శఠగోపం

శఠగోపం


► కౌలు రూ.15 లక్షలు, నీటితీరువా బకాయి ఐదు లక్షలు

► 27న ఆలయ భూముల సాగుకు వేలం జలుమూరు




ప్రసిద్థ శైవక్షేత్రం శ్రీముఖలింగేశ్వరునికి కౌలుదారులు శఠగోపం పెడుతున్నారు. మరికొంతమంది ఆలయ భూముల కబ్జాకు పూనుకుంటున్నారు. భూములను అనుభవిస్తున్నవారు కూడా శిస్తు, చెల్లించకుండా ఎగనామం పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా దేవాదాయ, రెవెన్యూశాఖల అధికారులు కనీస చర్యలు తీసుకోపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



(నరసన్నపేట): శ్రీముఖలింగేశ్వరస్వామి పేరున జిల్లాలోని పలుచోట్ల భూములున్నాయి. ముఖలింగంలోని ఆలయ పరిధిలోనే 28.99 ఎకరాలు ఉండగా.. ఎల్‌ఎన్‌పేట మండలంలో 15, పాతపట్నంలో 18 ఎకరాలు ఉన్నాయి. అలాగే ఈ పరిధిలోకి వచ్చే రా«ధాగోవిందస్వామి ఆలయానికి చెందిన 60 ఎకరాలతోపాటు.. నరసింహాస్వామి దేవాలయ భూములు 120 ఎకరాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకూ ఆక్రమణలకు గురైంది. అలాగే మరికొందరు కౌలు పద్ధతిలో ఆలయ భూములను సాగు చేస్తున్నప్పటికీ దేవాదాయశాఖకు మాత్రం రూపాయి కూడా చెల్లించడం లేదు. భూమి శిస్తుగా సుమారు 15 లక్షల రూపాయలు రైతులు చెల్లించాల్సి ఉందని ఆలయ ఈఓ వీవీఎస్‌ నారాయణ ‘సాక్షి’కి తెలిపారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు పేర్కొన్నారు. ఆలయ భూములకు నీటితీరువా బకాయి సుమారు ఐదు లక్షల రూపాయలు ఉన్నట్లు తహసీల్దార్‌ కె.ప్రవళ్లికా ప్రియ తెలిపారు. నీటి తీరువా వసూలు కోసం రైతులకు నోటీసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.



అధికారులు విఫలం:  స్వామి వారి భూముల పరిరక్షించడంలో ఆలయ అధికారులతోపాటు రెవెన్యూ అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. శ్రీముఖలింగం దేవాలయ భూమికి సంబంధించి రెండేళ్ల క్రితం వంశధార కరకట్టల నిర్మాణ కాంట్రాక్టర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, భేమేశ్వర ఆలయం పక్కనే సుమారు రూ. 50 లక్షలు విలువైన మట్టిని ఎటువంటి అనుమతులు లేకుండానే తరలించాడు. స్వామి వారి భూములకు రక్షణ లేదనేందుకు దీన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. కేంద్రపురావస్తు శాఖ ఆదేశాల మేరకు ఆలయాలకు 100 నుంచి నుంచి 200 మీటర్ల దూరం వరకూ ఎటువంటి తవ్వకాలు జరపకూడదన్న నిబంధన ఉన్నా దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆర్టీవో స్థాయి అధికారి అప్పట్లో సందర్శించినప్పటికీ కాంట్రాక్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వీటితోపాటు డబ్బపాడు, శ్రీముఖలింగం తదితర గ్రామాల్లో ఆలయ భూములకు చాలా వరకూ అక్రమణదారులు చెరలో ఉన్నాయి. అధికారులు మేల్కొకపోతే ఆలయ భూములు కనుమరుగు కావడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.



ఫిర్యాదు చేస్తే ఆక్రమణలు తొలగిస్తాం: శ్రీముఖలింగేశ్వరుని దేవాలయ భూములు అన్యాక్రాంతం, ఆక్రమణలు జరిగినట్లుగా ఫిర్యాదులు వస్తే సర్వేతోపాటు పరిశీలన చేసి చర్యలు తీసుకుంటాం. అలాగే నీటి తీరువాకు సంబంధించిచి బకాయి వసూలుకు నోటీసీలు సిద్ధం చేస్తున్నాం. ---కె.ప్రవళ్లికా ప్రియ, తహసీల్దార్, జలుమూరు.





 27న దేవాలయ భూముల సాగుకు వేలం

 శ్రీముఖలింగంలో ఉన్న సుమారు 29.99 సెంట్ల భూమిని సాగుకు ఇచ్చేందుకు ఈనెల 27వ తేదీన వేలం నిర్వహించనున్నాం. అలాగే శ్రీముఖలింగంతోపాటు ఇతర గ్రామాల్లో ఉన్న స్వామి వారి భూములు ఆక్రమణల్లో ఉన్నాయి. దీనిపై రెవెన్యూ అధికారులు సర్వే జరిపి మాకు అప్పచెప్పాలి. అక్రమ తవ్వకాలు సమయంలో తాను ఇక్కడ లేను. ---వీవీఎస్‌ నారాయణ, ఈవో, శ్రీముఖలింగం దేవాలయం

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top