ఎమ్మెల్సీ నామినేషన్ల స్వీకరణ

ఎమ్మెల్సీ నామినేషన్ల స్వీకరణ - Sakshi


నియోజకవర్గానికి చిత్తూరులోనే నామినేషన్ల దాఖలు

ఈ నెల 20వ తేదీ వరకు గడువు

 ఉదయం 11 నుంచి మధ్యాహ్నం3 గంటల వరకు స్వీకరణ

రిటర్నింగ్‌ అధికారిగా జిల్లా కలెక్టర్‌




చిత్తూరు (కలెక్టరేట్‌): చిత్తూరు, పొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి     ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల     నామినేషన్లను సోమవారం నుంచి స్వీకరిస్తారు. అందుకు సంబంధించి ఈ నెల 6వ తేదీన ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు ప్రకారం 13వ తేదీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ, అదే రోజు నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ప్రకటించింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు     తమ నామినేషన్లను చిత్తూరు కలెక్టరేట్‌లోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలి. రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లను చిత్తూరులో మాత్రమే దాఖలు చేసుకోవాలి. ఈనెల 21న         నామినేషన్ల పరిశీలన, 23వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. మార్చి 9వ తేదీన ఉదయం     8 నుంచి సాయంత్రం 4 గంటల  వరకు పోలింగ్‌ ఉంటుంది.



అభ్యర్థులు వీరే..

ఎమ్మెల్సీ ఎన్నికలకు వివిధ పార్టీలు తమ అభ్యర్థులను ఇప్పటికే కొందరిని ప్రకటించాయి. అందులో వామపక్షాల తరఫున ప్రస్తుత పట్టభద్రుల ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యంనే తిరిగి ఈ దఫా ఎన్నికల్లో ఆయా స్థానాల్లో పోటీకి దించాయి. అలాగే అధికార పార్టీ టీడీపీ కూడా పట్టభద్రుల స్థానానికి పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పట్టాభిరామిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఉపాధ్యాయుల స్థానానికి మిత్రపక్షమైన బీజేపీకి చెందిన అభ్యర్థిని ప్రకటించాలనే చర్చలు  జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ పట్టభద్రుల స్థానానికి ప్రకాశం జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డిని  ప్రకటించింది.



ఎన్నికల సమస్యలకు వాట్సాప్‌ నం. 7013131464

జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రజలకు ఎదురయ్యే  సమస్యలను వాట్సాప్‌ నం.7013131464కు తెలియజేయాలని జిల్లా కలెక్టర్‌ సిద్దార్థ్‌జైన్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎదురయ్యే సమస్యలను తెలుపుకునేందుకు గాను శనివారం వాట్సాప్‌ నం.7013586219 ను ప్రకటించామన్నారు. అయితే ఆ నంబరుకు బదులు ఈ నూతన వాట్సాప్‌ నంబరుకు పంపాలని తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top