మార్కెట్‌ యార్డులో మాయాజాలం

మార్కెట్‌ యార్డులో మాయాజాలం - Sakshi


డీపీసీలో తక్కువ ధర కోట్‌ చేసిన వ్యాపారులు

పంట విక్రయించబోమన్న అన్నదాతలు

అసిస్టెంట్‌ కలెక్టర్‌ వాహనం అడ్డగింత

కలెక్టర్‌ చెంతకు చేరిన వివాదం

అధికారుల హెచ్చరికలతో దిగొచ్చిన వ్యాపారులు

రూ.1200 ఎక్కువ చెల్లించేందుకు అంగీకారం




సుభాష్‌నగర్‌: జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో మాయజాలం కొనసాగుతోంది. నేరుగా కొనుగోలు కేంద్రం (డీపీసీ)లో కొనుగోలుదారులు నాణ్యమైన పంటకు తక్కువ ధర కోట్‌ చేయడంపై అన్నదాతలు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్‌ ఏజెంట్ల వద్ద మామూలు సరుకుకు ఎక్కువ ధర పలకడం, డీపీసీలో మేలైన సరుకుకు తక్కువ ధర కోట్‌ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సరుకు అమ్మబోమంటూ భీష్మించారు. ఈ విషయాన్ని సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ సంగయ్య, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ద్వారా తెలుసుకున్న కలెక్టర్‌ కొనుగోలుదారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దిగొచ్చిన వ్యాపారులు తాము కోట్‌ చేసిన ధర కంటే రూ.1200 ఎక్కువ చెల్లించేందుకు అంగీకరించారు.



ఆర్మూర్‌ ప్రాంతానికి చెందిన 14 మంది రైతులు సోమవారం దాదాపు 200 పసుపు బస్తాలను డైరెక్ట్‌ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కమీషన్‌ ఏజెంట్లు.. డీపీసీలోకి వచ్చిన పసుపునకు ధర తక్కువగా కోట్‌ చేయాలని కొనుగోలుదారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో, బయట మామూలు పసుపునకే మంచి రేటు పలగా, డీపీసీలో నాణ్యమైన పంటకు రూ.6,600 పలకడంపై రైతులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ సంగయ్య దృష్టికి తీసుకెళ్లి, ఇదే ధరకైతే అమ్మేది లేదని రైతులు భీష్మించారు. దీంతో సంగయ్య అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌కు సమాచారమివ్వగా, ఆయన వచ్చి తక్కువ ధర కోట్‌ చేసిన దుకాణం వద్దకు వెళ్లి పసుపును పరిశీలించారు. ఎంతో కష్టపడి పండిస్తున్నామని, తమ శ్రమను దోచుకోవడంపై రైతులు ఆయనతో మొర పెట్టుకున్నారు.



లైసెన్సులు రద్దు చేస్తాం..

రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని, వారిని మోసం చేస్తే సహించబోమని అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఖరీదుదారులను హెచ్చరించారు. అందుబాటులో ఉన్న ఖరీదుదారులతో ఆయన మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో సమావేశమయ్యారు. డైరెక్ట్‌ కొనుగోలు కేంద్రాన్ని నిర్వీర్యం చేసేందుకు కమీషన్‌ ఏజెంట్లు, కొనుగోలుదారులు కుట్ర పన్నుతున్నారన్న విషయం స్పష్టమవుతుందన్నారు. రైతులను మోసం చేయాలని చూస్తే కమీషన్‌ ఏజెంట్లు, ఖరీదుదారుల లైసెన్సులను రద్దు చేసేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. కొనుగోలుదారులందరూ డీపీసీకి వచ్చి ధరలు కోట్‌ చేయాలని ఆదేశించారు. ధర ఎందుకు తక్కువగా కోట్‌ చేశారని కొనుగోలుదారులను ప్రశ్నించగా, డబ్బులు వెంటనే చెల్లించాల్సి ఉంటుందని, నాణ్యత లేదని చెప్పడంతో అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రెండు రకాల పసుపును తీసుకొచ్చి వారికి చూయించండంతో వారు నోరెళ్లబెట్టారు. డీఎంవో రియాజ్, అసిస్టెంట్‌ సెక్రటరీలు నరేందర్, వజీరుద్దీన్, డీపీసీ ఇన్‌చార్జీలు రవీందర్, శ్రీనివాస్‌ ఉన్నారు. అనంతరం, మార్కెట్‌లో జరుగుతున్న మోసాన్ని గ్రహించిన అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్తుండగా రైతులు అడ్డుకున్నారు. తమ సమస్యకు పరిష్కారం చూపిన తర్వాతే వెళ్లాలని, లేకుంటే ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.



దిగొచ్చిన వ్యాపారులు

తాజాగా మార్కెట్‌లో జరిగిన మోసాలపై అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ కలెక్టర్‌ యోగితారాణాకు వివరించారు. ఎలాగైనా రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ మార్కెట్‌ అధికారులను ఆదేశించారు. ధరలో ఇంత వ్యత్యాసం ఉంటే మీరేం చేస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో వారు హుటాహుటీన మార్కెట్‌ కమిటీ కార్యాలయానికి చేరుకొని ఖరీదుదారులను పిలిపించారు. కమీషన్‌ ఏజెంట్ల వద్ద ఉన్న పసుపునకు ధర కోట్‌ చేసి, డీపీసీలో కోట్‌ చేయని ఖరీదుదారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీపీసీకి వచ్చిన పసుపులో దాదాపు 120 క్వింటాళ్లకు రూ.7800 ధర చెల్లించి తీసుకోవాలని ఖరీదుదారులను ఆదేశించారు. డీపీసీలో కోట్‌ చేయని ఖరీదుదారులకు నోటీసులు జారీ చేస్తామని సెక్రటరీ సంగయ్య తెలిపారు. త్వరలో కలెక్టర్‌తో వ్యాపారుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top