నేడు జిల్లాకు మంత్రి ‘పోచారం’

నేడు జిల్లాకు మంత్రి ‘పోచారం’


ఉదయం నుంచి రాత్రి వరకు పర్యటన

అశోక్‌నగర్‌లో మిర్చి పరిశోధన కేంద్రం స్థల పరిశీలన




హన్మకొండ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి, చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట మండలాల్లో ఏకధాటిగా ఉదయం నుంచి రాత్రి వరకు క్షేత్రస్థాయి పరిశీలనలు, సమీక్షలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు దుగ్గొండి మండలం గొల్లపల్లి గ్రామంలో సేంద్రియ పద్ధతిలో నిర్వహిస్తున్న ఆదర్శ రైతు తోట మల్లికార్జున గుప్తకు చెందిన 130 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించనున్నారు. అనంతరం చెన్నారావుపేట మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనాన్ని ప్రారంభించనున్నారు.



మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అక్కడ బహిరంగ సభ నిర్వహించి, లబ్ధిదారులకు ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు, హిటాచీ యంత్రాన్ని అందజేయనున్నారు. తర్వాత ఖానాపురం మండలంలోని అత్యంత కీలమైన పాకాల సరస్సును సందర్శించనున్నారు. ఈ సందర్భంగా పాకాల సమీపంలోని గిరక తాటిచెట్లను మంత్రి పరిశీలించనున్నారు. అనంతరం నర్సంపేటలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పీఏసీఎస్‌ సీఈఓలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తర్వాత వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.



మిర్చి పరిశోధన కేంద్రం స్థల పరిశీలన..

ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్‌ వద్ద ఏర్పాటు చేయనున్న మిర్చి పరిశోధన కేంద్రానికి కేటాయించిన స్థలాన్ని మంత్రి పోచారం పరిశీలించనున్నారు. మిర్చి పరిశోధన కేంద్రం కోసం ఇప్పటికే అశోక్‌నగర్‌లో 90 ఎకరాల స్థలం కేటాయించారు. ఇందుకు సంబంధించి డీపీఆర్‌ తయారు చేసి కేంద్రానికి పంపాలని కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కాగా, ఈ భూమి అటవీశాఖ ఆధీనంలో ఉండడంతో ఇందుకు సంబంధించి మంత్రి అన్ని వివరాలు సేకరించనున్నారు. మంత్రి పోచారం పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top