ప్రధాని వస్తున్నారు

ప్రధాని వస్తున్నారు - Sakshi


రాజధాని శంకుస్థాపనకు ఖరారైన నరేంద్ర మోదీ పర్యటన

 

♦22న ఉదయం 11.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి

♦ మధ్యాహ్నం 12.35 గంటలకు రాజధాని శంకుస్థాపన పూజ

♦ సాయంత్రం 4.05 గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్టులో టెర్మినల్ ప్రారంభం

♦ రాత్రి 7.30 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం

 

 సాక్షి, విజయవాడ బ్యూరో/గుంటూరు వెస్ట్: రాష్ట్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన ఖరారైంది. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్‌ను శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 22న ఉదయం 11.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని మోదీ మధ్యాహ్నం 12.35 గంటలకు అమరావతిలో జరిగే రాజధాని శంకుస్థాపన, ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4గంటలకు తిరుపతి చేరుకొని అక్కడి విమానాశ్రయంలో నూతన టెర్మినల్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకొని రాత్రి 7.30 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. ఇది ఇలా ఉండగా.. రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 13 జిల్లాల కలెక్టర్‌లు, దేవాదాయశాఖ అధికారులతో తన నివాసం నుంచి శుక్రవారం టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు.



 పండుగ వాతావరణం నెలకొల్పాలి

 సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని శంకుస్థాపన సందర్భంగా ఈ నెల 13 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొల్పాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ గ్రామంలోను మట్టిని, ఆ గ్రామ వాగు, కాల్వల నుంచి నీటిని సేకరించి అన్ని మతాల పెద్దల ఆశీస్సులు తీసుకుని రాజధాని ప్రాంతానికి చేర్చాలని సూచించారు. ప్రముఖశిల్పి రాజీవ్ సేథీ నేతృత్వంలో రాజధాని ప్రాంతంలో నిర్మించే చారిత్రక స్థూపం వద్ద వీటిని నిక్షిప్తం చేయాలని సీఎం చెప్పారు. రాష్ట్రంలోని 150 దేవాలయాలు, 50 క్రైస్తవ మందిరాలు, 50 మసీదులలో ప్రత్యేక పూజలు నిర్వహించేలా చూడాలని అన్నారు. రాష్ట్రంలోని 16వేల గ్రామాల నుంచి పవిత్ర పసుపు పత్రాలను సేకరించి కాలనాళిక(టైమ్ క్యాప్స్యూల్)లో భద్రపరచాలని అన్నారు. రాజధాని నిర్మాణంపై సీఆర్‌డీఏ రూపొందించిన బుక్‌లెట్‌లను పాఠశాలలు, కళాశాలలకు పంపాలని సీఎం ఆదేశించారు.



 శంకుస్థాపనకు శాఖల వారీగా ఖర్చు

 రాజధాని శంకుస్థాపనకు ఖర్చు ఎంత అన్నది ఒకటి, రెండు రోజుల్లో ఓ అంచనాకు వస్తుందని, ప్రస్తుతం ప్రభుత్వ శాఖల వారీగా పనులు అప్పగించి ఖర్చులు ఆయా శాఖలు భరించేలా చర్యలు తీసుకున్నట్టు మంత్రి నారాయణ చెప్పారు. సీఆర్‌డీఏ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆహ్వానపత్రం దగ్గర్నుంచి శంకుస్థాపన బహిరంగసభ వరకు ముఖ్యమైన ప్రభుత్వ శాఖలకు బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. కేసీపీ సిమెంట్స్ సంస్థ లక్ష మోడ్రన్ ఇటుకలను రాజధాని కోసం ఇస్తున్నారని ఆయన ప్రకటించారు.



 అధికారులు సమన్వయంతో పనిచేయాలి

 శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. గుంటూరులో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన ప్రధానమంత్రితోపాటు పది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, స్పీకర్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, వివిధ దేశాల రాయబారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 2.50 లక్షల మంది ప్రజలు ఈ వేడుకలో పాల్గొంటారని భావిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చే అతిథుల వసతి కోసం ప్రభుత్వ, ప్రైవేట్ వసతి గృహాలను గుర్తించాలని సూచించారు. శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న ప్రాంతానికి వెళ్లే రోడ్లన్నీ ఈనెల 18 లోపు పూర్తిచేయాలన్నారు.



 ప్రధానమంత్రి పర్యటన షెడ్యూలు ఇలా..

 ప్రధాని మోదీ ఈనెల 22న ఉదయం 11.45 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 11.55 గంటలకు గన్నవరం నుంచి అమరావతి బయలుదేరతారు. మధ్యాహ్నం 12.35 గంటలకు అమరావతిలో జరిగే రాజధాని శంకుస్థాపన, ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. 12.45 గంటలకు సభావేదికపై ఆలపించే మా తెలుగుతల్లి గీతాలాపన కార్యక్రమంలో పాల్గొని, 1.40 గంటల వరకూ వేదికపై జరిగే కూచిపూడి నృత్య కార్యక్రమాలను వీక్షిస్తారు. 1.20 గంటలకు సీఎం చంద్రబాబు ప్రారంభోపన్యాసం, ఆ తర్వాత సింగపూర్ ప్రతినిధులు, కేంద్ర మంత్రుల ప్రసంగాల తర్వాత ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.



మధ్యాహ్నం 2.40 గంటలకు అమరావతి నుంచి తిరుపతి పయనమవుతారు. 3.05 గంటలకు గన్నవరం నుంచి విమానంలో బయలుదేరి 4 గంటలకు తిరుపతి చేరుకుంటారు. సాయంత్రం 4.05 గంటలకు తిరుపతి విమానాశ్రయంలో నూతన టెర్మినల్ ప్రారంభిస్తారు. 5.25 గంటలకు తిరుమలకు చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకుంటారు. సాయంత్రం 6.30కు తిరుమల నుంచి బయల్దేరుతారు. రాత్రి 7.30 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి ఢిల్లీ తిరుగు ప్రయాణమవుతారు.

 

 ప్రధాన మంత్రి హోదాలో తొలిసారి

 సాక్షి, తిరుమల: ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోదీ తొలిసారి తిరుమలకు రానున్నారు. ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలకాలని, ఆయన బస చేసేందుకు వీలుగా ఇక్కడి పద్మావతి అతిథిగృహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని టీటీడీ ఈవో డి.సాంబశివరావు అధికారులను ఆదేశించారు. ప్రధానితోపాటు సీఎం చంద్రబాబు తిరుమలకు రానున్నారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత 2014, మే ఒకటిన ఎన్నికల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోదీ తిరుమలకు వచ్చారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top