రాజబాబు తమ్ముడిగా పుట్టడం ...

రాజబాబు తమ్ముడిగా పుట్టడం ... - Sakshi


కాకినాడ : సినిమా పండాలన్నా, జీవితం పండాలన్నా హాస్యం ప్రధానమని ప్రముఖ సినీ హాస్య నటుడు అనంత్ అన్నారు. స్థానిక విజయదుర్గా పీఠాధిపతి గాడ్ 80వ జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మంగళవారం విలేకరులతో ముచ్చటించారు. పాతతరం నుంచి నేటివరకూ సినిమాల్లో హాస్యం ప్రధాన పాత్ర పోషిస్తోందని, నేడు హాస్యనటులకు కూడా అగ్రస్థానం లభిస్తోందని అన్నారు.

 

నేటి సాంకేతిక యుగంలో ముఖంపై చిరునవ్వు కూడా కరువవుతోందని, హాస్యం లేని జీవితం నిస్సారమవుతుందని అన్నారు. ఇప్పటివరకూ తాను 500 సినిమాల్లో నటించానని చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇంద్రగంటి మోహనకృష్ణ, భీమనేని శ్రీనివాసరావులు దర్శకత్వం వహిస్తున్న సినిమాల్లో ప్రస్తుతం తాను నటిస్తున్నట్లు అనంత్ తెలిపారు. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా వస్తున్న సినిమాతోపాటు, హీరో సాయిధరమ్‌తేజ నటిస్తున్న సినిమాలో కూడా నటిస్తున్నానని వివరించారు.

 

స్వాతికిరణం, ఆపద్బాంధవుడు, అసెంబ్లీరౌడీ, అత్తారింటికి దారేది, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తదితర సినిమాలు తనకు హాస్య నటుడిగా మంచి పేరు తెచ్చాయన్నారు. వెంగమాంబ, అదుర్స్, శ్రీఆంజనేయం తదితర సినిమాల్లో కూడా తాను చేసిన విలన్ పాత్రలు గుర్తింపు తీసుకు వచ్చాయన్నారు. సినీ చరిత్రలో ప్రముఖ హాస్యనటుడు రాజబాబుది సువర్ణాధ్యాయమని అనంత్ అన్నారు. ఆయన తమ్ముడిగా జన్మించడం పూర్వజన్మ సుకృతమని చెప్పారు. రాజబాబు ప్రభావం తనపై పూర్తిగా ఉందని అన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top