మన్నవరం తరలింపు కుట్రే

దీక్షలో ఎమ్మెల్సీలు యండపల్లి శ్రీనివాసులురెడ్డి, విఠపు బాలసుబ్రమణ్యం, గేయానంద

– కారకులు వెంకయ్య, చంద్రబాబే 

–దీక్ష చేపట్టిన ఎమ్మెల్సీ యండపల్లి 

తిరుపతి తుడా : వెనుకబడిన రాయలసీమకు ప్రధాన పారిశ్రామికవాడగా ఉన్న మన్నవరం భెల్‌ ప్రాజెక్టును తరలించే కుట్ర జరుగుతోందని ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద మన్నవరం ప్రాజెక్టు సాధన కోసం ఆయన శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 30 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. మన్నవరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయగా, ప్రస్తుతం బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు తరలించే కుట్ర పన్నాయన్నారు. మన్నవరం ప్రాజెక్టుS తరలింపు కుట్రలో వెంకయ్యనాయుడే కీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇందుకు చంద్రబాబు సహకరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్‌ కంపెనీలు ఇక్కడ వంద కోట్ల పెట్టుబడులు పెట్టాల్సి ఉండగా, ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్‌ లేదని చెప్పి మరో ప్రాంతానికి తరలించే కుట్ర చేయడం బాధాకరమన్నారు. ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టును మరో చోటుకు తరలించకుండా నిరుద్యోగులు, విద్యార్థులు అడ్డుకోవాలన్నారు. మరో ఎమ్మెల్సీ గేయానంద మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేప«థ్యంలో కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా అమలు చేయకుండా వెంకయ్య అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని పార్లమెంటులో హామీ ఇచ్చినా ఇక్కడి ప్రజలపై చిన్నచూపు చూస్తున్నారన్నారు. మాజీ ఎంపీ చింతామోహన్‌ మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు మన్నవరం ప్రాజెక్టును అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రామానాయుడు, సీపీఎం కార్యదర్శి కుమార్‌రెడ్డి, కందారపు మురళి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు రాజేంద్ర, పునీత, ప్రతిమారెడ్డి, గుణశేఖర్‌నాయుడు, కాంగ్రెస్‌ నాయకులు మాంగాటి గోపాల్‌రెడ్డి, శ్రీదేవి, రాయలసీమ హక్కుల సాధన సమితి కన్వీనర్‌ నవీన్‌కుమార్‌రెడ్డి, సీపీఐ నగర అధ్యక్షుడు చిన్నం పెంచలయ్య, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంఘాల నేతలు దీక్షకు మద్దతిచ్చారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top