మత్తు...చిత్తు

మత్తు...చిత్తు - Sakshi


నేడు ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ, రవాణా నియంత్రణ దినోత్సవం



కడప:  చాలా మంది మాదక ద్రవ్యాల మత్తులో జోగుతున్నారు. ఎక్కువగా ఆల్కాహాల్, గంజాయి, హెరాయిన్, బ్రౌన్ షుగర్, ఓపీయాడ్ ఇంజెక్షన్లు వంటి మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. వీటిని వినియోగిస్తూ తమ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. జిల్లాలో 100కి 30 మంది వీటి బారిన పడుతున్నారు. కడప రిమ్స్‌కు చికిత్స కోసం వచ్చే ప్రతి 100 మందిలో 10 మంది ఇలాంటి వారే ఉన్నారు. ఆడవారిలో ప్రతి 100 మందిలో ఐదుగురు మత్తుకు బానిసలవుతున్నారు. ఆదివారం ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ, రవాణా నియంత్రణ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం...


 జిల్లాలో...

జిల్లాలో ఎక్కువగా రాయచోటి, బద్వేలు, ప్రొద్దుటూరు, పులివెందుల, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో గంజాయి ప్రభావం ఎక్కువగాఉంది. రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల  నుంచి బ్రౌన్ షుగర్ లాంటి మాదక ద్రవ్యాలను తినుబండారాలు, ఔషధాల రూపంలో గల్ఫ్ దేశాలకు తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి.


నేడు కడపలో ర్యాలీ

ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ఆదివారం నిర్వహించనున్నారు. అనంతరం నూతన కలెక్టరేట్‌లోని సభా భవనంలో సదస్సు నిర్వహిస్తారు. జిల్లాలోని న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వారు, పోలీసు అధికారులు, సిబ్బంది, వైద్యులు, వైద్య సిబ్బంది, ఎన్జీఓ సంఘాల వారు, ప్రజలు పాల్గొంటారు.


 అనర్థాలు

మాదక ద్రవ్యాల బారిన పడితే మెదడుపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారు తమ శరీరాన్ని అదుపు తప్పేలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మత్తులోనే ఏ పని చేయడానికైనా సిద్ధ పడుతూ ఉంటారు.  హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు, ఘర్షణలు, ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.


జాగ్రత్తలు

పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను చైతన్యపరిచి వాటి వల్ల కలిగే అనర్థాలు, నష్టాల గురించి వివరిస్తూ రావాలి. ముఖ్యంగా యువత త్వరగా ఆకర్షితులవుతారు. తమ పిల్లల ప్రవర్తన, వారి స్నేహాల గురించి తల్లిదండ్రులు తెలుసుకుంటూ ఉండాలి. వారు పెరిగే వాతావరణం కూడా ప్రభావం చూపుతుంది.


విజయవంతం చేయండి

రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా లీగల్‌సెల్ అథారిటీ వారు ఆదివారం చేపట్టబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.

- రాఘవరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, కడప.


వైద్యం తప్పనిసరి

మాదక ద్రవ్యాల బారిన పడిన వారు వైద్యసేవలు చేయించుకోవాలి. రిమ్స్‌లో మానసిక వైద్యం విభాగంలో వైద్యసేవలను అందిస్తాం.

- డాక్టర్ వెంకటరాముడు, రిమ్స్ మానసిక వైద్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, కడప.


నిరంతర కృషి

జిల్లాలో గంజాయి, హెరాయిన్‌ల ప్రభావం ఎక్కువగా ఉందని మా దృష్టికి రావడంతో నివారించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం.

- ప్రేమ్ ప్రసాద్, ప్రొహి బిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్, కడప. 


నిఘా పెంచుతాం

జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణపై నిఘా పెంచుతాం. వీటిని ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. - పిహెచ్‌డి రామకృష్ణ, ఎస్పీ

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top