మా వాళ్లకు కార్లు ఇవ్వాల్సందే

మా వాళ్లకు కార్లు ఇవ్వాల్సందే


జూపూడిపై నాయకుల తీవ్ర ఒత్తిడులు

కొన్ని రోజులు ఆగాలంటున్న చైర్మన్‌


నెల్లూరు(సెంట్రల్‌): మా అనుచరుల వద్ద నుంచి తీసుకున్న ఇన్నోవా కార్లను వారికి తిరిగి ఇవ్వాల్సిందేనని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌రావుపై తీవ్ర స్థాయిలో నాయకులు ఒత్తిడులు తెస్తున్నట్లు తెలిసింది. ఎస్సీ కార్పొరేషన్‌ సహకారంతో సబ్సిడీ ద్వారా ఇచ్చిన ఇన్నోవా కార్లపై సీఎం చంద్రబాబు ఫొటో లేదనే కారణంతో ఇచ్చిన 10 కార్లలో 8 కార్లను చైర్మన్‌ శనివారం వెనక్కు తీసుకున్నారు. తీసుకునే ముందు కూడా మీ నాయకులు చెప్పిన వారికే ఇచ్చాం..ఇప్పుడు ఈ విధంగా చేయడం ఏమిటని చైర్మన్‌ కూడా చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఆ నాయకులే జూపూడిపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అవసరమైతే ఫొటోలు వేయించి ఇచ్చేయాలని చెప్పుకొస్తున్నారు. లేకుంటే తమ పరువు పోతుందని చెప్పుకొస్తున్నారు. దీంతో చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌రావు కూడా కొన్ని రోజులు ఆగాలని చెపుతున్నట్లు తెలుస్తోంది.



ఇంత కాలం ఎందుకు స్పందించలేదు

గత ఏప్రిల్‌ 14న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి రోజున ఇన్నోవా కార్లను లబ్ధిదారులకు ఇచ్చారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కార్లు జిల్లాలో తిరుగుతున్నాయి. లబ్ధిదారులకు ఇచ్చే సమయంలో కొన్ని కార్లకు సీఎం స్టిక్కర్‌ కూడా లేదు. ఆ తరువాత ఉన్న స్టిక్కర్‌ను కూడా పీకేశారు. జిల్లాలోని టీడీపీ నాయకులు ఎవరూ పట్టించుకోకపోయినా చైర్మన్‌ మాత్రం కార్లను వెనక్కు తీసుకోవడం ఏంటని పలువురు నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో జేసీ ఇంతియాజ్‌ కూడా రెండోసారి ఈ కార్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అప్పట్లో కూడా ఈ కార్లకు సీఎం స్టిక్కర్‌ లేదు. అప్పుడు అధికారులు కూడా ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాల్సి ఉంది.



బాబు ఫొటోలు ఉంటే బాడుగలు రావా!

చంద్రబాబు ఫొటో ఉన్న స్టిక్కర్‌ కారుకు ఉంటే చాలా వరకు బాడుగలు రావని పలువురు లబ్ధిదారులు చెప్పుకొస్తున్నారు. అందువల్లే సీఎం ఫొటో తీసేయాల్సి వచ్చిందని వారి వాదన. బాడుగలు రాకపోతే నెలకు దాదాపుగా రూ.20 వేల వరకు ఎస్సీ కార్పొరేషన్‌కు కట్టాల్సి ఉంది. ఈ నగదు ఎక్కడి నుంచి తీసుకురావాలని పలువురు లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఇన్నోవా కార్ల వ్యవహారంతో జిల్లా నాయకులకు, చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌రావు మధ్య కొంత మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. నాయకులు చెప్పిన ప్రకారం తిరిగి కార్లు ఇవ్వకపోతే అదే స్థాయిలో తిరుగుబాటు కూడా ఉంటుందని పలువురు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. కాగా సీఎం ఫొటో లేదని వెనక్కు తీసుకున్న కార్లను నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి తిరిగి ఆ లబ్ధిదారులకే ఇస్తారా..లేక వేరే వారికి ఇస్తారా అనేది వేచిచూడాల్సి ఉంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top