మూడు గంటలు ఉత్కంఠ..

మూడు గంటలు ఉత్కంఠ.. - Sakshi

  • సెల్‌టవరెక్కిన యువరైతు

  • భూముల భాగ పరిష్కారంలో అన్యాయం

  • అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆత్మహత్యాయత్నం

  • సీఐ, తహసీల్దార్‌ హామీతో దిగివచ్చిన బాధితుడు

  •  


    శింగనమల: భూ సమస్య పరిష్కారంలో రెవెన్యూ, పోలీసు అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఓ యువ రైతు సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. మూడుగంటల పాటు అందరినీ హడలెత్తించాడు. అనంతరం అధికారుల హామీతో కిందకు దిగివచ్చాడు. శింగనమల మరువకొమ్మ వద్ద సోమవారం ఈ ఘటన జరిగింది. బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.


    మదిరేపల్లికి చెందిన ఆరుగురు అన్నదమ్ములకు ఏడెకరాల ఉమ్మడి భూమి ఉంది. ఈ భూమి అందరికీ సమంగా పంచాల్సి ఉండగా అప్పటి తహసీల్దార్‌ విజయకుమారి ఒకరి పేరు మీద 1.83 ఎకరాలు అదనంగా అడంగల్‌లో నమోదు చేశారు. అన్నదమ్ముల్లో ఒకరైన వెంకటసుబ్బయ్య అనే యువరైతు దీనిపై అప్పట్లోనే తహసీల్దార్‌, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కూడా అదనంగా భూమి నమోదు చేయించుకున్న వ్యక్తికే వత్తాసు పలికి, ఫిర్యాదుదారుడిపైనే కేసు నమోదు చేశారు. తనకు అన్యాయం జరిగిందని మనస్తాపానికి గురైన వెంకటసుబ్బయ్య సోమవారం శింగనమల మరువకొమ్మ వద్ద గల సెల్‌ టవర్‌ ఎక్కి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని మీడియాకు సమాచారం ఇచ్చాడు.


    మీడియా ప్రతినిధులతోపాటు ప్రస్తుత తహసీల్దార్‌ నాగేంద్ర, ఎస్‌ఐ హమీద్‌ఖాన్‌లు సంఘటన స్థలానికి చేరుకుని వెంకటసుబ్బయ్యతో మాట్లాడారు. ఒక దశలో ఎస్‌ఐ సెల్‌ టవర్‌ ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా.. పైకి వస్తే తాను దూకి ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు చెప్పడంతో ఆయన వెనక్కు వచ్చారు.


    అనంతరం సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్, సీపీఐ నాయకులు గోపాల్‌లు ఫోన్‌లో వెంకటసుబ్బయ్యతో మాట్లాడారు. భూ వ్యవహారంలో బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుంటామని, రెవెన్యూ సమస్య లేకుండా చూస్తామని సీఐ, తహసీల్దార్‌ హామీ ఇచ్చారు. మూడు గంటలపాటు టవర్‌పైనే నిల్చున్న బాధితుడు ఎట్టకేలకు శాంతించి కిందకు దిగి వచ్చాడు. భూముల భాగ పరిష్కారంలో తమకు న్యాయం జరగకపోవడం వల్లే ఆత్మహత్యాయత్నం చేశానని తెలిపాడు. అనంతరం సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్, ఎస్‌ఐ హమీద్‌ఖాన్‌లు వెంకటసుబ్బయ్యను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top