మూడు కుటుంబాలకు షాక్‌

ఆస్పత్రి వద్ద విలపిస్తున్న మతుని తల్లి, భార్య, కుమారుడు

వేర్వేరు సంఘటనల్లో విద్యుత్‌షాక్‌తో ముగ్గురి దుర్మరణం

వినాయక నిమజ్జనోత్సవంలో ఇద్దరు

దేవుడికి దక్షిణ వేయబోతూ మరొకరు

మూడు కుటుంబాల్లో నెలకొన్న విషాదం

 

విజయనగరం రూరల్‌/శంగవరపుకోట: రోజూ మాదిరిగానే శుక్రవారం తెల్లారింది. కానీ ఆ మూడు కుటుంబాల్లో విషాదంతో ఉషోదయం పలికింది. విద్యుత్‌రూపంలో మత్యువు ముగ్గురిని కబళించింది. వారిపైనే ఆధారపడిన కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వినాయక నిమజ్జనానికి ఉత్సాహంగా తరలిన ఓ గుంపులో ఇద్దరు... రోజూ మాదిరిగా దైవదర్శనం చేసుకుని దక్షిణ వేయడానికి గ్రిల్స్‌లో చేతులు పెట్టిన మరొకరు షాక్‌తో కన్నుమూశారు. విజయనగరం మండలం గుంకలాం, శంగవరపుకోట పట్టణంలో చోటు చేసుకున్న వేర్వేరు సంఘటనల్లో ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతంతో మత్యువాతపడ్డారు. గుంకలాంలో వినాయక నిమజ్జనం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకోగా... శంగవరపుకోటలో ధర్మవరానికి చెందిన ఓ వ్యాపారి దేవుడికి దండం పెట్టుకుని దక్షిణ వేసేందుకు యత్నించగా ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. గుంకలాం గ్రామంలో గురువారం రాత్రి వినాయక విగ్రహం నిమజ్జనం సందర్భంగా గ్రామస్తులు ఊరేగింపు నిర్వహించారు. అర్ధరాత్రి సమయంలో గ్రామ శివారున పెద్ద చెరువులో నిమజ్జనం పూర్తి చేసుకుని గ్రామంలోకి 15 మంది వరకు యువకులు ట్రాక్టర్‌పై వస్తున్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్‌కు ఏర్పాటు చేసిన పొడవాటి కర్రలు విద్యుత్‌ వైర్లకు తగిలాయి. తడిసి ఉన్న ఆ కర్రల ద్వారా ట్రాక్టర్‌కు విద్యుత్‌ సరఫరా కాగా అందులో ఉన్న యువకులకు విద్యుత్‌షాక్‌ తగిలింది. చెప్పులతో ఉన్న యువకులు 15 మంది వరకు ట్రాక్టర్‌ పైనుంచి కిందికి దూకేశారు. చెప్పులు లేకపోవడం, అప్పటికే తడిసి ఉండటంతో గ్రామానికి చెందిన సిరిపురపు శంకరరావు(22), సువ్వాడ శ్రీను విద్యుత్‌షాక్‌ గురయ్యారు. వెంటనే తేరుకున్న గ్రామస్తులు వారిని కిందికి దించి, కొన ఊపిరి ఉన్నట్టు భావించి 108కు సమాచారం అందించారు. జిల్లా కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉండటం, ద్వారపూడి వద్ద రోడ్డు విస్తరణ పనులు చేపట్డడంతో 108 వాహనం ఆలస్యమైంది. ఆలస్యం చేయకుండా వారు ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా ద్వారపూడి వద్ద 108 వాహనం ఎదురైంది. అందులోని సిబ్బంది పరిశీలించి ఇద్దరూ మరణించినట్టు నిర్ధారించడంతో వారిని వెనక్కి తీసుకువెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి మతదేహాలను కేంద్రాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం శంకర్‌రావు మతదేహాన్ని తల్లిదండ్రులకు, శ్రీను మతదేహాన్ని వారి బంధువులకు అప్పగించారు.

 

 

గ్రామంలో విషాద ఛాయలు

సంబరాలు చేసుకున్న ఆ గ్రామంలో ఇద్దరు యువకులు మతి చెందడంతో విషాదఛాయలు అలముకున్నాయి. మతిచెందిన సిరిపురపు శంకరరావు మండల పరిషత్‌ కార్యాలయంలో తాత్కాలికంగా కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈయన తండ్రి రమణ తాపీ పని చేస్తుండగా, తల్లి రామయ్యమ్మ కూలిపని చేస్తోంది. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉండి అందివచ్చిన కొడుకు అకారణంగా మత్యువాత పడటంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. 

 

 

తల్లిదండ్రులను చూడకుండానే అనంతలోకాలకు...

మరో మతుడు సువ్వాడ శ్రీను గంట్యాడ మండలం లక్కిడాం గ్రామంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈయన తల్లిదండ్రులు పేదరికంతో ఇల్లు గడవక చెన్నైలో కూలిపనికి వలస వెళ్లారు. మతుడు శ్రీను, చెల్లెలు రోహిణితో కలిసి బంధువుల ఇంట్లో ఉంటున్నారు. శ్రీను మరణవార్త తెలుసుకుని తల్లిదండ్రులు చెన్నైలో శుక్రవారం బయలుదేరారని, తల్లిదండ్రులను చూడకుండానే కొడుకు మతి చెందడంతో గ్రామస్థులు, బంధువులు రోదిస్తున్నారు. 

 

 

అమ్మవారి హుండీలో దక్షిణ వేద్దామని...

శంగవరపుకోట పట్టణంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద విద్యుదాఘాతంతో ధర్మవరానికి చెందిన ఓ వ్యాపారి విద్యుదాఘాతంతో మతి చెందాడు. దీనికి సంబంధించి ఎస్సై కె.రవికుమార్, ప్రత్యక్ష సాక్షులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. వ్యాపారి తూతిక త్రినాథరావు(61) సంతల్లో కిరాణా సరకులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం వేకువ జామున ధర్మవరం నుంచి వ్యాన్‌లో అరకు సంతకు బయలుదేరి వెళ్తూ ఎస్‌.కోట దేవి గుడి వద్ద హుండీలో చిల్లర వేసేందుకు ఆగాడు. ఆ సమయంలో ఆలయానికి తలుపులు వేసి ఉండడంతో లోపలున్న హుండీలో చిల్లర వేసేందుకు ఇనుప గ్రిల్స్‌ లోపలికి చెయ్యిపెడుతూనే గిలగిలా కొట్టుకోవడంతో పక్కనే ఉన్నవారు వెంటనే కర్రతో పక్కకునెట్టారు. కొన ఊపిరితో ఉన్న త్రినాథరావును ఎస్‌.కోటలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆయన మతి చెందాడు. దసరా ఉత్సవాల సందర్భంగా కొంతమంది ఆలయాన్ని విద్యుత్‌ దీపాలంతో అలంకరిస్తున్నారు. ఈ  క్రమంలో విద్యుత్‌ తీగలు తెగి ఇనుప గ్రిల్స్‌పై పడడం వల్ల త్రినాథరావు విద్యుదాఘాతంతో మతి చెందాడని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అయితే అంతకుముందే కొందరు ఇదేవిధంగా హుండీలో డబ్బులు వేశారని, వారికి ఏమీ కాలేదని, త్రినాథరావు గుండెపోటుతో మతి చెంది ఉంటాడని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మతుడికి భార్య హైమావతి, కుమార్తె సత్యతులసి, కుమారుడు సతీష్‌ ఉన్నారు. ప్రమాదం జరగడంతో ధర్మవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. విద్యుదాఘాతంతోనే వ్యాపారి మతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె. రవికుమార్‌ తెలిపారు. మతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top