ఏజెన్సీ గ్రామాలకు వెంటనే విద్యుత్‌


అల్లిపురం (విశాఖపట్నం): జీకే వీధి మండలం దారకొండ, ఎ.దారకొండ,గాలికొండ, జీకే వీధి, పెదవలస, దేవరాపల్లి, పంచుల, జర్రెల పంచాయితీలలో గల గ్రామాలకు ప్రభుత్వం నిరంతర విద్యుత్‌ కల్పించాలని సీపీఎం విశాఖ జిల్లా కమిటీ కార్యదర్శి కె.లోకనాథం, కమిటీ సభ్యులు వీవీ శ్రీనివాసరావు, జి.సత్యనారాయణ, ఎ.బుజ్జిబాబు, ఎ.దారకొండ సర్పంచ్‌ ముర్ల సంధ్యాకుమారి మంగళవారం  ఈపీడీసీఎల్‌ డైరెక్టర్‌ శేషుకుమార్‌కు వినతి పత్రం అందజేశారు.  ఆయా మండలాల్లో ప్రభుత్వం గత ఏడాది లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసిన సోలార్‌ విద్యుత్‌ పరికరాల వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందని వారు వివరించారు. సోలార్‌ విద్యుత్‌ పలకలు ఏర్పాటు చేసి ఏడాది గడవకముందే మరమ్మతులకు గురవుతున్నాయని తెలిపారు. నాసిరకమైన మెటిరియల్‌ వాడటంతో సోటార్‌ విద్యుత్‌ పరికరాలు మరమ్మతులకు గురయ్యాయన్నారు. కాంట్రాక్టర్‌ స్పందించడం లేదని తెలిపారు. సోలార్‌ విద్యుత్‌కు కావాల్సిన మెటీరియల్‌ను 20 కిలోమీటర్ల దూరం వరకు కాలినడకతో గ్రామాలకు తీసుకెళ్లాల్సి వస్తోందని తెలిపారు. రవాణా ఖర్చులు కూడా ఇవ్వకుండా గ్రామస్తుల శ్రమను కాంట్రాక్టరు దోచుకున్నాడని తెలిపారు. శ్రమను దోచుకున్న కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని 50 గ్రామాలకు చెందిన ప్రజలు డైరెక్టర్‌కు విన్నవించుకున్నారు. ఏజెన్సీలో మంచు, వర్షాకాలం, శీతాకాలం దట్టమైన పొగమంచు కారణంగా చార్జింగ్‌ లేక పోవటంతో సోలార్‌ దీపాలు వెలగడం లేదని తక్షణమే ఆయా గ్రామాలకు సీలేరు నుండి శాశ్వత విద్యుత్తును అందించాలని వారు ఈపీడీసీఎల్‌ డైరెక్టర్‌ శేషుకుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top