పాలకుల పాపం.. అధికారులకు శాపం!

పాలకుల పాపం.. అధికారులకు శాపం! - Sakshi

- నగర పాలక సంస్థ అభివృద్ధి పనుల్లో అక్రమాలు

- గత ఏడాది 172 పనులపై విచారణ

- విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్న డీఎంఏ

- బాధ్యులైన అధికారులపై వేటు పడే అవకాశం

- పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గి..బలవుతున్న అధికారులు

 

అనంతపురం న్యూసిటీ : అనంతపురం నగర పాలక సంస్థలో పాలకులు చేస్తున్న పాపాలు అధికారుల మెడకు చుట్టుకుంటున్నాయి. పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గి తీసుకున్న నిర్ణయాల కారణంగా అధికారులు బలయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. గత ఏడాది కార్పొరేషన్‌ పరిధిలో జరిగిన అభివృద్ధి పనుల్లో అక్రమాలపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు.. ప్రస్తుతం విచారణ నివేదిక ఆధారంగా చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాధ్యులైన అధికారులపై వేటు పడే అవకాశాలున్నాయి. నగర పాలక సంస్థ ప్రస్తుత పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా అభివృద్ధి పనుల పేరిట రూ.70 కోట్ల వరకు ఖర్చు చేశారు. వీటిలో గత ఏడాది చేపట్టిన పనులు వివాదాస్పదమయ్యాయి. గత ఏడాది నవంబర్‌లో సోమనారాయణ కమిషనర్‌గా ఉన్నప్పుడు రూ.3 కోట్ల బిల్లులను తెరపైకి తెచ్చారు. ఆయన రిలీవ్‌ కాగానే వాటిని ఒక్కసారిగా రూ.10 కోట్లకు  పెంచారు. దీనిపై ఈ ఏడాది జనవరి 10న ‘సాక్షి’ దినపత్రిక ‘డబ్బుల్‌ పనులు’ శీర్షికతో  కథనం ప్రచురించింది. 134 టెండర్‌ పనులకు రూ.4 కోట్ల 25 లక్షల 95 వేల 247, అలాగే 59 నామినేషన్‌ పనులకు రూ.87,67,998లు,  158 డిపార్ట్‌మెంటల్‌ పనులకు రూ 2 కోట్ల 59 లక్షల 38 వేల 753, బాక్స్‌ టెండర్లకు సంబంధించి 281 పనులకు రూ.2.55 కోట్ల బిల్లులు పెట్టిన విషయాన్ని కథనంలో పేర్కొంది. అప్పటి కమిషనర్‌ సురేంద్రబాబు సైతం రూ.2 కోట్ల దొంగ బిల్లులు ఉన్నాయని మీడియా సమావేశంలోనే వెల్లడించారు. ఈ నేపథ్యంలో అప్పటి జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ బిల్లులను ఆపాలని, మొత్తం పనులపై విచారణ చేపట్టాలని పబ్లిక్‌హెల్త్‌ ఎస్‌ఈ శ్రీనాథ్‌ రెడ్డిని ఆదేశించారు. అయితే..నగర పాలక సంస్థ అధికారులు 172 పనులకు సంబంధించిన రికార్డులను మాత్రమే ఎస్‌ఈకి అప్పగించారు. వాటిపై విచారణ చేపట్టిన ఎస్‌ఈ జిల్లా కలెక్టర్‌కు ఈ ఏడాది మార్చిలో నివేదికను అందజేశారు. కలెక్టర్‌ ఆ నివేదికను డైరెక్టర్‌ ఆఫ్‌ మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీఎంఏ)కు 15 రోజుల క్రితం పంపించారు. బిల్లుల్లో చాలావరకు ‘బోగస్‌’ అనే విషయాన్ని విచారణ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నామినేషన్, డిపార్ట్‌మెంటల్‌ పనులు అత్యవసర నిమిత్తమే చేయాల్సి ఉండగా.. నిబంధనలను ఎలా ఉల్లంఘించారన్న విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఈ విషయంపై డీఎంఏ కన్నబాబు కూడా  సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటూ మూడు, నాలుగు రోజుల్లో ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని నగర పాలక సంస్థ వర్గాలు అంటున్నాయి. దీంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పాలకుల ఒత్తిళ్లతోనే తాము చేయాల్సి వచ్చిందని వారు వాపోతున్నారు. అలాగే వేటు నుంచి తప్పించుకునేందుకు కొందరు ఇప్పటికే  ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top