పిడుగుల వాన

పిడుగుల వాన - Sakshi


ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల పిడుగులు

► వెల్దుర్తిలో విద్యార్థి మృతి

► లబోదిబోమన్న కుటుంబ సభ్యులు

►  ఒక్కగానొక్క కొడుకును కోల్పోయి గుండెలు బాదుకున్న తల్లిదండ్రులు

► బస్వాపూర్‌లో రైతు..

►  న్యాల్‌కల్, జగదేవ్‌పూర్, నంగనూర్, మద్దూర్‌ మండలాల్లో పశువులు..




వెల్దుర్తి(తూప్రాన్‌): ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల పిడుగులు పడ్డాయి. వెల్దుర్తిలో విద్యార్థి, జగదేవ్‌పూర్‌ మండలం బస్వాపూర్‌లో రైతు మృతి చెందగా పలు చోట్ల పశువులు ప్రాణాలు కోల్పోయాయి. వెల్దుర్తిలో ఒక్కగానొక్క కొడుకును కోల్పోయి ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. న్యాల్‌కల్, జగదేవ్‌పూర్, నంగనూర్‌ మండలాల్లోనూ పశువులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనలతో బాధిత రైతులు లబోదిబోమన్నారు. వివరాలు ఇలా...



పిడుగుపాటుకు విద్యార్థి బలి కాగా మరో పోతు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన వెల్దుర్తి గ్రామ పంచాయతీ పరిదిలో ఉన్న శేరీ వాడ శివారు పొలాలలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది.మండల కేంద్రమైన వెల్దుర్తిలోని శేరివాడకు చెందిన ఎర్రోల్ల సత్యనారాయణ, కిష్టవ్వ దంపతుల ఒక్కగానొక్క కొడుకు ఆంజనేయులు (18). ఇంటర్‌ పూర్తి చేశాడు. డిగ్రీలో చేరేందుకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నాడు. మంగళవారం తండ్రితోపాటు కలిసి పొలానికి వెళ్లాడు. అదే సమయంలో వర్షం రావడంతో ఆంజనేయులు పరుగెత్తి ఇప్పచెట్టు కిందికి చేరాడు. తండ్రి సత్తయ్య దూరంలోని మరో చెట్టు కిందికి వెళ్లాడు.


ఉరుములు, మెరుపులు అధికం కావడంతో ఒక్కసారిగా ఇప్ప చెట్టుపై పిడుగు పడడంతో అక్కడే ఉన్న ఆంజనేయులు ప్రాణాలు విడిచాడు. అక్కడే చెట్టుకు కట్టేసి ఉన్న పోతు సైతం మృతి చెందింది. ఆ చెట్టు ఆకులు మాడిపోయాయి. కళ్లముందే జరిగిన ఘటనతో కన్నకొడుకు నేలకొరగడంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లితో పాటు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కగానొక్క కొడుకు పిడుగుపాటుకు బలి కావడంతో గుండెలు బాదుకునేలా రోదించడంతో పలువురు కంటతడి పెట్టించింది. 2016లోనే వెల్దుర్తి కళాశాలలో ఇంటర్‌ పూర్తిచేశాడు.


ఆ తరువాత కుటుంబ పరిస్థితుల కారణంగా డిగ్రీలో చేరలేకపోయాడు. ఇప్పుడు డిగ్రీలో చేరేందుకు మూడు రోజుల క్రితమే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నాడని కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. మృతునికి  సోదరి లావణ్య ఉంది. విషయం తెలుసుకున్న ఆర్‌ఐ రమేష్‌యాదవ్, వీఆర్‌వో అర్జున్‌రెడ్డిలు పంచనామా చేశారు. తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం కోసం మెదక్‌ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.



న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): న్యాల్‌కల్‌ మండలం మామిడ్గి గ్రామంలో సోమవారం రాత్రి పిడుగు పడి గేదె మృతి చెందింది. బాధితుల కథనం ప్రకారం.. మామిడ్గి గ్రామానికి చెందిన సంతోష్‌కుమార్‌ ఉదయం పాడి గేదెను మేపేందుకు పొలానికి తీసుకెళ్లాడు. మేత మేసిన తరువాత దాన్ని పొలం వద్ద చెట్టుకు కట్టేశాడు. సాయంత్రం వర్షం కురవడం ప్రారంభమైంది. వర్షం తగ్గిన తర్వాత గేదెను ఇంటికి తీసుకెళ్లాలని రైతు భావించాడు. అంతలోనే పిడుగు పడడంతో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. గేదె విలువ సుమారు రూ.70 వేలు ఉంటుందని బాధితుడు సంతోష్‌కుమార్‌ తెలిపారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని ఆయన కోరాడు.



మునిగడపలో కాడెద్దు మృతి

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): పిడుగుపాటుకు కాడెద్దు మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం మునిగడపలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. మునిగడప గ్రామానికి చెందిన మెడిశెట్టి రాములు తనకున్న భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఎడ్లతో వ్యవసాయ పనులు చేస్తున్నాడు. 


అనంతరం మేత కోసం బావి దగ్గరనే మేపుతున్నాడు. ఈ క్రమంలో ఆకాశంలో ఒకేసారి ఊరుములు మెరుపులు ప్రారంభమయ్యాయి. భారీ శబ్దంతో కూడిన ఉరుములు మెరుపులతో ఎద్దు సమీపంలో పిడుగు పడింది. దీంతో మేత మేస్తున్న ఎద్దు అక్కడక్కడే మృతి చెందిందని బాధితుడు రాములు తెలిపారు. ఎద్దు మృతితో రూ.40 వేల నష్టం వాటిల్లిందని వాపోయాడు. అలాగే చాట్లపల్లి, మునిగడప, వట్టిపల్లి, చిన్నకిష్టాపూర్, చాట్లపల్లి తదితర గ్రామాల్లో వర్షం జల్లులు కురిసాయి.  



ఆంక్షాపూర్‌లో గేదె మృతి

నంగునూరు(సిద్దిపేట): పిడుగు పాటుకు చూడితో ఉన్న గేదె మృతి చెందింది. ఈ టన మంగళవారం ఆంక్షాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పంజాల సదానందంగౌడ్‌ గేదెను వ్యవసాయ బావివద్ద ఉన్న చింతచెట్టుకు కట్టేశాడు. సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమైంది. అదే సమయంలో చింతచెట్టుపై పిడుగు పడడంతో అక్కడే ఉన్న గేదె మృతి చెందింది. ఈనే దశలో ఉన్న గేదె మృతి చెందడంతో సుమారుగా రూ.50వేల నష్టం జరిగిందని బాధిత రైతు సదానందంగౌడ్‌ బోరున విలపించాడు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.



నర్సాయపల్లిలో రెండు ఆవులు..

మద్దూరు(హుస్నాబాద్‌): పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి చెందాయి. మండలంలోని నర్సాయపల్లిలో మంగళవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వానకు తోడు పిడుగు పడడంతో ముస్త్యాల కిష్టయ్యకు చెందిన రెండు ఆవులు మృతి చెందాయి. దీంతో రూ.60 వేల వరకు నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top