సమస్య మూలాల్లోకి కలెక్టర్‌


  •  ‘మీ కోసం’లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తక్షణ స్పందన

  • క్షేత్రస్థాయి అధికారులకు ముచ్చెమటలు

  • అనంతపురం సెంట్రల్‌ : మీకోసం కార్యక్రమంలో ప్రజలు అందజేస్తున్న వినతిపత్రాలపై కలెక్టర్‌ వీరపాండియన్‌ క్షేత్రస్థాయి అధికారులతో అప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నారు. సంబంధిత అధికారులకు అర్జీదారులను చూపిస్తూ ‘ఏమయ్యా.. ఈయన పేరు నీకు తెలుసా..? ఇదిగో ఈయన్ను ఎప్పుడైనా చూశావా? ఈయన సమస్య ఏమైంది. ఎన్నిరోజుల్లో పరిష్కరిస్తావ్‌..’ అంటూ అడుగుతున్నారు. స్థానిక రెవెన్యూ భవన్‌లో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ కొన్ని సమస్యలపై నేరుగా తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర అధికారులతో మాట్లాడారు. దీంతో ఎప్పుడు ఏ మండలం నుంచి కలెక్టర్‌కు ఫిర్యాదు వెళ్తుందోనని క్షేత్రస్థాయి అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి.


     


    కలెక్టర్‌ చర్చించిన ఫిర్యాదుల్లో కొన్నింటి వివరాలు


    •  కదిరి మండలం ముత్యాల చెరువుకు చెందిన అనసూయబాయి అనే యువతి 585 సర్వే నెంబర్‌లో తనకున్న ఏడెకరాల భూమిని తన దూరపు బంధువులు అక్రమించుకున్నారని ఫిర్యాదు చేశారు. తన పేరుతో పట్టాదారు పాసుపుస్తకాలు కూడా ఉన్నాయన్నారు. సమస్య చెప్పుకొందామంటే వీఆర్వో దగ్గరకు కూడా రానీయడని ఆవేదన చెందారు. దీంతో కలెక్టర్‌ కదిరి తహసీల్దార్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘ఆయనెవరో వీఆర్వో చంద్ర దగ్గరకు కూడా రానీయడటా.. అందుబాటులో ఉన్నాడా’ అని ప్రశ్నించారు. వెంటనే ఆమె సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.


     


    • రొద్దం మండలం ఆర్‌.లోచర్ల గ్రామానికి చెందిన ముత్యాలమ్మ కుటుంబ సభ్యులు తమ బియ్యం కార్డు తొలగించారని ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో కలెక్టర్‌ రొద్దం తహసీల్దార్‌తో వెంటనే వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సదరు కుటుంబసభ్యులు గ్రామంలోనే ఉన్నా ఎందుకు ఇన్‌యాక్టివ్‌ పెట్టారని ప్రశ్నించారు. కార్డును పునరుద్ధరించాలని డీఎస్‌ఓకు పంపినట్లు సదరు అధికారులు సమాధానం చెప్పారు.


     


    •  హైకోర్టు ఉత్తర్వుల మేరకు బోరు సీజ్‌ చేస్తే తిరిగి దానిని వినియోగిస్తున్నారని బత్తలపల్లి మండలం రామాపురానికి చెందిన ఓ రైతు కలెక్టర్‌ ఫిర్యాదు చేశారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నా మండలంలో మీరేం చేస్తున్నారని కలెక్టర్‌ తహశీల్దార్‌ను మందలించారు. వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించాలని ఆదేశించారు.


     


    •  వాటర్‌షెడ్‌ కార్యక్రమంలో భాగంగా భూములు కోల్పోయిన రైతుల ఖాతాలో జమ కావాల్సిన పరిహారం మొత్తాన్ని దళారుల ఖాతాలకు మళ్లించి సొమ్ము చేసుకున్నారని గుంతకల్లు మండలం బీసీ కాలనీకి చెందిన బాధిత రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రైతు సమ్మతి లేకుండా రూ.1.70 లక్షలు డ్వామా అధికారులు కాజేశారని తెలిపారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ గుంతకల్లు తహసీల్దారు, ఏపీడీతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అనంతరం దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని డ్వామా పీడీని ఆదేశించారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top