నగరంలో షికారీ దొంగల అరెస్టు

నగరంలో షికారీ దొంగల అరెస్టు - Sakshi

సాక్షి, విజయవాడ :

 విజయవాడ నగరంలో అంతర్రాష్ట్ర షికారీ దొంగల ముఠాలోని ఇద్దరు సభ్యులను విజయవాడ కమిషనరేట్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నగరంలో దొంగతనాలు పెరుగుతున్న క్రమంలో కమిషనర్‌ గౌతం సవాంగ్‌ ఆదేశాలతో సీసీఎస్‌ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఈక్రమంలో కర్నాటక రాష్ట్రంలో పేరుమోసిన షికారీ దొంగలు  కొప్పల్‌ గ్రామానికి చెందిన ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 5 లక్షల విలువైన బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. విలాసాలకు అలవాటు పడిన దంపతులు రాత్రిపూట దేవాలయాల్లో దొంగతనాలు చేయడాన్ని ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారు. కర్నాటక రాష్ట్రం కొప్పల్‌ గ్రామానికి చెందిన షికారి జెమినీ అలియాస్‌ జమునా ఆమె భర్త అంబానీలు కొన్ని నెలలుగా విజయవాడ వన్‌టౌన్‌లోని వినాయకుడి గుడి వద్ద జీవిస్తున్నారు. జమునా కుమారుడు, ఆమె భర్త అంబానీ సోదరులు రవి, చిమూరు, అంబానీ స్నేహితులు విక్రమ్, ప్రసాద్‌లు కలిసి ముఠాగా ఏర్పడారు. 

రాత్రి వేళల్లో.. ఆలయాల టార్గెట్‌

రాత్రిపూట వివిధ ప్రాంతాల్లో సంచరించి దేవాలయాలను పరిశీలించేవారు. ముఠాలో సభ్యుడిగా ఉన్న ప్రసాద్‌ కర్నూలు జిల్లా నుంచి వచ్చి విజయవాడలో ఉంటున్నాడు. ఇతనికి అంబానీ పరిచయం కావడంతో జల్సాల కోసం వీరితో కలిసి దొంగతనాల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో వీరు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇబ్రహీంపట్నం సమీపంలోని ఫెర్రీలో ఉన్న అంకమ్మ తల్లి గుడి తాళాలు పగులగొట్టి వెండి, బంగారు నగలను దొంగలించారు. ఈఏడాది మార్చి నెలలో గుంటుపల్లిలోని శివాలయం గుడి తాళాలు పగులగొట్టి నగదు దొంగలించారు. అలాగే వీరందరు కలిసి ఈ ఏడాది  ఏప్రిల్‌లో ఇబ్రహీంపట్నం  ఈలప్రోలులోని సాయిబాబా గుడి తాళాలు పగులకొట్టి బంగారం, వెండి అభరాణాలతో పాటు రాగి వస్తువులు, హుండీలోని నగదు దొంగిలించి పారిపోయారు.

పగటి వేళల్లో తిరుగుతూ పథక రచన

రాత్రిపూట దొంగతనాలు చేయడం, పగటివేళల్లో నిర్జీవ ప్రాంతాల్లో తిరుగుతూ పథక రచన చేయడం వీరి అలవాటు. అలాగే ఈ ఏడాది మే నెలలో సత్యనారాయణపురం పరిధిలోని సీతన్నపేటలోని దేవాలయంలో, జూన్‌లో పాయకాపురంలోని సాయిబాబా గుడిలో, గొల్లపూడిలోని ల్యాంకో కాలనీలో శ్రీమహలక్ష్మి నారాయణ స్వామి ఆలయాల్లోని హుండీలు పగులగొట్టి నగదు, వెండి, బంగారం అపహరించారు. దొంగతనాలు చేసే సమయంలో ఇద్దరు బయట కాపలా ఉండడం, మిగిలిన వారు లోనికి వెళ్లి వస్తువులు దొంగిలించడం వీరు అలవాటు. 

దొరికిపోయారు ఇలా..

ఈ క్రమంలో ఆదివారం ఉదయం వస్త్రలత వెనక వీధిలో వస్తువులను విక్రయించేందుకుS వచ్చిన ప్రసాద్‌ అంబానీ భార్య షికారీ జెమినీ అలియాస్‌ జమునను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 5 లక్షలు విలువైన 50 గ్రాముల బంగారం, 10 కిలోల వెండి, 10 కిలోల రాగి, రూ. 5 వేల నగదును సీసీఎస్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

 

whatsapp channel

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top