96 మంది విద్యార్థులకు ఒక్కరే టీచర్

96 మంది విద్యార్థులకు ఒక్కరే టీచర్ - Sakshi


♦ ఉన్న ఒక్కరూ రెండురోజులుగా విధులకురాని వైనం

♦ ఇద్దరు విద్యాబోధకులున్నా నెలరోజులుగా గైర్హాజరు

♦ తెరుచుకోని పాఠశాల.. ఆగ్రహించిన తల్లిదండ్రులు

 

 అమ్రాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో విద్యావ్యవస్థ గాడిన పడడం లేదు. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేని విషయమై హైకోర్టు జోక్యం చేసుకున్నా.. పరిస్థితిలో కించిత్తు మార్పు రావడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపంతో మారుమూల గ్రామాల పాఠశాలల నిర్వహణ అస్త్యవస్తంగా మారింది. ఒకటి నుంచి నాలుగు తరగతులు..96 మంది విద్యార్థులు.. ఒక్కరే ఉపాధ్యాయుడు..అతనూ రెండు రోజులుగా పాఠశాలకు గైర్హాజరు.. ఈ నేపథ్యంలో తమ పిల్లల భవిష్యత్తు ఆగమవుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల రెండురోజులుగా తెరుచుకోవడంలేదు.



ఒక ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు విద్యాబోధకులు ఉన్నప్పటికీ  శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలైనా పాఠశాల తెరవకపోవడంతో విద్యార్థులు వరండాలోనే ఆడుతూ కాలం గడిపారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యకమిటీ సభ్యులు ఆగ్రహించి పాఠశాల ఎదుట విద్యార్థులతో కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. బయట నుంచి బియ్యం తెచ్చి వంట మహిళలతో వండించి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టారు.  ఈ విషయమై మండల విద్యాధికారి బాలకిషన్‌ను వివరణ కోరగా హెచ్‌ఎం స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు హాజరవుతున్నట్లు తెలిసిందని, మిగతా ఇద్దరు విద్యాబోధకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top