ప్రమాద పరిహారం ఇలా పొందాలి

ప్రమాద పరిహారం ఇలా పొందాలి - Sakshi


ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇటువంటి ప్రమాదాల్లో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రమాదంలో ఇంటి యజమానులను కోల్పోతున్న కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రమాదాల సమయంలో బాధితులు పరిహారం పొందే విధానాన్ని రాయవరం ఎస్సై బొడ్డు సూర్యఅప్పారావు ఇలా వివరిస్తున్నారు.

 - రాయవరం

 

ప్రమాద కారకుడి బాధ్యతలు..


* రోడ్డు ప్రమాద నివారణ చట్టం సెక్షన్ 134 ప్రకారం..ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్ లేదా యజమాని బాధితులను వెంటనే సమీప ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించాలి. ఘటన జరిగినప్పుడు స్థానికుల ఆగ్రహం, ఇతర కారణాల వల్ల అలా చేయలేకపోతే మినహాయింపు ఉంటుంది.



* దగ్గరలో ఉన్న పోలీస్‌స్టేషన్‌లో ప్రమాదానికి కారణమైన పరిస్థితులను వివరించాలి. పోలీసులు అడిగిన అన్నింటికి సమాధానాలు చెప్పాలి. సాధారణంగా 24 గంటల లోపు ఇది జరగాలి. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు, యజమాని పేరు, బీమా, ఆ రోజు వాహనం ఎవరి యాజమాన్యంలో ఉంది వంటి వివరాలను పోలీసులకు చెప్పాలి. తక్షణం ఈ వివరాలు అందుబాటులో లేకపోతే వారం రోజుల లోపల అందజేయాలి.

     

* ఈ సమాచారాన్నతంటినీ బాధితులు తెలుసుకోవాలంటే రవాణా అధికారులకు లేదా పోలీసు అధికారులకు దరఖాస్తు చేసుకుని వివరాలు పొందవచ్చు.



* బాధితులు దరఖాస్తు చేసుకున్న వారం లోపు ఆ వివరాలు అందజేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుంది.

 

క్షతగాత్రులకు వైద్యం చేయవచ్చు..

రోడ్డు ప్రమాదం మెడికో లీగల్ కేసు అన్న కారణంగా ప్రైవేటు డాక్టర్లు వైద్యానికి నిరాకరిస్తుంటారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అలా నిరాకరించకూడదు. బాధితులకు వెంటనే వైద్య సహాయం అందజేసి, ప్రత్యేక చికిత్స అవసరమైనప్పుడు సంబంధిత ఆస్పత్రులకు పంపించాలి.

 

పరిహారం కోసం ఎలా దరఖాస్తు చేయాలి..

కాకినాడ జిల్లా కోర్టులో మోటారు వాహనాల యాక్సిడెంట్ క్లైమ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా జడ్జి స్థాయి వారు ఈ దరఖాస్తులను పరిశీలిస్తారు. అదనపు క్లైమ్స్‌కు ట్రిబ్యునల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే క్లైమ్ దరఖాస్తులను ముందుగా జిల్లా కోర్టులో దాఖలు చేయాలి.



దరఖాస్తు ఎక్కడ దాఖలు చేయాలంటే..

ప్రమాదం జరిగిన పరిధిలోని తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలి. ప్రమాదం జరిగిన ఆరు నెలల్లోగా దాఖలు చేయాలి. తగిన కారణాలు చూపితే ఏడాది వరకు దరఖాస్తును స్వీకరించే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులు. ప్రమాదాల్లో నష్టం పొందిన బాధితులు. మరణించిన వ్యక్తికి చెందిన చట్టబద్ధ ప్రతినిధులు. గాయాలైన మరణించిన వ్యక్తి చట్టబద్ధ ప్రతినిధులతో నియమితుడైన ఏజెంట్.

 

తప్పు బాధితులదే అయినా పరిహారం పొందవచ్చు..

రోడ్దు ప్రమాదానికి బాధితులే కారణమైనా నష్టపరిహారం పొందే అవకాశం చట్టంలో ఉంది. సెక్షన్ 140 ప్రకారం డ్రైవర్ తప్పు లేకపోయినా ప్రమాదానికి గాయపడినా, మరణించినా బాధితులు పరిహారం పొందవచ్చు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top