పార్థీ ముఠా... బహుపరాక్‌!


►రాత్రివేళ పెట్రోలింగ్‌ పెంచిన పోలీసులు

►గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు

►అవసరమైతే చాటింపు వేయించాలని సర్పంచ్‌లకు వినతి

►రూరల్‌ జిల్లాలోని అన్ని పీఎస్‌ల పరిధిలో అలర్ట్‌




గీసుకొండ(పరకాల): అత్యంత పాశవికంగా దొంగతనాలు, దోపిడీకి పాల్పడే పార్ధీ ముఠా ఉమ్మడి జిల్లాలో ప్రవేశించిందనే సమాచారంతో పోలీసుశాఖ అప్రమత్తమైంది. ఈక్రమంలో వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో అలర్ట్‌గా ఉండాలని సీఐలు, ఎస్సైలతో పాటు సిబ్బందికి ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దీంతో రాత్రిపూట గ్రామాల్లో గస్తీ పెంచారు.



గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రతీ పీఎస్‌ పరిధిలో సంబంధిత పోలీస్‌ అధికారులు కోరుతున్నారు. గ్రామాల్లో చాటింపు వేయించి, రాత్రి వేళల్లో యువత గస్తీ తిరిగేలా టీంలను ఏర్పాటు చేయడానికి పోలీస్‌శాఖ ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇప్పటికే హుజూరాబాద్‌ మండలంలోని ధర్మరాజుపల్లిలో ఆరు బయట నిద్రిస్తున్న దంపతులపై దాడి చేసి బంగారాన్ని ఎత్తుకెళ్లిన ఘటన జరిగిన వెంటనే జిల్లాలోని అన్ని పీఎస్‌ల పరిధిలో అలర్ట్‌గా ఉండాలని ఆదేశాలు వెలువడ్డాయి.



కిరాతకమైన ముఠా

పార్దీ ముఠాలోని సభ్యులు అతి కిరాతకంగా వ్యవహరిస్తాని పోలీసు రికార్డుల ప్రకారం తెలుస్తుంది. పిల్లలు, పెద్దలని చూడకుండా దారుణంగా గొంతు కోసేస్తారు. గతంలో ఉమ్మడి జిల్లా పరిధిలో రఘునాథపల్లి మండల పరిధిలో హైవేపై ఓ హోటల్‌లో నిద్రిస్తున్న కుటుంబంలోని పిల్లలు, వృద్ధులు కలిపి మొత్తం ఐదుగురిని హతమార్చి అందిన కాడికి దోచుకున్న వారు పార్ధీ ముఠా సభ్యులుగా నిర్ధారించారు. పొరుగు జిల్లాలోనూ ఈ ముఠా ఆకృత్యాలు భయం కలిగించే రీతిలో ఉన్నాయి. మహారాష్ట్ర ఉత్తర ప్రాంతం, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో నివాసం ఉండే ఈ తెగ వారి వృత్తి పిట్టలు పట్టడమే అయినా ప్రవృత్తి దొంగతనాలు, దోపీడీలు చేయడమేనని తెలుస్తోంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లకు ఇరువైపులా చోరీలు చేసి సులభంగా తప్పించుకుంటారు.



పగలు స్కెచ్‌..రాత్రి చోరీ..

ఈ ముఠాలోని ఆడ, మగ సభ్యులు గుంపులుగా రైళ్లలో వచ్చి పట్టణాలు, గ్రామాల సమీపంలో తిష్ట వేస్తారు. పగలంతా తోపుడు బండ్లు, లేదంటే చిల్లర వ్యాపారాలు చేస్తున్నట్లు అన్ని ప్రాంతాల్లో సంచరిస్తారు. జనం తక్కువగా ఉండే తాళం వేసి ఉన్న ఇళ్లను చోరీకి అనుకూలంగా ఉండే వాటిని ఎంపిక చేసుకుంటారు. రైలు మార్గాలను వదిలి సొంత వాహనాలపై కూడా వీరు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.



ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ప్రాంతంలో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే మాకు సమాచారం అందించాలి. శుభకార్యాలు, తీర్థయాత్రలకు వెళ్లే వారు సమీప పోలీస్‌స్టేషన్లలో సమాచారం ఇవ్వాలి. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్తే పక్కింటి వారికి చెప్పి కన్నేసి ఉంచాలని కోరాలి. ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు, పెద్ద మొత్తంలో డబ్బు పెట్టవద్దు. గ్రామాల్లో యువకులు అప్రమత్తంగా ఉండి వీలైతే వంతుల వారిగా గస్తీ తిరగాలి. ఎండాకాలంలో కూలర్ల శబ్దానికి ఇంట్లో ఏం జరిగినా వినిపించదు. ఇదే అదనుగా దొంగలు ఇంటిలోకి ప్రవేశించే అవకాశమున్నందున అప్రమత్తంగా వ్యవహరించాలి.

                                                                     – ప్రభాకర్, సీఐ, గీసుకొండ

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top