అనుకున్నంతా అయింది..

అనుకున్నంతా అయింది..

ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) :

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సాహించాలనే అత్యుత్సాహంతో జిల్లా అధికారులు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కొన్నివర్గాలకు శాపంగా పరిణమిస్తున్నాయి. రేషన్‌ సరుకులను కూడా నగదు రహితంగానే సరఫరా చేయాలని ఆదేశాలిచ్చిన అధికారులు అందుకు తగిన సౌకర్యాలు కల్పించకపోవడంతో అటు లబ్దిదారులు, ఇటు రేషన్‌ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా డిశంబర్‌ ఒకటవ తేదీ నుండి కేవలం స్వైపింగ్‌ యంత్రాల ద్వారా మాత్రమే రేషన్‌ సరుకులు సరఫరా చేయాలని, లబ్దిదారులకు డెబిట్, క్రెడిట్, రూపే వంటి కార్డులు లేని పక్షంలో వారికి డీలర్లు సరుకులను అప్పుగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఐతే అందుకు తగిన యంత్రాలను సరఫరా చేయలేదని, డీలర్లకు వాటి వినియోగంపై అవగాహన కూడా కల్పించ కుండా నగదు రహిత లావాదేవీలు చేయడం ఎలా సాధ్యపడుతుందనే కోణంలో సాక్షి దినపత్రిక గత మంగళవారం ఒక ప్రత్యేక థనం ప్రచురించింది. ఈ మేరకు ఆ అనుమానాన్ని నిజం చేస్తూ జిల్లాలో ఒక్క స్వైపింగ్‌ యంత్రాన్ని కూడా అధికారులు సరఫరా చేయలేకపోయారు. గతంలో డీలర్ల వద్ద ఉన్న ఈ పోస్‌ యంత్రాల్లోనే స్వైపింగ్‌ సౌకర్యం ఉందని దానిని వినియోగించి, నగదు రహిత లావాదేవీలు చేయాలని సూచించారు. ఐతే ఆ యంత్రాల వినియోగంపై కూడా డీలర్లకు అవగాహన కల్పించకపోవడంతో ఈ నెల తొలిరోజు మొత్తం జిల్లా వ్యాప్తంగా కేవలం అప్పుగా మాత్రమే సరుకులను సరఫరా చేయాల్సి వచ్చింది. 

1300 మంది డీలర్ల వద్ద స్వైపింగ్‌ అవకాశం..

జిల్లా వ్యాప్తంగా 2,140 మంది రేషన్‌ డీలర్లు ఉండగా వారిలో సుమారు 1300 మంది వద్ద విజన్‌టెక్‌ కంపెనీకి చెందిన ఈ పోస్‌ యంత్రాలు ఉన్నాయి. మరో సుమారు 850 మంది వద్ద ఎనలాజిక్‌ కంపెనీకి చెందిన ఈ పోస్‌ యంత్రాలు ఉన్నాయి. వీటిలో విజన్‌టెక్‌ యంత్రాల్లో డెబిట్‌ తదితర కార్డులతో  స్వైపింగ్‌ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. కానీ వాటి వినియోగంపై డీలర్లకు అవగాహన కల్పించకపోవడంతో ఈ నెలకు మొత్తం రేషన్‌ సరుకులను అప్పుగానే ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తంమీద  జిల్లా వ్యాప్తంగా రేషన్‌ సరుకులు అప్పుగా ఇవ్వాల్సి వస్తే తమ పెట్టుబడి మొత్తం ప్రజల వద్దనే ఉండిపోతుందని డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. 

రెండు నెలలది ఒకేసారి ఎలా కట్టేది..

తుపాకుల ఆదిలక్ష్మి. తెల్లరేషన్‌ కార్డు లబ్దిదారు

ఈ నెల రేషన్‌ సరుకులకు గాను రూ.46 చెల్లిస్తే సరిపోయేది. దాని నిమిత్తం నేను డబ్బులు కూడా తీసుకువచ్చాను. కానీ డీలర్‌ నా వద్ద డబ్బు తీసుకోకుండా అప్పుగా ఇస్తున్నానని చెప్పి సరుకులు ఇచ్చేశారు. వచ్చే నెల అదేదో కార్డు తీసుకురమ్మాన్నారు. అదేంటోకూడానాకు తెలవదు. ఒకే సారి రెండు నెలల డబ్బు చెల్లించడమంటే నాలాంటి కూలీనాలీ చేసుకునేవారికి కష్టమే.

కార్డు ఉంది.. డీలర్‌వద్ద మిషనే లేదు..

సీహెచ్‌ దుర్గా ప్రసాద్, తెల్లరేషన్‌ కార్డు లబ్దిదారు.

నాదగ్గర డెబిట్‌ కార్డు ఉంది, ప్రభుత్వం ప్రకటించినట్లు నగదు రహిత లావాదేవీలకు నేను సిద్ధంగా ఉన్నాను. ఐతే రేషన్‌ డీలర్‌ వద్ద స్వైపింగ్‌ మిషన్‌ లేకపోవడంతో అప్పుగా ఇచ్చారు. కేవలం 40  50 రూపాయలే కాబట్టి ఇటువంటి వాటికి డబ్బు తీసుకుంటే సరిపోతుంది

 

 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top