మూడో రోజూ ముసురే..

మూడో రోజూ ముసురే.. - Sakshi


జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు

గోదావరిలోకి చేరుతున్న వరద నీరు

రెండు గ్రామాలకు రాకపోకలు బంద్

చర్ల, బూర్గంపాడులో 7 సెం.మీ వర్షపాతం


 సాక్షిప్రతినిధి, ఖమ్మం : జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో కొన్ని మండలాల్లో భారీ.. మరికొన్ని మండలాల్లో ఒక మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అంతేకాక ఉపరితల బొగ్గు గనుల్లో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. మంగళవారం చర్ల, బూర్గంపాడు మండలాల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల ఈనెలలో ఇప్పటివరకు 21.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.


 భద్రాచలం వద్ద గోదావరికి కొత్తనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇక్కడ 8.6 అడుగుల నీటిమట్టం నమోదైంది. వర్షాలు ఇలాగే ఉంటే నీటిమట్టం పెరగనుంది. వర్షం వల్ల భద్రాచలంలోని రాజుపేట కాలనీ, ఎంపీ కాలనీకి వెళ్లే దారులు జలమయమయ్యాయి.


 దుమ్ముగూడెం మండలం తూరుబాక వాగు, గుబ్బలమంగివాగు, సీతావాగు, చర్ల మండలం తాలిపేరు, టపావాగు, జోడిచీలికలవాగు, చింతవాగు, రోటింత వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాలిపేరు ప్రాజెక్టులోకి ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి భారీగా వరద నీరు వస్తోంది. కుర్నపల్లి, బత్తినపల్లి, ఎర్రంపాడు, చెన్నాపురం తదితర గ్రామాలకు వెళ్లే మార్గాల్లో వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలు స్తంభించాయి. వెంకటాపురం మండలం పాలెంవాగు, కుక్కతొర్రెవాగు, బోదాపురం వాగుల్లోకి వరద నీరు చేరుతోంది.



కొత్తగూడెం డివిజన్‌లోని గోధుమవాగు ముర్రేడువాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పైనుంచి వస్తున్న వరదతో కిన్నెరసానిలోకి భారీగా వరద నీరు వస్తోంది. రిజర్వాయర్ నీటిమట్టం 394 అడుగులకు చేరింది. ఓపెన్‌కాస్టుల వద్ద భారీ వర్షం కురుస్తుండటంతో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతోంది. రెండు రోజులుగా 10వేల టన్నులకు పైగా ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. అలాగే వర్షం కారణంగా కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ పనులు నిలిచిపోయాయి.



అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట మండలం గుబ్బలమంగమ్మ వాగు పొంగడంతో కంట్లం, ముల్కలపల్లి మండలం కొబ్బరిపాడు వద్ద పాములేరు వాగు పొంగడంతో బూర్గంపాడుకు రాకపోకలు నిలిచిపోయాయి. దమ్మపేటలోని పేరంటాళ్ల చెరువు, మందలపల్లిలోని కొత్తచెరువు, ముష్టిబండ ముత్తమ్మకుంటతోపాటు మండలంలోని పలు చెరువులు అలుగుపోశాయి. వర్షాలు మరింత పెరిగితే నల్లా వీరయ్యకుంట అలుగు పడుతుందని, దీంతో నెమలిపేట కాలనీ ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని అక్కడి కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇల్లెందు మండలంలోని బుగ్గవాగు, ముర్రేడు వాగులోకి వర్షం నీరు చేరడంతోపాటు చెరువులు, కుంటల్లోకి కూడా నీరుచేరింది. కొమరారం, పోలారం, మాణిక్యారం, మామిడిగూడెం, రొంపేడు గ్రామాల్లో వరద నీరు పంటచేల మీదుగా ప్రవహిస్తోంది. 


పినపాక నియోజకవర్గంలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా అశ్వాపురం మండలంలో కురిసిన భారీ వర్షం వల్ల చుట్టుపక్కల 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మణుగూరు మండలంలో కురిసిన వర్షంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. పినపాక మండలంలో భారీ వర్షం కారణంగా ఏడూళ్లబయ్యారంలో వీధులన్నీ జలమయమయ్యాయి. పెదవాగు పొంగి పొర్లింది.

ఖమ్మం నగరంతోపాటు సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు పలుమార్లు వర్షం పడింది. ముసురు వేయడంతో వాతావరణం చల్లబడింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top