొండఅర్బన్‌ : వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలకు ప్రతి నెలా వేతనంతో పాటు ఇవ్వాల్సిన అదనపు హెచ్‌ఆర్‌ఏను ట్రెజరీ అధికారులు కొత్త నిబంధనలు చెపుతూ నిలిపివేశారు. 2015 ఏప్రిల్‌ నుంచి ఒక్కో ఉద్యోగి వేతనంతో పొందాల్సి ఉన్న సుమారు రూ.2వేల వరకు నగదు అందడం లేదు. కొర్రీలు పెడుతూ కాలయాపన చేస్తున్న అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. ఇటీవల టీఎన్జీఓస్‌ నేతలు అర్బన్‌ జిల్లా డీటీఓను  కలిసి వినతిపత్రం కూడా అందజేశారు.



ఎందుకు సమస్య..

ప్రస్తుతం అదనపు హెచ్‌ఆర్‌ఏ చెల్లింపులు చాలా జిల్లాలో డీటీఓలు విడుదల చేస్తున్నాయి. వరంగల్‌తోపాటు మరికొన్నిచోట్ల మాత్రమే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. 2015 ఏప్రిల్‌ నుంచి పీఆర్‌సీ అమలైన సమయంలో అదనపు హెచ్‌ఆర్‌ఏ విషయంలో ప్రభుత్వం వైద్యారోగ్యశాఖకు సంబందించి క్యాడర్ల వారీగా వివరాలు వెల్లడిచింది. అందులో ఎవరికి ఏహెచ్‌ఆర్‌ఏ వర్తిస్తుందో స్పష్టంగా చెప్పింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన వివరాల్లో ఏఎన్‌ఎంలను మెటర్నటీ అసిస్టెంట్లుగా పేర్కొన్నారు. ఆ క్యాడర్‌ వారికి ఏహెచ్‌ఆర్‌ఏ వర్తిస్తుందని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో మొదట 1960 నుంచి మెటర్నటీ అసిస్టెంట్లుగా ఉన్నవారిని తరువాత క్రమంలో వారి హోదాను1984లో ఏఎన్‌ఎంలుగా మార్చారు. ఆ తరువాత ఎన్‌ఎంల హోదాను మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ ఫిమేల్‌(ఎంపీహెచ్‌ఏఎఫ్‌) అని మార్చారు. దీనివల్ల ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎంపీహెచ్‌ఏ(ఎఫ్‌) అని లేనందున వారికి ఏహెచ్‌ఆర్‌ఏ ఇవ్వలేమని అందుకు రూల్స్‌ ఒప్పుకోవని డీటీఓలు బిల్లులు పాస్‌ చేయలేదు. దీంతో సమస్యను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడంతో ఈ విషయంలో స్పష్టత కూడా వచ్చింది. దీంతో జిల్లాలోని ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్‌ తోపాటు ఇతర జిల్లాల్లో ఈ బిల్లులు పాస్‌ చేసి ఏహెచ్‌ఆర్‌ఏ చెల్లింపులు చేస్తున్నారు. కానీ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అర్బన్‌తో పాటు కొన్ని డీటీఓల్లో అధికారులు ససేమిరా అంటున్నారు.

ఉద్దేశ పూర్వకంగా వేధిస్తున్నారు. టి.మాధవరెడ్డి టీఎన్జీఓస్‌(మెడికల్‌) అధ్యక్షుడు



హెచ్‌ఆర్‌ఏ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరణ వచ్చింది. మెటర్నటీ అసిస్టెంట్, ఎంపీహెచ్‌ఏ(ఎఫ్‌) ఒకటే అని చెప్పారు. ఈ విషయంలో కొన్ని డీటీఓల్లో అధికారులు బిల్స్‌ పాస్‌ చేశారు. కొన్ని చోట్ల మాత్రమే ఉద్దేశ పూర్వకంగా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అలవెన్సులు ఉద్యోగులు సకాలంలో పొందకుండా చేయడం మంచిదికాదు. ఈ విషయంలో కార్యాలయాల ఎదుట ఆందోళనకు సిద్ధమవుతాం.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top