నా జీవితంలో ఇదే పెద్ద పదవి : హరీశ్‌రావు

నా జీవితంలో ఇదే పెద్ద పదవి :  హరీశ్‌రావు - Sakshi


-  ఇంతకంటే పెద్ద పదవి రాదు

- అధికారంలో ఉన్నప్పుడే మెదక్ జిల్లా రుణం తీర్చుకుంటా  

- మల్లన్నసాగర్ ప్రాజెక్టును కట్టి తీరుతా

- విలేకరులతో ఇష్టాగోష్టిలో మంత్రి హరీశ్‌రావు




సంగారెడ్డి: ‘నా జీవితంలో ఇదే పెద్ద పదవి. ఇంత కంటే పెద్ద పదవి రాదు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ తర్వాత వారసులు ఎవరన్న విషయమై చర్చ జరుగుతున్న తరుణంలో.. ఆయన పై విధంగా తన అంతరంగాన్ని వ్యక్తం చేశారు. తనను ఆదరించిన మెదక్ జిల్లా ప్రజల రుణాన్ని అధికారంలో ఉన్నప్పుడే తీర్చుకుంటానన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కొమురవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను కట్టి తీరుతానని పునరుద్ఘాటించారు. బుధవారం రాత్రి ఆయన మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డితో కలసి దాదాపు గంటన్నరపాటు విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..



 విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి..

 ‘మల్లన్న సాగర్ ముంపు బాధితులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. తెలంగాణ బిడ్డలుగా ఇయ్యాల మనం కూడా ఆలోచించుకోవాలి. నీళ్లు ఉంటే రైతు ఆత్మహత్యలు ఆగుతాయి. నీళ్లు తేవాలంటే ప్రాజెక్టులు కట్టాలే. అందుకోసం భూ సేకరణ తప్పదు. ఈ సమయంలో ఇలాంటి ఆందోళనలు వస్తూనే ఉంటాయి. పైన కేసీఆర్ ఉన్నరు.. ఇక్కడ నేనున్నందున మల్లన్నసాగర్ మీద ప్రేమ ఉంది. నేను లేకుంటే ఈ ప్రాజెక్టును ఎవరు పట్టించుకుంటరు? ఎన్ని అడ్డంకులు ఎదురైనా దీన్ని కట్టి తీరుతాం. 7.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందించి జిల్లావాసుల రుణం తీర్చుకుంటా’ అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.



 ఊరుకు ఊరు ఇస్తానన్నాం...

 ‘ముంపు గ్రామ ప్రజాప్రతినిధులను, పెద్దలను 40-50 మందిని పిలిపించి నేనే స్వయంగా మాట్లాడినా. కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ఒక వైపు, స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరోవైపు కూర్చున్నారు. దాదాపు ఐదు గంటలు మాట్లాడినా. 123 ఐచ్ఛికం, కాదంటే 2013 చట్టం అని చెప్పాను. అంతిమ నిర్ణయం రైతులదే అని స్పష్టంగా చెప్పాం. పాత ఊరును పోలిన కొత్త ఊరు కట్టిస్తామని, ఇదే ఊరు పేరుతో పాత సర్పంచు, పాత ఎంపీటీసీలు కొనసాగే విధంగా చట్టం చేస్తామని చెప్పాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ పథకాల్లో 50% పథకాలను ముంపు గ్రామాల వారికే ఇస్తామన్నాం. సాదాబైనామాలు కూడా అమలు చేసి పరిహారం ఇస్తామన్నాం. ప్రభుత్వ భూముల్లో సాగుచేస్తున్న వారికీ పరి హారం కట్టిస్తామన్నాం. గ్రామంలోకే అధికారులు వచ్చి ఈ చేతితో రిజిస్ట్రేషన్లు.. ఆ చేతితో చెక్కులు తీసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నాను. అన్ని విన్న వాళ్లు  నాకు శాలువ కప్పి వెళ్లిపోయారు. కానీ దురదృష్టం ఏమిటంటే ప్రతిపక్షాలు రాజకీయంగా వారిని రెచ్చగొట్టారు. గందరగోళానికి గురి చేశారు’ అని హరీశ్ వ్యాఖ్యానించారు.

 

 రైతు ఒప్పుకుంటేనే..

 ‘123 జీవో అంటే మ్యూచువల్ కన్సెంట్ అవార్డు. రైతు అంగీకరిస్తేనే ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. దీని ప్రకారమైతే భూసేకరణ చట్టం 2013 కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎకరానికి దాదాపు రూ.6 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. అదే భూమిలో బోరు, బావి, చెట్లు చేమ, పైపులైన్లు.. ఇలా ఏమి ఉంటే వాటికీ అదనంగా నష్టపరిహారం కట్టిస్తున్నాం. ఈ లెక్కన చూసుకుంటే సగటున ఒక్కో ఎకరానికి రూ.7 లక్షల నుంచి రూ.7.5 లక్షల చొప్పున పరిహారం వస్తుంది. ఈ మొత్తాన్ని 15 రోజుల్లోనే వాళ్ల చేతుల్లో పెడుతున్నాం. భూ సమస్య అడ్డంకులు తొలగితే ప్రాజెక్టు వేగంగా పూర్తవుతుందనే ఈ జీవోను తెచ్చాం. భూ సేకరణ చట్టం 2013లో ఆ వెసులుబాటు లేదు. 123 జీవో కింద అంగీకరించని రైతు వద్ద భూసేకరణ చట్టం ద్వారానే తీసుకుంటాం. వాళ్లు కోర్టుకు పోవచ్చు. కేసు ఎన్నేళ్లు నడిచినా చివరకు కోర్టు ఎంత ఇవ్వమంటే ప్రభుత్వం అంత ఇస్తుంది. దురదృష్టం ఏమిటంటే ప్రతిపక్షాలు మొదటి నుంచీ రాజకీయంగానే ఆలోచన చేస్తున్నాయి’ అని హరీశ్ ఆవేదన వ్యక్తంచేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top