కుక్కను కాపాడబోయి..

కుక్కను కాపాడబోయి.. - Sakshi


- ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం

పాలమూరు జిల్లాలో ఘటన

 

 కోస్గి: అడవి పందుల నుంచి రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలిగొంది. కంచెకు తగిలి షాక్‌కు గురైన పెంపుడు కుక్కను కాపాడబోయి యజమాని, అతన్ని కాపాడబోయి కుమారుడు, కుమారుడిని కాపాడబోయి తల్లి మృతిచెందింది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం తోగాపూర్ అనుబంధ గ్రామం పందిరి హన్మండ్లలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తుడుం వెంకట య్య (60)కు పది ఎకరాల భూమి ఉంది. చేను వద్దనే ఇంటిని నిర్మించుకున్నారు. వెంకటయ్య, అమృతమ్మ దంపతులతో పాటు కుమారుడు కిష్టప్ప (38), కోడలు యాదమ్మ నివాసం ఉంటున్నారు.



జొన్నపంటను అడవి పందులు నాశనం చేస్తుండడంతో వాటి బారి నుంచి పంటను కాపాడుకునేందుకు చుట్టూ విద్యుత్ కంచె ఏర్పాటు చేశా రు. వెంకటయ్య రోజూ రాత్రి కంచె వేసి ఉద యం తీసేవాడు. కానీ శుక్రవారం ఉదయం మరిచిపోయాడు. విద్యుత్ కంచెకు తగిలి పెం పుడు కుక్క విలవిల్లాడుతుండగా దాన్ని కాపాడబోయి విఫలయత్నం చేశాడు. అనంతరం తాడుతో కట్టి బయటికి లాగుతుండగా షాక్‌కు గురై వెంకటయ్య (60) మరణించాడు. గమనించిన కుమారుడు కిష్టప్ప పరుగెత్తుకుంటూ వచ్చి తండ్రిని కాపాడబోయి అతనూ షాక్‌కు గురై కొట్టుమిట్టాడుతుండగా, ఆతృతతో వచ్చి న అమృతమ్మ (58) కూడా విద్యుత్ ప్రమాదానికి గురైంది. విషయం తెలుసుకున్న యాద మ్మ వెంటనే కరెంట్ స్విచ్ ఆఫ్ చేసి వచ్చే చూసేసరికి ముగ్గురు ప్రాణాలు వదిలారు. ఒకరిని కాపాడబోయి మరొకరు ఇలా విద్యుత్ షాక్‌తో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కోస్గి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.



 వంశంలో ఒక్కడే కుమారుడు

 వెంకటయ్య కుటుంబంలో మగపిల్లవాడు ఒక్క డే ఉన్నారు. వెంకటయ్య వారి తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు, ముగ్గురు కూతుళ్లు. వెంకటయ్యకు కూడా కిష్టప్ప ఒక్కడే కుమారుడు, ముగ్గురు కూతుళ్లు, కిష్టప్పకు కూడా ఒక్కడే కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అవ్వ, తాతలతో పాటు తండ్రి మృతి చెందడంతో నిరాశ్రయులైన ఆ చిన్నారుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. రెండో కూతురు శిరీషా ఈ ఘటనను చూసి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top