దగా ధర!

దగా ధర! - Sakshi


టమాట రైతు కుదేలు

- గిట్టుబాటు ధర లభించక అవస్థలు

- మార్కెట్‌లో మండి నిర్వాహకులు, వ్యాపారుల సిండికేట్‌

- వందల నుంచి పదులకు పడిపోయిన ధర

- పట్టనట్లు వ్యవహరిస్తున్న మార్కెటింగ్‌ శాఖ




ఆరుగాలం శ్రమించి పండించిన పంటను రైతులు మద్దతు ధరతో అమ్ముకోలేని పరిస్థితి. వ్యాపారుల చేతుల్లో టమాట రైతు దగా పడుతున్నాడు. మద్దతు ధర కల్పించి రైతులకు చెదోడువాదోడుగా నిలవాల్సిన మార్కెటింగ్‌ శాఖ అధికారులు ఆ విషయమే మరిచారు. ఇదే అదునుగా భావించిన టమాట వ్యాపారస్తులు మండి యజమానులతో కుమ్మకై సిండికేట్‌ అవతారమెత్తారు. నిన్న మొన్నటి వరకు 15కిలోల టమాట బాక్స్‌ రూ.300 ధర పలికింది. ప్రస్తుతం ఒక్కసారిగా రూ.30లకు పడిపోవడం గమనార్హం.



అనంతపురం రూరల్‌: జిల్లా వ్యాప్తంగా దాదాపు 8వేల హెక్టార్లలో టమాట పంట సాగయింది. ఆశించిన పంట దిగుబడి వచ్చినా రైతులకు ప్రయోజనం లేకుండా పోతోంది. సుదూర ప్రాంతాల నుంచి సరుకును మార్కెట్‌కు తరలిస్తే గిట్టుబాటు ధరలేక కనీసం రవాణా ఖర్చులకూ సరిపోవట్లేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్‌కు తీసుకొచ్చిన సరుకును రైతులు వెనక్కు తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో వ్యాపారుల దోపిడీ అధికమైంది. గిట్టుబాటు ధర ఉన్నా.. లేకపోయినా సరుకును వ్యాపారులు నిర్ణయించిన రేటుకే వదులుకోవాల్సి వస్తోంది. ప్రతి రోజూ అనంతపురం కక్కలపల్లి గ్రామ సమీపంలోని టమాట మార్కెట్‌కు దాదాపు 250 టన్నుల దిగుబడి వస్తోంది.



15 కేజీల టమాట బాక్స్‌ ఆగస్టు నెల మొదలుకొని సెప్టెంబర్‌ మొదటి వారం వరకు దాదాపు రూ.200 నుంచి రూ.300 పైనే ధర పలికింది. కేవలం 10రోజుల వ్యవధిలోనే బాక్స్‌ ధర ఏకంగా 80శాతం మేర తగ్గించేశారు. 15కేజీల బాక్స్‌ కేవలం రూ.30, రూ.40, రూ.50 లకే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. టమాట మార్కెట్లో వ్యాపారులు, మండి నిర్వహకులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకే వేలం పాట నిర్వహించి రైతులను కొల్లగొడుతున్నారు. వ్యాపారులు నిర్దేశించిన ధరకు సరుకును వదులుకోవడం ఇష్టంలేని కొందరు రైతులు వచ్చిన నష్టం ఎట్లా వచ్చిందంటూ టమాట దిగుబడులను రోడ్డు పక్కన పడేసి వెళ్తున్నారు.



పట్టించుకోని మార్కెటింగ్‌ శాఖ అధికారులు:

టమాట మార్కెట్‌లో దోపిడీ రాజ్యం సాగుతున్నా మార్కెటింగ్‌ శాఖ అధికారులు మేల్కొని పరిస్థితి ఉంది. కనీసం మార్కెట్లో జరుగుతున్న వేలం పాటను సైతం పరిశీలించే పరిస్థితిలో లేకపోవడం దారుణం. దీంతో వ్యాపారులు మరో అడుగు ముందుకేసి ఇష్టానుసారం వేలం పాట నిర్వహిస్తూ రైతులను నిలువున ముంచేస్తున్నారు.



మార్కెట్‌లో కనిపించని ధరల బోర్డు

టమాట మార్కెట్‌లో దాదాపు 15 మండిలు ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లలో(కోలార్, మదనపల్లి, చెన్నై) ధరల బోర్డును ప్రతి మండిలోను ఏర్పాటు చేయాలని మార్కెటింగ్‌ శాఖ అధికారులు ఆదేశాలను జారీ చేసినా ఏ ఒక్క మండి నిర్వాహకుడు పాటించడం లేదు. ఇతర ప్రాంతాల్లో ఏ మేరకు టమాట ధర ఉందో తెలుసుకోలేక వ్యాపారుల చేతుల్లో రైతులు నిలువునా మోసపోతున్నారు. మార్కెటింగ్‌ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ధరల బోర్డు సైతం మార్కెట్‌లో పని చేయకపోవడం గమనార్హం.



రవాణ ఖర్చులు, కమీషన్‌కే సరిపోయింది

దాదాపు లక్ష ఖర్చు చేసి మూడు ఎకరాల్లో టమాట పంట సాగు చేశాం. ఆశాజనకంగా దిగుబడి వచ్చింది. 152 టమాట బాక్సులను మార్కెట్‌కు తీసుకొస్తే గిట్టుబాటు ధర లేక ఒక్కో బాక్స్‌ను కేవలం రూ.40లకే వదులుకోవాల్సి వచ్చింది. వచ్చిన సొమ్ము కాస్తా రవాణా ఖర్చులకు, మండి కమీషన్‌కే సరిపోతోంది. కూలీలకు చేతి నుంచి పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

– చంద్రయ్య, కొండపల్లి, కనగానిపల్లి మండలం



టమాటకు గిట్టుబాటు ధర కల్పించాలి

టమాట మార్కెట్లో సిండికేట్‌ వ్యాపారం సాగుతోంది. వ్యాపారులు నిర్దేశించిన ధరకు పంటను వదులు కొవాల్సి వస్తోంది. పంటకు గిట్టుబాటు ధర కల్పించి మార్కెట్లో జరుగుతున్న దోపిడీని అరికట్టాలి. నిన్నమొన్నటి వరకు రూ.200 పలికిన బాక్స్‌ ధర ఒక్కసారిగా రూ.30లకు పడిపోవడం ఏంటి. వెంటనే టమాట మార్కెట్‌ను అధికారుల పర్యవేక్షణలో ఉండేలా చర్యలు చేపట్టండి.

– చినపరెడ్డి, యర్రాయపల్లె, కంబదూరు మండలం



టమాట మార్కెట్లను సీజ్‌ చేస్తాం

మార్కెటింగ్‌ శాఖ నిబంధనలు పాటించకుండా సిండికేట్‌ అయితే మండీలను సీజ్‌ చేస్తాం. ప్రతి మండిలో ఇతర ప్రాంతాల్లోని టమాట ధరల బోర్డులను కచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందే. లేని పక్షంలో చర్యలు తీసుకుంటాం.

- హిమశైల, మార్కెటింగ్‌ శాఖ ఏడీ

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top