తునికాకు తుస్‌..!

ఇల్లెందు :కల్లం వద్ద ఆరబెట్టిన తునికాకు కట్టలు (ఫైల్‌)

  • టార్గెట్‌ చేరని దైన్యం... అందని బోనస్‌ ధైర్యం

  • సేకరించాల్సింది 86,085  స్టాండర్డ్‌ బ్యాగ్‌లు

  • సేకరించింది 52,814 స్టాండర్డ్‌ బాగ్యులే

  •  

    సంవత్సరం పెండింగ్‌ బోనస్‌

    2012–13 రూ.15.41 కోట్లు

    2013–14 రూ.11.19 కోట్లు

    2014–15 రూ.6.52 కోట్లు 

     

     

    ఇల్లెందు: ఆదివాసీలు రెండో పెద్ద పంటగా భావించే తునికాకు సేకరణ ఈ ఏడు నిరాశజనకంగా సాగింది. సంకన జోలె, మెడలో నీటిబుర్ర వేసుకొని..అడవిలో కొండాకోనా..చెట్టూ పుట్టా తిరుగుతూ, దాడికి వచ్చే జంతువులతో పోరాడి కోసుకొచ్చే బీడీ ఆకు పల్చబడుతోంది. పోడు భూముల్లో యంత్రాలతో సాగు, ఫ్రూనింగ్‌ సమయంలో వానలు లేకపోవడంతో..ఆశించిన లక్ష్యం తుస్సుమంది. ఐదు నెలల పాటు సాగే ఆకుల పండగ..పూర్తిస్థాయిలో ఆదాయాన్నివ్వక..మూడేళ్లుగా పెండింగ్‌ బోనస్‌ అందక..జిల్లాలో బీడీ పరిశ్రమ ఏర్పాటు ఆచరణకు నోచక అడవిబిడ్డలకు ఆపసోపాలు తప్పడం లేదు. 

     

    జనవరి నుంచి మే వరకు ఐదు నెలల పాటు జిల్లాలో తునికాకు సేకరణ నిర్వహిస్తారు. భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ డివిజన్ల పరిధిలో విస్తారంగా, ఖమ్మం డివిజన్‌లోని కారేపల్లి, కామేపల్లి, తల్లాడ పరిసరా ప్రాంతాల్లో నామమాత్రంగా ఇలా మొత్తం 29 మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో ఆదివాసీలు దీనిని రెండో ప్రధాన పంటగా భావిస్తారు. పిల్లలు, పెద్దలు అడవిలో ఆకులు సేకరిస్తారు. 50 ఆకులతో ఒక కట్టను కడతారు. ఇలా వెయ్యి కట్టలతో ఒక స్టాండర్డ్‌ బ్యాగుగా రూపొందిస్తారు. గతేడాది కొత్తగూడెం డివిజన్‌లో 50 ఆకుల కట్ట రేటు రూ.1.30 ఉండగా ఈ ఏడాది సీజన్‌లో రూ. 1.36 పైసలకు సాధించుకున్నారు. భద్రాచలం డివిజన్‌లో ఒక్క స్టాండర్డ్‌ బ్యాగుకు ప్రభుత్వ ధర రూ.1,290 ఉండగా, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో రూ.1,250గా నిర్ణచించారు. 2015–16లో 67.66 శాతం తునికాకు సేకరణ సాగగా, ఈ ఏడాది జిల్లాలో 47 యూనిట్లలో 86.085  స్టాండర్డ్‌ బ్యాగులు లక్ష్యం కాగా 52. 814 స్టాండెర్డ్‌ బ్యాగులు సేకరించారు. అంటే 61.23 శాతమే సాధ్యమైంది. తునికాకు సేకరణ ద్వారా ఏటా ప్రభుత్వానికి రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల ఆదాయం లభిస్తుంది. జిల్లాలోని 47 యూనిట్లలో 976 కల్లాల్లో లక్షమందికిపైగా కార్మికులకు ఇది మంచి ఆదాయ వనరు. రాజకీయ, స్వచ్ఛంద సంఘాల పోరాటంతో తునికాకు కట్ట రేటు పెరిగినా..ఆకు సేకరణ గణనీయంగా తగ్గిపోతుండటంతో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు.

    • దక్కని బీడీ పరిశ్రమ..కార్మికులకేదీ ధీమా

    జిల్లాలో ఏటా లక్షమందికి పైగా కార్మికులు తునికాకు సేకరిస్తున్నా..కోట్లలో ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నా..జిల్లాలో బీడీ పరిశ్రమ మాత్రం ఏర్పాటు చేయడం లేదు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తే వేలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. వేసవి కాలం వచ్చిందంటే ఆదివాసీలకు తునికాకు రెండో అతిపెద్ద పంట. సీజన్‌పై గంపెడాశలు పెట్టుకుని ఎదురు చూసే ఆదివాసులకు ఆదాయం చేకూర్చేందుకు ఇక్కడే ఫ్యాక్టరీ నిర్మించాల్సి ఉంది. ఆకు సేకరించి కాంట్రాక్టర్లకు కల్లాల్లో అప్పగించే గిరిజనులు..నేరుగా ఆదాయం పొందే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇళ్ల వద్దే ఉంటూ..బీడీలు చుట్టడం, ఆకు కత్తిరించడం ద్వారా ఉపాధి కల్పించే వీలు కల్పించడం లేదు. జిల్లాని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం డివిజన్‌లలో నాణ్యమైన ఆకు లభిస్తుండడంతో..ఎక్కడో ఓ చోట బీడీ పరిశ్రమ ఏర్పాటు అవుతుందని ఏళ్లుగా ఆశపడుతున్న ఆదివాసీలు, గిరిజనులకు ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. 

     

     

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top