నిలువ నీడ కరువు

నిలువ నీడ కరువు


► ప్రధాన జంక్షన్‌లలో కానరాని బస్‌షెల్టర్‌లు

► మండుటెండలో ప్రయాణికులకు తప్పని అవస్థలు

► చెట్ల నీడన, దుకాణాల వద్ద నిరీక్షించాల్సిన దుస్థితి

► రహదారుల విస్తరణ  నేపథ్యంలో బస్‌ షెల్టర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌


విజయనగరం మున్సిపాలిటీ:  జిల్లా కేంద్రంలో ప్రయాణికులకు నిలువనీడ కరువైంది. పట్టణం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే వారితో పాటు వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చే ప్రయాణికుల సంఖ్య ప్రతి రోజూ వేలల్లో ఉన్నప్పటికీ వారికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం పాలకులు, అధికారులు నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. ఎండలో ఎండుతూ, వర్షంలో తడుస్తూ బస్సులు, ఇతర వాహనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.


ప్రధాన జంక్షన్‌లలో బస్‌ షెల్టర్లు లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం.  ప్రస్తుతం ప్రతి రోజూ 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో రోడ్లపైన బస్సులు, ఆటోల కోసం వేచి ఉండడం కూడా ఒక విధంగా సాహసమనే చెప్పాలి. దగ్గర్లో ఉన్న చెట్ల నీడన, దుకాణాల వద్ద నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. 


ఇబ్బందుల నడుమ నిరీక్షణ

మున్సిపాలిటీ పరిధిలో సుమారు మూడు లక్షలకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో కొంతమంది ప్రతి రోజూ ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చే వారి సంఖ్య కూడా వేలల్లోనే ఉంటుంది. అయితే సేదతీరేందుకు అవసరమైన బస్‌షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు  ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఉన్న బస్‌షెల్టర్లు కూడా రోడ్ల విస్తరణ పేరుతో తొలగించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.


ప్రధానంగా పరిశీలిస్తే జిల్లా పరిపాలన కేంద్రమైన కలెక్టరేట్‌ జంక్షన్‌, మయూరి జంక్షన్‌,  ఆర్టీసీ కాంప్లెక్స్‌ జంక్షన్‌, బాలాజీ జంక్షన్, దాసన్నపేట రింగ్‌రోడ్‌ జంక్షన్, మూడు లాంతర్ల జంక్షన్‌, రింగ్‌రోడ్‌ ఐస్‌ఫ్యాక్టరీ జంక్షన్, మున్సిపాలిటీ కార్యాలయం జంక్షన్ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ ప్రాంతాల్లో ఎటువంటి బస్‌షెల్టర్లు లేకపోగా.. అవసరం లేని కొత్తపేట జంక్షన్, పూల్‌బాగ్‌కాలనీ ప్రాంతాల్లో గతంలో ఏర్పాటు చేసిన రెండు షెల్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి.


గతంలో ఎమ్మెల్యే, ఎంపీల నిధులతో విచ్చలవిడిగా బస్‌షెల్టర్లు ఏర్పాటు చేసే సంస్కృతి ఉండగా.. ప్రస్తుతం అటువంటి సౌకర్యాల కల్పనపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించకపోవడం ఇబ్బందికరంగా మారుతోంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న పట్టణంలో ఇటువంటి సౌకర్యాలు సమకూర్చే విధంగా అధికారులు దృష్టి సారించాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. పక్కనే ఉన్న విశాఖ జిల్లాలో ప్రతి 100 మీటర్ల దూరంలో అధునాత సౌకర్యాలతో బస్‌ షెల్టర్లు ఏర్పాటు చేస్తుంటే అభివృద్ధి పేరు చెప్పి కాలం గడుపుతున్న జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.


రహదారుల విస్తరణ నేపథ్యంలోనైనా స్పందించేనా...?

ప్రస్తుతం విజయనగరం పట్టణంలో రహదారి విస్తరణ పనులు పేరిట అధికార యంత్రాంగం హడావుడి చేస్తోంది.  మున్సిపాలిటీ, ఆర్‌అండ్‌బీ, ఉడా ఆధ్వర్యంలో రూ. కోట్లు వెచ్చించి అభివృద్ధి, రహదారి విస్తరణ పనుల పేరిట చేపడుతున్న పనుల్లో భాగంగానైనా ప్రధాన జంక్షన్‌లలో బస్‌షెల్టర్లు నిర్మించాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది.


పట్టించుకునే వారేరి..?

అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న పట్టణంలో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన జంక్షన్‌లో బస్‌ షెల్టర్లు లేకపోవడం దురదృష్టకరం. షెల్టర్ల ఏర్పాటుకు పాలకులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి.    – కె. అనిల్‌రాజు ,ప్రైవేటు  ఉద్యోగి, విజయనగరం.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top