రాజధాని శంకుస్థాపనకు వారం రోజుల ఉత్సవం

రాజధాని శంకుస్థాపనకు  వారం రోజుల ఉత్సవం - Sakshi


♦ 13 జిల్లాల నుంచి జ్యోతులు

♦ భూములిచ్చిన రైతులకు చీర, ధోవతులతో ఆహ్వానాలు

♦ కమిటీ సమావేశం అనంతరం మంత్రి నారాయణ వెల్లడి

 

 సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణ శంకుస్థాపనను పురస్కరించుకుని పండుగ వాతావరణాన్ని తలపించేలా రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు. కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్‌లు, పలువురు ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులతో సోమవారం రాత్రి ఆర్గనైజింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన నారాయణ మీడియాకు వివరాలు వెల్లడించారు.  రాష్ర్టంలోని 13 జిల్లాల ప్రజలు కాగడాలతో వెలుగుతున్న జ్యోతిని శంకుస్థాపన ప్రాంతానికి తీసుకొచ్చేలా కార్యచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు.



అన్ని గ్రామాల నుంచి సేకరించే మట్టితో ప్రతిమ తయారుచేసే బాధ్యత దేవాదాయ, కల్చరల్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించినట్టు తెలిపారు. రాజధాని ఎంపిక, నిర్మాణానికి చర్యలపై మంత్రివర్గ, అసెంబ్లీ తీర్మానాలను ఆ ప్రాంతంలో ప్రదర్శిస్తామని చెప్పారు. భూములిచ్చిన 23వేల మంది రైతులకు చీరా,ధోవతులతో ఆహ్వానపత్రం అందించే బాధ్యతను గుం టూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేకు అప్పగించినట్టు చెప్పారు. అమరావతి రాజధాని చిహ్నం ఇంకా ఎంపిక కాలేదని, దీనిపై చిత్రలేఖన పోటీలు నిర్వహించి బహుమతి అందించి దాన్ని ఎంపిక చేస్తామని చెప్పారు.



 పీఎంతోపాటు.. సీఎంలకూ ఆహ్వానం..

 ప్రధాని నరేంద్రమోదీతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ శంకుస్థాపనకు ఆహ్వానిస్తామని మంత్రి చెప్పారు. మోదీ వస్తానని చెప్పారని, సింగపూర్, జపాన్ ప్రధానులు, మంత్రుల ఆమోదం ఇంకా లభించలేదని తెలిపారు. పెద్ద సంఖ్యలో వీఐపీలు తరలివచ్చే అవకాశం ఉన్నందున గన్నవరం విమానాశ్రయం ఎక్కువ ప్లైట్స్ ల్యాండింగ్‌కు సరిపోదని, హైదరాబాద్, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలను ఉపయోగించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top