విద్యా సమస్యలపై సర్కారు దృష్టి


♦ ఏకీకృత సర్వీసు రూల్స్‌పై అన్ని శాఖలతో కమిటీ

 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎట్టకేలకు ఉపాధ్యాయ సమస్యలతోపాటు, పాఠశాల విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. పాఠశాల విద్యా శాఖలోని అన్ని విభాగాల అధికారులతో మంగళవారం హైదరాబాద్‌లోని డెరైక్టరేట్‌లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు ప్రత్యేకంగా సమావేశమై సమస్యలపై చర్చించారు. అంశాల వారీగా అధికారులతో పరిస్థితిపై సమీక్షించారు. వీటిపై ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించాక  తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలివి..



►ఎయిడెడ్ టీచర్ల నుంచి రికవరీ చేస్తున్న ఇంక్రిమెంట్ల మొత్తంపై చర్చించారు.

► ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న పండిట్, పీఈటీల అప్‌గ్రెడేషన్‌పై చర్చ జరిగింది.

► ఉర్దూ మీడియం స్కూళ్లలో కాంపోజిట్ కోర్సుగా అరబిక్‌ను ప్రవేశ పెట్టాలన్న డిమాండ్ ఉంది.

► ఇప్పటివరకు రాష్ట్రంలోని 24.80 లక్షల మంది విద్యార్థులకు అవసరం అయ్యేలా 1,73,93,042 పాఠ్య పుస్తకాలను ముద్రించి పంపిణీ చేశారు. అయితే మెదక్, రంగారెడ్డి, వరంగల్‌లో అదనంగా మరో 18 లక్షల పాఠ్య పుస్తకాలు కావాలని కోరారు. దీంతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు.

► డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్) ప్రైవేటు కాలేజీల అఫిలియేషన్ల వ్యవహారాన్ని త్వరలోనే తేల్చాలని నిర్ణయించారు. నవంబరు మొదటి వారంలో తరగతులను ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించారు.

► బాల్కొండ, శంకర్‌పల్లిలో కొత్తగా బాలికల హాస్టళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. అలాగే కీసరగుట్టలో గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి ఆమోదం తెలిపారు.

► ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్‌పై అన్ని శాఖల అధికారులతో ఉన్నత స్థాయి కమిటీ ఏరా్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top