ఈ పోరాటం ఆగదు

కిర్లంపూడిలో నిరసన తెలుపుతున్న ముద్రగడ - Sakshi


కాపులకు న్యాయం జరిగేవరకు దీక్ష:  ముద్రగడ

 

♦ సతీమణితో కలసి ఆమరణ దీక్షకు శ్రీకారం

♦  పోలీసు దిగ్బంధంలో కిర్లంపూడి.. నిఘా నీడలో నిరశన ప్రారంభం

♦ తనకు ఎలాంటి పోలీసు రక్షణ అవసరం లేదన్న ముద్రగడ

♦ ఉదయాన్నే ఇంటి చుట్టూ మోహరించిన బలగాలు

♦ {పహరీ గేట్లు మూసి మద్దతుదారులు లోనికి వెళ్లకుండా అడ్డగింపు

♦ భద్రత పేరిట పోలీసుల ఆంక్షలపై కాపు నాయకుల ఆగ్రహం

 

 (కిర్లంపూడి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/ సాక్షి ప్రతినిధి, కాకినాడ): ఒకవైపు ఇంటి చుట్టూ భారీయెత్తున మోహరించిన పోలీసులు, మరోవైపు మద్దతుదారుల జై.. జై నినాదాలు. శుక్రవారం ఉదయం ఉత్కంఠభరిత వాతావరణంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆయన సతీమణి పద్మావతి కూడా నిరశన దీక్షకు కూర్చున్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో ఉదయం 8 గంటలకే భార్యాపిల్లలతో కలిసి పూజలు ముగించుకున్న ముద్రగడ  8.10 గంటలకు వరండాలోకి వచ్చారు. 8.26 గంటల సమయంలో భార్యతో కలసి దీక్షకు శ్రీకారం చుట్టారు.



మిగతా కుటుంబసభ్యులు కూడా వారి వద్ద కూర్చున్నారు. అంతకుముందు ముద్రగడ మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు కాపులకు న్యాయం జరిగేవరకు తన పోరాటం ఆగదన్నారు. తన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించేవరకు దీక్ష కొనసాగిస్తామన్నారు. గాంధేయ మార్గంలోనే తన దీక్ష సాగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. తనకు ఎలాంటి పోలీసు రక్షణా అవసరం లేదన్నారు. తనకొచ్చిన ప్రమాదమేమీ లేదని పదేపదే చెప్పారు. జగ్గంపేట సీఐ కేవీవీ సత్యనారాయణను పిలిపించి.. ‘ఎస్పీగారికి చెప్పండి నాకేమీ కాదని. ఏం జరిగినా నాది బాధ్యత. మీరు నిశ్చింతగా ఉండండి’ అని కోరారు. తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చే సోదరులను రక్షణ పేరిట అనవసరమైన ఆంక్షలతో అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. సహకరించాలని మీడియాను కోరారు. దూరప్రాంతాల నుంచి శ్రమకోర్చి కిర్లంపూడికి రాకుండా ప్రతిఒక్కరూ మధ్యాహ్న భోజనం మానేసి ఖాళీ పళ్లేల శబ్దంతో ప్రభుత్వానికి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.



 భారీగా బలగాల మోహరింపు

 ముద్రగడ పద్మనాభాన్ని హౌస్ అరెస్టు చేశారా? అంటే.. అవుననిపించే రీతిలో ఉదయం 6.30 గంటలకే ఆయన నివాసం చుట్టూ పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఎస్పీ రవిప్రకాశ్ ప్రత్యేక పోలీసు బలగాలతో కిర్లంపూడికి చేరుకుని ముద్రగడ ఇంటి వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఏఆర్, సీఆర్‌పీఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు బలగాలను మోహరింపజేశారు. ఇద్దరు ఏఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, ఎస్సైలు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ముద్రగడ ఇంటి ప్రహరీకి ఉన్న రెండు ప్రధాన గేట్లను మూసివేశారు. కొద్దిమంది ప్రముఖులను మినహా లోనికి ఎవ్వరినీ అనుమతించకుండా ఆంక్షలు విధించారు. బయటి ప్రాంతాల వారు కిర్లంపూడికి రాకుండా కట్టడి చేశారు. గుర్తింపు కార్డులు తనిఖీ చేసి, పేర్లు నమోదు చేసుకున్నాకే విలేకరులను సైతం లోనికి అనుమతించారు. పోలీసుల ఆంక్షలపై మండిపడ్డ ముద్రగడ మద్దతుదారులు పలుమార్లు గేట్ల వద్దకు వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.



 కిర్లంపూడి కిటకిట

 కిర్లంపూడితో పాటు ముద్రగడ నివాసం మద్దతుదారులతో కిటకిటలాడుతోంది. పలువురు నేతలు, శ్రేయోభిలాషులు ముద్రగడను కలసి సంఘీభావం తెలిపారు.



 కాపులది న్యాయమైన కోరిక : వీహెచ్

 కిర్లంపూడికి వచ్చిన వి.హనుమంతరావు మధ్యాహ్నం ముద్రగడ దంపతులతో కొద్దిసేపు ముచ్చటించారు.అనంతరం మీడియాతో మాట్లాడారు. కాపులది న్యాయమైన కోరిక అన్నారు. ఈ సందర్భంగా పోలీసుల వైఖరిపై ఆయన మండిపడ్డారు. అంతకుముందు ముద్రగడ ఇంటిలోనికి వెళ్లనివ్వకుండా పోలీసులు వీహెచ్‌ను అడ్డుకున్నారు. దీంతో వీహెచ్ గేటు ముందే కొద్దిసేపు బైఠాయించి నిరసన తెలిపారు. ఓఎస్‌డీ శివశంకర్‌రెడ్డి జోక్యం చేసుకుని వీహెచ్‌ను లోనికి పంపించారు.



 జగన్‌కు లింక్ పెట్టడం బాబుకు పరిపాటైంది: వట్టి

 శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, మంత్రిగా సేవలందించిన సీనియర్ నాయకుడు ఒకరు.. ఒక లక్ష్యం కోసం నిరాహార దీక్ష చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులా ఉందని వట్టి వసంతకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. ‘ఇలా భద్రత ముసుగులోనే గతంలో వంగవీటి మోహనరంగాకు విజయవాడ నడిబొడ్డున ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు’ అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏం జరిగినా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లింక్ పెట్టి ఆరోపణలు చేయడం చంద్రబాబుకు పరిపాటైపోయిందని దుయ్యబట్టారు.



 కాపులంతా ముద్రగడ వెంటే: జోగయ్య

 పాలకొల్లు టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్న డిమాండ్‌తో ఉద్యమబాట పట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వెంటే రాష్ట్రంలోని కాపులంతా ఉన్నారని మాజీ ఎంపీ చేగొండి వెంకట హరిరామజోగయ్య అన్నారు. ముద్రగడ ఆమరణ దీక్షకు మద్దతుగా జోగయ్య శుక్రవారం మధ్యాహ్నం భోజనం తినడం మాని పాలకొల్లులోని తన ఇంట్లో ఖాళీ కంచంపై గరిటతో డప్పుకొట్టారు.



 ముద్రగడతో బొడ్డు భాస్కర రామారావు భేటీ

 టీడీపీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ముద్రగడతో భేటీ అయ్యారు. సుమారు గంటసేపు ఏకాంతంగా మాట్లాడిన తర్వాత విలేకరులతో ముచ్చటించారు. గురువారం రాత్రి చర్చల సందర్భంగా ముద్రగడ చేసిన ప్రధాన డిమాండ్లను శుక్రవారం సీఎం చంద్రబాబుతో పాటు కొందరు పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం చెప్పిన అంశాలతో మళ్లీ ఇక్కడికి వచ్చానన్నారు.  శనివారం కొందరు అధికార పార్టీ పెద్దలు ముద్రగడను కలిసే వీలుందని, సాయంత్రానికల్లా చర్చలు ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. ముద్రగడ కూడా కొన్ని అంశాల్లో సానుకూలంగానే స్పందించారని చెప్పారు.

 

 స్వల్పంగా తగ్గిన బీపీ, షుగర్ లెవల్స్

 ముద్రగడ దంపతులకు 3 గంటలకోసారి వైద్య పరీక్షలు

 ముద్రగడ దంపతులకు వైద్యుల బృందం శుక్రవారం మూడు గంటలకోసారి వైద్య పరీక్షలు నిర్వహించింది. ఉదయం 10, మధ్యాహ్నం 1, సాయంత్రం 4, రాత్రి 7.30 గంటలకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యుల బృందం రాత్రి 8 గ ంటలకు ఆరోగ్య పరిస్థితిపై వివరాలను వెల్లడించారు. ముద్రగడ దంపతులిద్దరి బీపీ, షుగర్, పల్స్, బరువులను పరీక్షించగా, బీపీ, షుగర్ లెవల్స్‌లో స్వల్పంగా తరుగుదల కన్పించిందని డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ ఉమాసుందరి వెల్లడించారు. ముద్రగడ భార్య పద్మావతి షుగర్ లెవల్ 80కి చేరుకుందనీ, శనివారం 70కి చేరే అవకాశం ఉందని చెప్పారు. ఆమె వయస్సు రీత్యా షుగర్ లెవల్స్ తగ్గడం మంచిది కాదన్నారు. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలో రాజమండ్రి వైద్యులతో పాటు, విశాఖపట్నం కేజీహెచ్ వైద్య బృందం పరీక్షలు నిర్వహిస్తోంది.

 

 ఖాళీ కంచాల చప్పుళ్లే భేరీనాదాలై..

 ముద్రగడ పిలుపు మేరకు తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా తదితర జిల్లాల్లో పలుచోట్ల కాపు ఉద్యమ నాయకులు, కార్యకర్తలు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఖాళీ కంచాలు, గరిటెలతో బయటకు వచ్చి పెద్ద పెట్టున శబ్దం చేసి ప్రభుత్వంపై నిరసన తెలిపారు. కిర్లంపూడిలో ఖాళీ కంచాల శబ్దం మార్మోగింది. కాపుల ఆక లి కేకల్లోంచి ఉద్భవించిన భేరీనాదంగా పలువురు నేతలు దీనిని అభివర్ణించారు. అదే విధంగా శ్రీకాకుళంలోనూ ముద్రగడకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు, జిల్లా తెలగ సంక్షేమ సంఘం ప్రతినిధి శవ్వాన ఉమామహేశ్వరి ఆమరణ దీక్షకు దిగారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top