‘చైనా’తో సర్కారు బడులు నిర్వీర్యం!

‘చైనా’తో సర్కారు బడులు నిర్వీర్యం! - Sakshi


– సర్కారుపై మండిపడుతున్న ఉపాధ్యాయలోకం

– నేడు బదిలీల మార్గదర్శకాలపై డీఈఓ కార్యాలయాల ముట్టడి

– 23న విద్యాశాఖ డైరెక్టరేట్‌ ఎదుట  మహాధర్నా




కదిరి : ఉపాధ్యాయ బదిలీలు, రేషనలైజేషన్‌ మార్గదర్శకాలు ఉపాధ్యాయలోకాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. సర్కారు బడులను పూర్తిగా నిర్వీర్యం చేసి, చైతన్య, నారాయణ (చైనా) వంటి కార్పొరేట్‌ పాఠశాలల బలోపేతం దిశగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని మండిపడుతోంది. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ‘నారాయణ విద్యాసంస్థల’ అధినేత మంత్రి నారాయణలు ఇద్దరూ వియ్యంకులు కావడంతో ప్రభుత్వ పాఠశాలలను మూతపడేలా చేస్తున్నారని ధ్వజమెత్తుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయ బదిలీల్లో ప్రతిభ ఆధారిత పాయింట్లు పెట్టి పాఠశాల సీనియారిటీతో పాటు సర్వీస్‌లో కూడా సీనియారిటీ ఉన్న ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేస్తున్నారని అన్ని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి.



రేషనలైజేషన్‌ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు దాదాపుగా మూత పడేవిధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని అంటోంది. గతంలో ఉపాధ్యాయుల సీనియారిటీకి 50 శాతం, ప్రతిభ ఆధారితకు 50 శాతం ఉండేలా ఉత్తర్వులు జారీ చేశామని, ఇప్పుడు సర్వీసు సీనియారిటీకి 60 శాతం, మిగిలిన 40 శాతానికి మాత్రమే ప్రతిభ ఆధారిత పాయింట్లు ఉండేలా నిర్ణయం తీసుకుంటున్నామని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ ఉపాధ్యాయులు మాత్రం దీన్ని కూడా తప్పుబడుతున్నారు. అయితే వెబ్‌కౌన్సిలింగ్‌ను తప్పుబడుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రతిభ ఆధారిత పాయింట్లను మాత్రమే మెజార్టీ శాతం వ్యతిరేకిస్తున్నారు. కేవలం పాఠశాల సీనియారిటీ, సర్వీస్‌ సీనియారిటీల ఆధారంగా వెబ్‌ కౌన్సిలింగ్‌ ద్వారానే బదిలీలు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని వారంటున్నారు. వీటన్నింటిపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనబాట పట్టారు. అందులో భాగంగా బుధవారం డీఈఓ కార్యాలయ ముట్టడి నిర్వహించారు. 23న పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ కార్యాలయం ఎదుట మహాధర్నాకు ఉపాధ్యాయులు సిద్దమతున్నారు. ఇందుకు ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా ఉపాధ్యాయులకు మద్దతుగా నిలవనుంది.



ఉపాధ్యాయులకు అన్యాయం చేసే అంశాలు మచ్చుకు కొన్ని...

- 10 నుంచి 20శాతం విద్యార్థుల నమోదుకు పాయింట్లు కేటాయించారు. 100 మంది పిల్లలున్న పాఠశాలలో 20 శాతం అదనంగా చేర్చాలంటే 20 మందిని చేర్చాలి. అదే 10 మంది పిల్లలున్న పాఠశాలలో కేవలం ఇద్దరిని చేరిస్తే కూడా పూర్తి పాయింట్లు తీసుకుంటారు.

- బాగా పాఠాలు చెప్పి నవోదయ, ఏపీ రెసిడెన్సియల్‌ వంటి పాఠశాలలకు ఎంపికయ్యేలా చేసిన ఉపాధ్యాయులకు పాయింట్లు తగ్గిపోతున్నాయి. ఎందుకంటే ఈ ఎంపికైన విద్యార్థులు టీసీ తీసుకొని వెళ్తున్నారు కాబట్టి. కొన్ని గ్రామాల్లో వరుస కరువుల కారణంగా కూడా పిల్లల హాజరు శాతం తగ్గిపోతోంది. దీనికి కూడా ఉపాధ్యాయులే బాధ్యులవుతున్నారు.

- ఒకే పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులకు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా పాయింట్లు వస్తున్నాయి. 1వ తరగతి బోధించే వారికి ఒక్కో విధంగా మిగిలిన తరగతులు బోధించే వారికి ఇంకో విధంగా పాయింట్లు కేటాయిస్తున్నారు.

- ప్రాథమికోన్నత పాఠశాలల్లో పిల్లల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో అక్కడున్న స్కూల్‌ అసిస్టెంట్‌లను తొలగిస్తున్నారు. సబ్జెక్టు టీచర్లు లేని కారణంగా పిల్లలు‘నారాయణ’ బడి బాట పట్టక తప్పలేదు.

- వేసవి సెలవుల్లోనే బదిలీల ప్రక్రియ ముగించి ఉంటే బడులు తెరుచుకోగానే విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరిగేది. ‘మీరు ఎలాగో వెళ్లిపోతారంట కదా..’ అంటూ పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ పాఠశాలలో చేర్పించేందుకు ఇష్టపడటం లేదు. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బడిబాట కాస్త ‘నారాయణ’ బాట పట్టింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top