టెట్, ఎంసెట్ విధుల్లో స్వచ్ఛందంగా పాల్గొనండి


-ప్రభుత్వ ఉద్యోగులకు టీఎన్‌జీవోస్ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ పిలుపు

-సర్కారుకు టీఎన్‌జీవోల సంపూర్ణ మద్దతు

-ప్రైవేట్ కళాశాలలు బంద్ ఉపసంహరించుకోవాలి




కరీంనగర్ : విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్వహించే టెట్, ఎంసెట్ విధుల్లో ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొనాలని టీఎన్‌జీవోస్ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కరీంనగర్‌లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఆయన టీఎన్‌జీవోలతో అత్యవసరంగా సమావేశమై మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో విద్యాప్రమాణాలు పెంచే దిశలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల సంఘం తీరును ఖండించారు.

ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తనిఖీలు చేపడుతోందని సమర్థించారు.



విద్యాసంస్థల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు టీఎన్‌జీవో సంఘం మద్దతునిస్తుందని తెలిపారు. విద్యాసంస్థల పర్యవేక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకోకుంటే ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. విద్యాసంస్థల్లో తనిఖీలు చేయవద్దని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. టెట్, ఎంసెట్‌లను బహిష్కరించాలని ప్రైవేట్ విద్యాసంస్థలు నిర్ణయించుకోవడం సరికాదన్నారు. ప్రైవేట్ కాలేజీలు బంద్ ఉపసంహరించుకుని పరీక్షలు సజావుగా సాగేలా చూడాలని కోరారు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకునేలా రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.



వాయిదా వేసిన టెట్, ఎంసెట్ నిర్వహణకు ఉద్యోగుల సహకారం పూర్తిగా ఉంటుందన్నారు. అవసరమనుకుంటే గౌరవ వేతనం లేకుండా విధులు నిర్వహించడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో టీఎన్‌జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎంఏ.హమీద్, జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్, కార్యదర్శి వేముల సుగుణాకర్‌ రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు నాగుల నర్సింహస్వామి, పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు అశోక్, కేంద్ర సంఘం నాయకులు రాజయ్యగౌడ్, ప్రభాకర్‌రెడ్డి, రాంకిషన్‌రావు, వేముల రవీందర్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు దారం శ్రీనివాస్‌రెడ్డి, కాళీచరణ్ పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top