ధర దగా..

ధర దగా..


► నెల రోజులుగా పడిపోతున్న పొగాకు ధరలు

► సగటున కొనుగోలు ధర రూ.130

► పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

► చోద్యం చూస్తున్న టుబాకో బోర్డు

► తీవ్రంగా నష్టపోతున్న పొగాకు రైతులు




సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నెల రోజులుగా పొగాకు ధరలు పతనమవుతున్నాయి. పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది. కిలో పొగాకు ఉత్పతికి రూ.145కుపైగా ఖర్చవుతుండగా ప్రస్తుతం కొనుగోలు ధరల ప్రకారం.. సగటున రూ.130కి మించి రావడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 130 మిలియన్‌ కిలోల పొగాకు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించగా ప్రకాశం జిల్లాకు 73 మిలియన్‌ కిలోలుగా నిర్ధారించారు. జిల్లా పరిధిలో ఈ ఏడాది 75 వేల ఎకరాల్లో రైతులు పొగాకు సాగు చేశారు. కరువు నేపథ్యంలో ఈ ఏడాది ఉత్పత్తి తగ్గింది. ప్రస్తుత అంచనా మేరకు 50 మిలియన్‌ కిలోలకు మించి ఉత్పత్తి లేదు.



పతనమైన ధరలు..

ఈ ఏడాది మార్చి 13 నుంచి జిల్లాలో పొగాకు వేలం పాటలు మొదలయ్యాయి. ప్రారంభంలో బ్రైట్‌ రకం కిలో రూ.160, మీడియం గ్రేడ్‌ రూ.140, లోగ్రేడ్‌ రూ.100కు తగ్గకుండా ధరలు ఉండేలా చూడాలని జిల్లా రైతులు, రైతు సంఘాలు గుంటూరులో జరిగిన టుబాకో బోర్డు మీటింగ్‌లో డిమాండ్‌ చేశారు.బ్రైట్‌ గ్రేడ్‌ రూ.165కు కొనుగోలు చేయడంతో పాటు మిగిలిన రకాలకు కూడా వ్యాపారులు మంచి ధర ఇచ్చి కొనుగోలు చేశారు.ఆ తర్వాత ఒక్కసారిగా ధరలు పతనమయ్యాయి. గత నెల రోజులుగా ధరలు మరింతగా తగ్గాయి. తాజాగా జిల్లాలో మీడియం గ్రేడ్‌ రూ.100 అమ్ముడుపోతుండగా లోగ్రేడ్‌ రూ.65కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా సగటు ధర రూ.140 పలుకుతుండగా ప్రకాశం జిల్లాలో ఇది మరింత తగ్గి రూ.132గా ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇక నోబిడ్‌ పెద్ద ఎత్తున ఉంటుంది. జిల్లాకు 73 మిలియన్‌ కిలోల నిర్దేశిత లక్ష్యం కాగా ఉత్పత్తి 50 మిలియన్‌ కిలోలకు మించే పరిస్థితి లేదు.



25 మిలియన్‌ కిలోల కొనుగోలు..

ఇప్పటి వరకు జిల్లా పరిధిలో 25 మిలియన్‌ కిలోల పొగాకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం రైతుల వద్ద మీడియం గ్రేడ్, లోగ్రేడ్‌ అధికంగా ఉంది. ప్రస్తుత కొనుగోళ్ల సరళే కొనసాగితే సగటు ధరలు రూ.110కు పడిపోయే అవకాశం ఉంది. అధిక పెట్టుబడులతో పొగాకు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, టుబాకో బోర్డు పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలిచ్చేందుకు ప్రయత్నం చేయాలి.



వ్యాపారులకో న్యాయం.. రైతుకో న్యాయం..

జీఎస్‌టి నేపథ్యంలో పొగాకుపై పన్ను సరికాదని ఆందోళనలకు దిగుతున్న వ్యాపారులు, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వక నష్టాల పాల్జేస్తున్నప్పటికీ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదని రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. వ్యాపారుల కోసం ఒక రోజు వేలం పాటలు ఆపించిన వ్యాపారులు, ఇతర వర్గాలు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలోనూ ఇంతే యూనిట్‌తో నిరసనలు తెలియజేయాల్సి ఉంది. టుబాకో బోర్డు చైర్మన్‌ గిట్టుబాటు ధర విషయం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం పొగాకు కొనుగోలు కేంద్రాలను  పరిశీలించిన దాఖలాల్లేవు. టుబాకో బోర్డు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం పొగాకు వ్యాపారులు, రైతులు, రైతు సంఘాలతో సమావేశం నిర్వహించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతు సంఘం నేత దుగ్గినేని గోపినా«థ్‌ డిమాండ్‌ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా జిల్లా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆయన కోరారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top