తర‘గని’ సంపద


బెల్లంపల్లి : నల్ల బంగారు నేలలో మరో శతాబ్దానికి సరిపడా బొగ్గు సంపద నిక్షిప్తమై ఉంది. ఇప్పటికే నూట ఇరవై ఎనిమిదేళ్లుగా బొగ్గు వెలికితీతలో సింగరేణి చరిత్ర సృష్టిస్తుండగా.. మరో వందేళ్లూ తవ్వకాలు జరిపినా తర‘గని’ నిల్వ నిక్షిప్తమై ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నేళ్ల కాలంలో ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌ జిల్లాలకు సొంతమైన బొగ్గు నిల్వలు కొత్తగా మరో రెండు జిల్లాలకు విస్తరించాయి. జిల్లాలో పునర్విభజనతో ఏర్పడిన పెద్దపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలకూ సింగరేణి వారసత్వం సంక్రమించింది. అపారమైన నల్ల బంగారు ఖనిజం తెలంగాణ రాష్ట్రానికి మకుటాయమానంగా భాసిల్లబోతోంది. వచ్చే ఐదేళ్లలో కొత్తగా 26 బొగ్గు గనులను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల శాసనసభలో ప్రకటించి నిరుద్యోగులు, కార్మికుల వారసులకు ఆశలు కల్పించారు. నూతనంగా ప్రారంభించే గనుల్లో 16 ఓపెన్‌కాస్టు గనులు, మరో 10 భూగర్భ గనులు ప్రతిపాదనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. స్వరాష్టం ఏర్పడిన తర్వాత అనతికాలంలోనే అంత సంఖ్యలో కొత్త గనులు ఏర్పడనుండడం గమనార్హం.



కొత్త బ్లాక్‌లు

రాష్ట్రంలో బొగ్గు నిక్షేపాలకు ఏమాత్రం కొదువ లేదు. సింగరేణి బొగ్గు అన్వేషణ విభాగం ప్రతి యేటా సర్వే చేసి కొత్త ప్రాంతాల్లో బొగ్గు సంపదను కనుగొంటోంది. కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో కాగజ్‌నగర్‌ బ్లాక్, బెల్లంపల్లి ఓసీపీ–2(ఎక్స్‌టెన్షన్‌)       – మిగతా 2లోu నుంచి డోర్లి బ్లాక్, మంచిర్యాల జిల్లాలో తాండూర్‌ నుంచి శ్రావణ్‌పల్లి బ్లాక్, కాసిపేట నుంచి ఇందారం బ్లాక్, చెన్నూర్‌ బ్లాక్‌లలో బొగ్గు నిల్వలు ఉన్నట్లు నిర్ధారించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ములుగు బ్లాక్, చంద్రపల్లి నుంచి మహదేవపూర్‌ బ్లాక్, పెద్దపల్లి జిల్లాలో రామగుండం బ్లాక్, ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి బ్లాక్, భద్రద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు బ్లాక్, ఎల్లెందు, కొత్తగూడెం, లింగాల–కోయగూడెం, అనిశెట్టిపల్లి–మనుబోతుల గూడెం బ్లాక్‌లలో బొగ్గు నిక్షేపాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో బయటపడిన బొగ్గు నిక్షేపాలలో భూగర్భ భౌగోళిక పరిస్థితులను బట్టి భూగర్భ, ఓపెన్‌కాస్ట్‌ గనులను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం కనుగొన్న ప్రాంతాలలో కొన్ని మూసివేతకు గురైన బొగ్గు గనులు ఉండడం, వీటి పరిధిలో ఇంకా బొగ్గు నిక్షేపాలు ఉండడం గమనార్హం. మూతపడ్డ గనుల స్థానంలో కొత్తగా ఓపెన్‌కాస్ట్‌ గనులను ప్రతిపాదించనున్నారు. కొత్త ప్రాంతాల్లో భూగర్భ గనుల తవ్వకాలు చేపట్టేందుకు సింగరేణి కసరత్తు చేస్తోంది.



మంచిర్యాల జిల్లా టాప్‌

బొగ్గు సంపద అపారంగా ఉన్న జిల్లాల్లో మంచిర్యాల జిల్లా ప్రథమ స్థానంలో నిలుస్తుండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ద్వితీయ స్థానం దక్కించుకుంది. మంచిర్యాల జిల్లాలో 3547.36 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలు బయటపడగా వీటిలో నుంచి ఇప్పటి వరకు 254.49 మిలియన్‌ టన్నుల బొగ్గు మాత్రమే వెలికి తీశారు. ఇంకా భూగర్భంలో 3297.87 మిలియన్‌ టన్నులు ఉన్నట్లు తేల్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3,172.41 మిలియన్‌ టన్నుల బొగ్గు వనరులను గుర్తించగా ఇప్పటివరకు 447.02 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి చేశారు. ఇంకా 2725.39 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉత్పత్తి చేయాల్సి ఉంది. పెద్దపల్లి జిల్లాలో 2185 మిలియన్‌ టన్నులు బొగ్గు సంపద బయట పడగా ఇంతవరకు 438.08 మిలియన్‌ టన్నులు వెలికితీశారు. మరో 1746.54 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు మిగిలి ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 550.55 మిలియన్‌టన్నులు గుర్తించగా.. 35.54 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్తత్తి జరిగింది. ఇంకా 515.01 మిలియన్‌ టన్నుల బొగ్గు వనరులు ఉన్నాయి.



జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 1741.53 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలకు గాను ఇంతవరకు 26.35 మిలియన్‌ టన్నుల బొగ్గును వెలికి తీశారు. మరో 1715.18 మిలియన్‌ టన్నుల బొగ్గు వనరులు మిగిలి ఉన్నాయి. కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో 592.77 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలకు 47.55 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. ఇంకా 545.22 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు బొగ్గు వెలికితీతలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, పెద్దపల్లి జిల్లా ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. ఈ తీరుగా సింగరేణి  భవిష్యత్తు ప్రధానంగా మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలపైనే ప్రధానంగా ఆధారపడి ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top